ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు
స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్నాయి. 25న శాసనసభ, శాసనమండలిలో 2024.25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శాసనసభ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం వాయిదా పడింది.
ఆ తర్వాత స్పీకర్ చాంబర్‌లో జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్‌కుమార్, రామచంద్రునాయక్ హాజరయ్యారు. విపక్షం నుంచి బీఆర్‌ఎస్ తరపున మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీ అసెంబ్లీలో తాము చర్చించదలిచిన అంశాల జాబితాను అందజేశాయి.
పక్షంరోజులు సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్, కనీసం 18 రోజులు సమావేశాలు జరగాలని బీజేపీ కోరాయి. అయితే గతంలో బడ్జెట్ జరిగిన సమావేశాల తీరుతెన్నులను వివరిస్తూ ఈ నెల 31 వరకు సభ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బీఆర్‌ఎస్, బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసినా, ఈ నెల 31 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రోజూవారీ ఎజెండాపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్, బీజేపీ కోరాయి. అయితే ఎజెండాపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని ప్రభుత్వ పక్షం ప్రకటించింది.
మొదట తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై తీర్మానం
బీఏసీలో నిర్ణయించిన మేరకు బుధవారం ఉద యం 10 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై చర్చించి కేంద్రానికి తీర్మానం పంపుతారు. అనంతరం రుణమాపీ అంశంపైనా స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, గ్రామపంచాయతీలుగా తండాలు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
ఈ నెల 25న ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి డి.శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 26న అసెంబ్లీకి విరామం ప్రకటించి.. తిరిగి 27న బడ్జెట్‌పై చర్చ ప్రారంభమవుతుంది. 28న సమావేశాలకు విరామం ప్రకటించి తిరిగి 29 నుంచి 31వ తేదీ వరకు మూడు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ కొనసాగుతుంది. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడుతుంది. కాగా శాసనమండలిలోనూ మంగళవారం చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన మండలి బీఏసీ సమావేశం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment