సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగులకు దినదినగండంలా ఉంది. ఒక్కోరోజు గడుస్తుంటే వేలాది మంది ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోతున్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వం ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయించకపోవడమే. ఏటా ఉద్యోగ నియామకాలంటూ చెప్పి ఈ నాలుగున్నరేళ్లలో 2016లో మాత్రమే 4,275 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా అవి వెలువడడం లేదు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఈ ఏడాది సెప్టెంబర్ 19న 18,450 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్లు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి దాటిపోతున్న నిరుద్యోగులు ఆందోళనతో ఉన్నారు. గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం 34 ఏళ్లనుంచి 42 ఏళ్లకు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఇప్పటివరకూ నోటిఫికేషన్లు లేకపోవడంతో ఆ వయో పరిమితిని మించిపోయిన వేలాది మంది ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినా కనీసం దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్‌లు తీసుకున్న నిరుద్యోగుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. పుట్టిన తేదీ, గరిష్ట వయోపరిమితిపై లెక్కలు వేసుకుంటూ రోజులు లెక్కపెట్టుకోవలసిన దుస్థితిలోకి ప్రభుత్వం తమను నెట్టిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఒక్కో ఏడాదికి పరిమితి పెంపు..
గరిష్ట వయోపరిమితిని 2014లో 34 ఏళ్లనుంచి 40 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం తరువాత దాన్ని 42 ఏళ్లకు పెంచింది. ఈ గరిష్ట వయోపరిమితి పెంపును కేవలం ఒక్కో ఏడాదికి మాత్రమే పరిమితం చేస్తూ ఏటా ఉత్తర్వులు ఇస్తోంది. 2016లో 42 ఏళ్లకు పెంచిన సమయానికే వేలాది మంది వయోపరిమితి మించిపోయి అవకాశం కోల్పోయారు. ఆతరువాత నుంచి నోటిఫికేషన్లు లేక మరిన్ని వేలమంది వయోపరిమితి గండంలో చిక్కుకున్నారు. పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లు పెంచడమే కాకుండా దాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఫలితంగా అక్కడి నిరుద్యోగులకు కనీసం దరఖాస్తు చేసుకొనేందుకైనా అవకాశం దక్కుతోంది. ఏపీలో మాత్రం 42 ఏళ్లకే పరిమితం చేయడం.. మూడేళ్లుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు.
డీఎస్సీ, యూనిఫాం పోస్టులకు రెండేళ్లు పెంచి..
ప్రభుత్వం ఆమోదించిన 18,450 పోస్టుల్లో డీఎస్సీ ద్వారా భర్తీ చేసే టీచర్ పోస్టులకు, ఎస్‌ఐ తదితర యూనిఫాం పోస్టులకు పెంచిన గరిష్ట వయోపరిమితికి అదనంగా మరో రెండేళ్లు పెంచారు. దీని ప్రకారం డీఎస్సీ పోస్టులకు 44 ఏళ్లు, యూనిఫాం పోస్టులకు ప్రస్తుతమున్న గరిష్ట వయోపరిమితికి అదనంగా రెండేళ్లు అవకాశం కల్పించారు. అయితే ఏపీపీఎస్సీ పరిధిలో భర్తీచేయాల్సిన పోస్టుల విషయంలో మాత్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఇలాంటి అవకాశం ఇవ్వడం లేదు. మూడేళ్ల నుంచి నోటిఫికేషన్లు లేవు కనుక గరిష్ట వయోపరిమితిని కనీసం మరో రెండేళ్లు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతమున్న వయోపరిమితి ప్రకారమే అయితే లక్షలాది మంది దరఖాస్తు చేసుకోవడానికీ అవకాశం కోల్పోతామని నిరుద్యోగులు చెబుతున్నారు.
పోస్టులకు ఆమోదం తెలిపి నెలలు గడిచినా..
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడానికి మంత్రివర్గంలో ఆమోదం తెలిపామని నాలుగు నెలల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఆతరువాత దానిపై జీవో ఇవ్వడానికి నెలన్నర సమయం తీసుకుంది. అయితే నోటిఫికేషన్లను మాత్రం ప్రభుత్వం విడుదల చేయించడం లేదు. ఈ పోస్టుల్లో గ్రూప్1–182, గ్రూప్2–337, గ్రూప్3–1,670, హోంశాఖ 3,000, మెడికల్ 1,604, లెక్చరర్లు 725, ఇతర పోస్టులు 1,657, టీచింగ్ 9,275, మొత్తం 18,450 పోస్టులను ప్రకటించి డీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు వరకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. కీలకమైన ఏపీపీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు.
నిరుద్యోగులకు ‘వయో’ గండం
Published Mon, Nov 19 2018 4:04 AM | Last Updated on Mon, Nov 19 2018 10:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment