కొణిజర్ల: పిల్లల సెలవులు కొద్ది రోజుల్లో ముగియనున్నాయి.. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఆ దంపతులు ఊళ్లో ఉంటున్న తల్లిదండ్రులతో కలిసి తిరుమల వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ క్రమంలో కారులో స్వగ్రామానికి వస్తుండగా లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్(40) భార్య సుజాత(35), కుమారులు దివిజిత్ శ్రీరామ్, అశ్విత్ శ్రీరామ్(13)తో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రగతినగర్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. పిల్లలకు వేసవి సెలవులు ముగియనుండడంతో విప్పలమడకలో ఉంటున్న తల్లిదండ్రులతో కలిసి తిరుమల తిరుపతి వెళ్లాలని రాజేష్ భావించారు.
ఈ క్రమంలో కారులో హైదరాబాద్ నుంచి విప్పలమడకకు బుధవారం రాత్రి బయలుదేరారు. ఇంతలోనే కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపాన జాతీయ రహదారిపై ఒక ట్యాంకర్ మరమ్మతుకు రావడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. ఆ ట్యాంకర్ వెనుకాల మరో లారీ ట్యాంకర్‌ను డ్రైవర్ నిలిపివేశాడు. అదే క్రమంలో రాజేష్ కూడా తమ కారుని ఆపాడు. అయితే, వెనుక నుంచి మరో లారీ అతివేగంగా వచ్చి వీరి కారును బలంగా ఢీకొట్టడంతో రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఘటనలో రాజేష్, సుజాత, అశ్విత్ ఘటనాస్థలిలోనే మృతి చెందగా పెద్దకుమారుడు దివ్యజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో అర గంటలో ఇంటికి చేరతారనగా ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్
Comments
Please login to add a commentAdd a comment