కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజుల్లోనే లాస్య నందిత మృతి విచారకరం
ఏడాది కాలంలోనే తండ్రీకూతురు మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటు
అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘అత్యంత చిన్న వయసులోనే జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడం... ఆ తర్వాత కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలిచివేసింది. ఆమె మరణం నేపథ్యంలో అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నాను’అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
2024–25 వార్షిక బడ్జెట్‌కు సంబంధించి ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో భాగంగా సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్ జి.ప్రసాద్‌కుమార్ సూచించగా...సీఎం రేవంత్‌రెడ్డి లాస్య నందిత సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు గెలుపొందిన సాయన్న తనకు అత్యంత సన్నిహితుడన్నారు. అనారోగ్య కారణాలతో గతేడాది ఆయన మరణించగా... ఆయన వారసురాలిగా లాస్య కంటోన్మెంట్ నుంచి గెలుపొందారని, గత ఫిబ్రవరి 23న జరిగిన ప్రమాదంలో ఆమె మరణించడం బాధాకరమని చెప్పారు. సాయన్న, లాస్య నందిత ఇద్దరూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి, కంటోన్మెంట్ ప్రజల కోసం ఎంతో కృషి చేశారన్నారు.
లాస్య కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్
లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో మరణించడం పార్టీకి తీరని లోటు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి.సాయన్న అజాతశత్రువన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్, సాయన్న మంచి మిత్రులని, వారిద్దరూ కలిసి వచ్చి లాస్య నందితకు కార్పొరేటర్‌గా అవకాశం కల్పించాలని కేసీఆర్‌ను కోరగా, వెంటనే ఆమెకు టికెట్ ఇచ్చారన్నారు.
ఎన్నికల్లో విజయపథంలో ముందుగా సాగిన లాస్య నందితను విధి వెంటాడిందన్నారు. నల్లగొండలో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ సమావేశ అనంతరం ఒక ప్రమాదం ముంచుకొచి్చందని, అక్కడ్నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన ఆమె... కొన్నాళ్లకు ఇంట్లో లిఫ్ట్ ప్రమాదం బారిన పడ్డారని, రెండింటి నుంచి బయటపడినా, ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయిందని చెప్పారు.
» రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ లాస్య నందిత కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.
» రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురైనట్టు తెలియగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వెంటనే వారి ఇంటిని చేరుకున్నానని, అక్కడి పరిస్థితిని సమీక్షించి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలు చేపట్టామన్నారు.
» బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పారు
»ఎమ్మెల్యేలు బలాల, కూనంనేని సాంబశివరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సునీతాలక్ష్మారెడ్డి, రాజ్ ఠాకూర్, ముఠా గోపాల్, శ్రీగణేశ్, పాయల్ శంకర్, కేపీ.వివేకానంద, రాజశేఖర్‌రెడ్డి తదితరులు లాస్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
» లాస్య మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment