అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
ఏటా మార్చి 31 నాటికి ఖాళీ పోస్టులు ప్రకటించి.. డిసెంబర్ 9 నాటికి భర్తీ చేస్తాం
ప్రస్తుతం నోటిఫికేషన్ల మేరకే ఉద్యోగాల భర్తీ ఉంటుంది
గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలిస్తే కేసులు, కోర్టుల్లో ఇబ్బంది
కోచింగ్ సెంటర్ల వాళ్లు, రాజకీయ నేతలు అభ్యర్థులను రెచ్చగొడుతున్నారు
‘ఫీజు’ బకాయిలన్నీ వన్ టైం సెటిల్‌మెంట్‌గా ఇచ్చే యోచన చేస్తున్నాం
ఇకపై ఏ ఏడాదికి ఆ ఏడాది రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వాలని నిర్ణయించాం
జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో భేటీలో సీఎం వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత కల్పించి, అసెంబ్లీలో జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏటా మార్చి 31వ తేదీనాటికి ఖాళీ పోస్టుల వివరాలు తెప్పించుకుంటామని.. జూన్‌లో నోటిఫికేషన్లు ఇచ్చి, డిసెంబర్ 9వ తేదీ నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. పదేళ్లుగా నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారని.. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయా లంటూ కోచింగ్ సెంటర్ల యజమానులు, రాజకీయ నేతలు అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. శనివారం జేఎన్‌టీయూలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులతో ‘ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత’ అన్న అంశంపై సీఎం రేవంత్ ముఖాముఖి చర్చించారు. వివరాలు రేవంత్ మాటల్లోనే..
‘‘రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయా లని కొందరు అంటున్నారు. పరీక్షలతో ఏమాత్రం సంబంధం లేనివారు దీక్షలు చేయడం వింత. ఇటీవల దీక్ష చేసిన ముగ్గురూ ఏ పరీక్ష కూడా రాయడం లేదు. ఒకరేమో కోచింగ్ సెంటర్ యజమాని. మరొ కరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పదవీ ఇవ్వలేదని ప్రభుత్వాన్ని గిల్లడమే పనిగా పెట్టుకున్నారు. గాందీలో దీక్ష చేసిన వ్యక్తి నాయకుడిగా ఎదగడానికి ఓ రాజకీయ నేత అండతో ఆందోళన చేశారు. గ్రూప్–1లో 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఎవరైనా కోర్టుకు వెళ్తే పరీక్షలు ఆగిపోతాయి. అందుకే నోటిఫికేషన్‌లో ఉన్న మేరకే పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ఉంటుంది.
నిరుద్యోగుల కర్మాగారాలు కావొద్దు
నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా ఇంజనీరింగ్ కాలేజీలు మారకూడదు. ప్రపంచంతోనే పోటీపడేలా ఇంజనీరింగ్ విద్యను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. నైపుణ్యం లేకుండా, కేవలం ఇంజనీరింగ్ పట్టాలిస్తే వారికి ఉద్యోగాలు రావు. తాత్కాలిక ఉద్యోగ, ఉపాధి మార్గాల కోసం కంప్యూటర్ కోర్సులను కాలేజీలు కావాలనుకోవడం సరికాదు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి కోర్సులను కనుమరుగు చేస్తే దేశానికే ప్రమాదం.
‘ఫీజు’ ఎప్పటికప్పుడు ఇస్తాం
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాలేజీలు ఏమాత్రం దిగులు పడొద్దు. బకాయిలన్నీ వన్ టైం సెటిల్‌మెంట్‌గా ఇచ్చే యోచన చేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచి్చన ఈ పథకాన్ని మరింత విజయవంతంగా నడిపిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఏ ఏడాదికా ఏడాదిలో ఇచ్చేందుకు ప్రయత్నించాలని నిర్ణయించాం. సంక్షేమంపైనే దృష్టి పెట్టడం వల్ల కొన్నేళ్లుగా రాష్ట్రం ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది.
లోపాలను గుర్తించాలి
పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక విద్య ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే నైపుణ్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ చేసే స్వేచ్ఛనిస్తున్నాం. విద్యలో ఉన్న లోపాలను గుర్తించి, మార్పు దిశగా అడుగులు వేసేలా చేస్తాం. ఈ దిశగా ముందుకొచ్చే సంస్థలకు చేయూతనిస్తాం. ఫార్మా రంగంలో పరిశోధనను ఎన్నో ఏళ్లుగా ప్రోత్సహించబట్టే కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ కేంద్రమైంది. సాఫ్ట్‌వేర్ రంగంలోనూ ప్రతి పది మందిలో ఒకరు తెలుగు వాళ్లే ఉన్నారు. వచ్చే 20 ఏళ్లలో ఎంతో మంది సీఈవోలు ఉండబోతున్నారు.
ఐటీఐల సిలబస్‌లో మార్పు
దశాబ్దాల నాటి సిలబస్‌తో నడుస్తున్న ఐటీఐలకు ఉజ్వల భవిష్యత్ తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం. రాష్ట్రంలోని 65 ఐటీఐలను టాటా సంస్థ తోడ్పాటుతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మారుస్తున్నాం. ఈ పైలట్ ప్రాజెక్టు ఊహించని విధంగా అత్యాధునిక టెక్నాలజీని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలున్నా.. తగిన స్కిల్స్ లేకపోవడం వల్ల నిరుద్యోగం కనిపిస్తోంది. ఆఖరికి నిర్మాణ రంగంలోనూ ఇతర రాష్ట్రాల వాళ్లే ఉంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. స్కిల్ పెంపుతోనే ఇది సాధ్యం.ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో లీడ్ పార్టనర్‌గా తెలంగాణ ఉండాలన్నది మా లక్ష్యం’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
కాలేజీలకు సామాజిక కోణం అవసరం: శ్రీధర్‌బాబు
ప్రైవేటు కాలేజీలు సామాజిక కోణంలో విద్యా వ్యవస్థ మార్పు కోసం కృషి చేయాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. పరిశ్రమల అవసరాలు, పరిశోధన, అభివృద్ధి దిశగా కొత్త కోర్సులను రూపొందించేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్‌ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తున్నామని.. తర్వాత 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. 2030 నాటికి ఐటీలో బెంగళూరును అధిగమించడమే తమ లక్ష్యమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment