నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. డిగ్రీలు పూర్తి చేసిన వేలాది మంది కొలువుల కోసం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల పలు శాఖలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దీంతో ఆయా పరీక్షలకు పోటీ పడేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఏటా సుమారు 40వేల మంది ఉన్నత విద్య పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో పడుతున్నారు. సు మారు 1,600 మంది బీఈడీ, డీఈడీ పూర్తి చేసి టెట్, డీఎస్సీలకోసం ఎదురు చూస్తున్నారు.
పది వేల మంది వరకు ఇంజినీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్ వంటి కోర్సులు పూర్తి చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా వంటి కోర్సులు పూర్తి చేస్తున్న వేలాది మంది ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు వెతుక్కొంటుండగా, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశతో నోటిఫికేషన్లకోసం ఎదురు చూస్తూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఏటా వేలాది మంది నిరుద్యోగులు తయారవుతుండగా, ప్రభుత్వం వందలలో కూడా పోస్టులు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. పీజీలు పూర్తి చేసినవారు సైతం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులున్నాయి. దీంతో వారు చిన్న ఉద్యోగాలకు పోటీ పడాల్సి వస్తోంది.
త్వరలో ‘మెడికల్’ పోస్టులు
మెడికల్ కళాశాల పోస్టులకు సంబంధించి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో జరిగే వైద్యశాఖ అధికారుల సమావేశం అనంతరం నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తోంది. సుమారుగా 210 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్, డ్రైవర్, అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులనూ భర్తీ చేస్తారు. జిల్లా విద్యాశాఖకు సంబంధించి డీఎస్సీ ద్వారా 1,173 టీచర్‌పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈనెలలో టెట్, వచ్చేనెలలో డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పార్థసారథి ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీఎస్సీపైనా నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అలాగే అంగన్‌వాడీ పోస్టులనూ భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతుండడంతో నిరుద్యోగులలో ఆశలు రేకెత్తుతున్నాయి.
కొలువుల జాతర
Published Tue, Jan 7 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement