
యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు.
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానాన్ని యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీఆర్ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్ చేసుకుంటే చాలు. వేర్వేరు పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటీఆర్ నంబర్ తెలియజేస్తే సరిపోతుంది. వారి వివరాలన్నీ దరఖాస్తు పత్రంలో ప్రత్యక్షమవుతాయి.
దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కావడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభతరంగా మారుతుందని, దరఖాస్తుల్లో పొరపాట్లకు అవకాశం ఉండదని యూపీఎస్సీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంటుందని తెలిపాయి. ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంలో ఈ ఓటీఆర్ నంబర్ నమోదు చేస్తే 70 శాతం దరఖాస్తును పూర్తిచేసినట్లే. యూపీఎస్సీ నిర్వహించే అన్నిపరీక్షలకు ఓటీఆర్ ఉపయోగపడుతుంది. upsc.Govt.in లేదా upsconline.nic.in వెబ్‌సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే ఓటీఆర్‌లో అభ్యర్థులు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని యూపీఎస్సీ ఒక ప్రకటనలో సూచించింది.
ఇదీ చదవండి: కాంగ్రెస్ యూట్యూబ్ చానల్ తొలగింపు