24 నుంచి శాసనమండలి సమావేశాలు
25న ఉభయ సభల ముందుకు వార్షిక బడ్జెట్?
ఈసారి కేసీఆర్ హాజరవుతారంటున్న బీఆర్‌ఎస్ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు మరుసటి రోజు 24న ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 23న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
తొలిరోజు సభ.. దివంగత ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేల మరణంపై సంతాపం ప్రకటించిన తర్వాత వాయిదా పడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన విషయం తెలిసిందే. ఈ నెల 24న శాసనసభ, శాసన మండలి వేర్వేరుగా సమావేశమై సాధారణ బిజినెస్‌ను చేపట్టే అవకాశం ఉంది.
అలాగే 25న ఉభయ సభల్లో రాష్ట్ర వార్షిక (2024–25) బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. 26న అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించి 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ చేపడతారు. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో సభకు మరోసారి విరామం ప్రకటించి తిరిగి ఈ నెల 30 నుంచి సమావేశాలు కొనసాగించే అవకాశముంది. అయితే సభ ఎజెండా, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఈ నెల 23న స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయిస్తారు.
గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారి
రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. కాగా తొలి విడత అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు జరిగాయి. ఇక రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17వ తేదీ నడుమ 8 రోజుల పాటు జరిగాయి. తొలి విడత సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తదితర అంశాలు చోటుచేసున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది. ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత సమావేశాల్లో 2024– 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు సాగునీటి వనరులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.
అనర్హత కోసం బీఆర్‌ఎస్ పట్టు!
పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ అసెంబ్లీ వేదికగా పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మూడో శాసనసభ ఇప్పటివరకు రెండు విడతల్లో సమావేశం కాగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భేటీకి దూరంగా ఉన్నారు. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ త్వరలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యే అవకాశముంది. బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఈసారి సమావేశాల సందర్భంగా అధికార పార్టీతో జట్టు కట్టడం ఆసక్తికరంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment