ఏపీపీఎస్సీ సభ్యులు రాజీనామా చేయాలని ఒత్తిడి
జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్) పోలా భాస్కర్ మితివీురిన స్వామి భక్తి
సర్వీస్ కమిషన్ సభ్యులు ఆరేళ్లు లేదా 62 ఏళ్ల వయసు వరకు కొనసాగే అవకాశం
కానీ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరింపులు.. ఐఏఎస్‌లే విస్తుపోతున్న వైనం
రాజీనామా చేయకుంటే తప్పుడు కేసులు పెట్టి ఒత్తిడి తేవాలని కుట్ర
సమాచార హక్కు కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై కూడా ఒత్తిడి
గతంలో టీడీపీ పాలనలో వచ్చిన సభ్యులు జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగింపు
ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డుల్లోనూ చైర్మన్లుగా బాధ్యతల నిర్వహణ
ప్రొఫెసర్ పద్మరాజు పదవీ కాలం తర్వాత నన్నయ వర్సిటీ వీసీగా నియామకం
చివరిరోజు వరకు కొనసాగిన నాటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్
ఇప్పుడు తద్భిన్నంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాజ్యంగ వ్యవస్థలపై దాడికి దిగింది. రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్న వారు సైతం వెంటనే దిగిపోవాలని ఒత్తిడి తెస్తోంది. ఇదివరకు టీడీపీ ప్రభుత్వ (2014–2019) హయాంలో ఆయా రాజ్యాంగబద్ధ పదవుల్లో నియమితులైన వారు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొనసాగారన్న వాస్తవాన్ని ప్రస్తుత టీడీపీ సర్కారు విస్మరించి కక్ష సాధింపులకు దిగింది. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు ఇతర సభ్యులను, సమాచార హక్కు చట్టం కమిషనర్లతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై కూడా ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయాలని తీవ్ర ఒత్తిడి తెస్తోంది.
రాజ్యాంగం సృష్టించిన ఈ పోస్టుల్లో నియమితులైన వారు ప్రభుత్వాలు మారినా పదవీ కాలం పూర్తయ్యే వరకు తొలగించడం వీలు కాదు. గతంలో రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే విధానం కొనసాగింది. అలాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనూ గత టీడీపీ ప్రభుత్వంలో నియమితులైన ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు పూర్తి కాలం కొనసాగారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా టీడీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. రాజ్యంగబద్ధమైన పోస్టుల్లో నియమితులైన వారికి పదవీ కాలం ముగిసే వరకు కొనసాగే అధికారం ఉన్నా వారిపై ఒత్తిడి తెచ్చి పోస్టులకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగుతున్నారు.
ఈ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్ తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ నిర్ణయంపై సాటి ఐఏఎస్ అధికారులే విస్తుపోతున్నారు. మరోపక్క అవసరమైతే సభ్యులపై కేసులు పెట్టి అయినా లొంగ దీసుకోవాలని టీడీపీ రాజకీయ పెద్దలు పావులు కదుపుతున్నారు. గత ప్రభుత్వంలో రాజకీయ పరమైన పదవుల్లో నియమితులైన (నావిునేటెడ్) వివిధ బోర్డులు, కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
అయితే, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని సైతం రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడమంటే రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయ దాడేనని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి కాలం పదవులని తెలిసీ ఒత్తిడి
కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఉద్యోగాల భర్తీ కోసం సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగంలోని 315 ఆర్టికల్ చెబుతోంది. దీనికి చైర్మన్, సభ్యులకు నిర్దిష్ట పదవీ కాలాన్ని ఇచ్చింది. ఏపీపీఎస్సీ కూడా అలా ఏర్పడి, చైర్మన్‌కు మూడేళ్లు, సభ్యులకు ఆరేళ్ల వరకు లేదా 62 ఏళ్ల వయసు వచ్చే వరకు (ఏది ముందు పూర్తయితే అది) ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. ఫైనాన్స్ కమిషన్, సమాచార హక్కు కమిషన్, రెరా, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్లు కూడా రాజ్యాంగబద్ధ సంస్థలే.
వీటి కమిషనర్లు/చైర్మన్లు, సభ్యులు ప్రభుత్వాలు మారినా వారికి ఇచ్చిన నిర్దిష్ట కాల పరిమితి మేరకు పని చేయాల్సి ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య నియమితులైన ఏపీపీఎస్సీ సభ్యులు జగన్ ప్రభుత్వంలో 2022 వరకు పూర్తి కాలం కొనసాగారు. అంతేగాక వీరు బోర్డులో కీలక బాధ్యతలు సైతం నిర్వర్తించడంతో పాటు 2018 గ్రూప్–1 ఇంటర్వూ్యలు కూడా పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ 2015 నవంబర్ 27 తేదీన నియమితులై 2021 నవంబర్ 26 వరకు పూర్తి కాలం కొనసాగారు.
నాడు టీడీపీ ప్రభుత్వం నియమించిన ఆరుగురు సర్వీస్ కమిషన్ సభ్యుల్లో ప్రొఫెసర్ జి.రంగ జనార్ధన మాత్రమే జేఎన్‌టీయూ వైస్ చాన్సలర్‌గా అవకాశం రావడంతో సభ్యుడిగా రాజీనామా చేశారు. అయినప్పటికీ ప్రొఫెసర్ రంగ జనార్ధన దాదాపు నాలుగేళ్ల నాలుగు నెలల ఐదు రోజుల పాటు కొనసాగారు. మిగిలిన ఐదుగురు సభ్యులు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏనాడూ సభ్యులను రాజీనామా చేయాలని గానీ, వారికి ప్రాధాన్యం తగ్గించడం గానీ చేయలేదు. గత టీడీపీ ప్రభుత్వం నియమించిన సభ్యుల్లో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్, సేవారూప, రామరాజు జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగారు. వీరిలో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్ ఇద్దరూ 2018 గ్రూప్–1 అభ్యర్థులకు 2022లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ఇంటర్వూ్యలకు రెండు బోర్డుల్లో చైర్మన్లుగా వ్యవహరించారు.
ప్రొఫెసర్ పద్మరాజు సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆరేళ్ల కాలాన్ని పూర్తి చేసిన అనంతరం నన్నయ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా నియమించి జగన్ ప్రభుత్వంప్రతిభకు పట్టం కట్టింది. అలాగే అందరు సభ్యులు, చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ కూడా రాజ్యాంగం కల్పించిన çపదవీ కాలం పూర్తి చేసుకుని వైదొలిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా ఆయా సభ్యులు పదవీ కాలం పూర్తయిన తర్వాతే వివిధ సామాజిక వర్గాల నుంచి అర్హతలున్న వారు, సమర్థతతో పనిచేసే వారిని, నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వారిని ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించింది. కానీ ఇప్పుడు ఐఏఎస్ అధికారి పోలా భాస్కర్.. చంద్రబాబు ప్రభుత్వం తరఫున వకాలత్ పుచ్చుకుని సభ్యులను తప్పించేందుకు యత్నిస్తుండటం గమనార్హం.
తప్పుడు కేసులకు రంగం సిద్ధం
ప్రస్తుతమున్న ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు మొత్తం 9 మందిని ఎలాగైనా పదవుల్లో నుంచి తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. అవసరమైతే వారిపై ఏదో ఒక కేసు బనాయించాలని చూస్తున్నట్టు తెలిసింది. గ్రూప్–2 మెయిన్స్ కొద్ది రోజులు వాయిదా వేయాల్సిందిగా ఇటీవల ఓ మంత్రిని కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇప్పుడున్న సర్వీస్ కమిషన్ సభ్యులను తప్పించి పోస్టులను భర్తీ చేస్తామని సదరు మంత్రి సమాధానమిచ్చారు.
అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామని, అవసరమైతే వారిపై ఏదో ఒక కేసు పెట్టి తప్పిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఏపీపీఎస్సీ సభ్యుల కుటుంబ వివరాలు, ఆస్తుల వివరాలు సేకరించినట్టు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వం రాజకీయం గా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందనడానికి పోలా భాస్కర్ ఒత్తిడి, సభ్యుల కుటుంబ వివరాలు సేకరించడమే నిదర్శనంగా కనిపిస్తోంది.
ఎన్నికల ప్రధానాధికారి, స.హ చట్టం సభ్యులపై కూడా..
ఇటీవల ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే ఆ వర్గం నాయకులు, సానుభూతిపరులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. చైర్మన్‌తో పాటు సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. ఇది రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని తెలియక టీడీపీ నాయకులు చేసిన అంశంగా చెప్పుకున్నారు. కానీ చట్టం, రాజ్యాంగంపై పూర్తి అవగాహన ఉన్న కొందరు ఐఏఎస్‌లు సైతం ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని, సమాచార హక్కు చట్టం చైర్మన్, సభ్యులను సైతం రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపిస్తుండటం విడ్డూరం.
గత టీడీపీ ప్రభుత్వంలో నియమితులై వివాదాస్పద ఎన్నికల ప్రధానాధికారిగా ముద్రపడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చివరి వరకు తన పదవిలో కొనసాగారు. తన పదవి చివరి రోజు కూడా ఆయన కమిషన్ కార్యాలయంలోనే మధ్యాహ్న భోజనం చేసి సాయంత్రం వైదొలిగారు. అయితే తాజాగా ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ఐఏఎస్ అధికారి ‘రాజకీయ’ బాధ్యతలు తీసుకోవడం రాష్ట్ర సివిల్ సర్వెంట్స్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అధికారులే అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం చూసూ్తంటే వచ్చే ఐదేళ్లల్లో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని చట్టం తెలిసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదే జరిగితే నిరుద్యోగులకు మళ్లీ కష్టాలే!
గత టీడీపీ ప్రభుత్వం నియమించిన సర్వీస్ కమిషన్ సభ్యులు పూర్తి పదవీ కాలం అనంతరం తప్పుకోవడంతో ఖాళీ అయిన సభ్యుల స్థానాలను జగన్ ప్రభుత్వం 2019 అక్టోబర్ నుంచి భర్తీ చేయడం ప్రారంభించింది. ఇలా ఇప్పటి వరకు ఎనిమిది మంది సభ్యులను నియమించింది. వీరు పదవీ కాలం ఆరేళ్లు పూర్తి చేసుకుని వైదొలగాలి. ఈ క్రమంలో వచ్చే ఏడాది జూలైలో చైర్మన్, అక్టోబర్‌లో ఇద్దరు సభ్యులు, 2026 మార్చిలో ఒకరు, 2027 ఏప్రిల్, మే నెలల్లో ఇద్దరు సభ్యులు, 2029 జూన్, జూలైలో మరో ఇద్దరు, 2030 ఫిబ్రవరిలో ఒకరు పదవి నుంచి తప్పుకోవాలి. ఇది రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు. కానీ సభ్యులందరినీ ఏదోలా తప్పించి, గతంలో మాదిరిగానే టీడీపీ సభ్యులతో నింపేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం సవ్యంగా సాగుతున్న సర్వీస్ కమిషన్ పనితీరు గతంలో మాదిరిగానే గాడి తప్పడంతో పాటు వివిధ ఉద్యోగ పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీ వంటివి నిలిచిపోయే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment