రేవంత్‌ X అక్బర్‌ | Heated argument between Revanth Reddy and Akbaruddin | Sakshi
Sakshi News home page

రేవంత్‌ X అక్బర్‌

Published Fri, Dec 22 2023 5:08 AM | Last Updated on Fri, Dec 22 2023 7:53 AM

Heated argument between Revanth Reddy and Akbaruddin - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ రంగ శ్వేతపత్రంపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. అక్బరుద్దీన్‌ మాట్లాడుతుండగా మొదలైన ఈ రగడ గంటకుపైగా కొనసాగింది. దీంతో సభలోని కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ సభ్యులు వాదోపవాదాలకు దిగారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో స్పీకర్‌ పోడియం వద్దకు అక్బరుద్దీన్‌ సహా ఎంఐఎం సభ్యులు దూసుకెళ్లారు. ఎంఐఎం సభ్యులతోపాటు బీఆర్‌ఎస్‌ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పోడియం వద్దకు వెళ్లి సభాపతితో వాదనకు దిగారు. దీంతో సభ అదుపుతప్పింది. 

బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రశంసలతో వాదన మొదలు.. : విద్యుత్‌ రంగ శ్వేతపత్రంపై చర్చలో అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో రూ. 25 వేల కోట్ల అభివృద్ధి జరిగింది. 2014తో పోలిస్తే విద్యుదుత్పత్తి  భారీగా పెరిగింది. బీఆర్‌ఎస్‌ హయాంలో జెన్‌కో ఆస్తులు రూ. 12,783 కోట్ల నుంచి రూ. 40,454 కోట్లకు పెరిగాయి. పాతబస్తీలో ఇంకా 5 వేల స్తంభాలు, కొత్త కండక్టర్‌ (తీగ), ట్రాన్స్‌పార్మర్ల ఏర్పాటుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని కోరారు.

దీనిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ అక్బరుద్దీన్‌ గత పదేళ్ల కాలంలో ఆ పనులేవీ చేయించుకోలేకపోగా ఇప్పుడు ప్రశ్నించడం ఏమిటంటూ నిలదీశారు. దీనిపై అక్బరుద్దీన్‌ ఘాటుగా ప్రతిస్పందించారు. సీనియర్‌ను అయిన తనను మొదటిసారి సభకు వచ్చిన సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారని... పెద్దలు మాట్లాడుకుంటుండగా చిన్న పిల్లాడిలా మాట్లాడొద్దని వ్యాఖ్యానించారు. 

రేవంత్‌రెడ్డి జోక్యం... 
అక్బరుద్దీన్‌ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘అక్బరుద్దీన్‌ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలి. సభలో ప్రస్తుతం 57 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ దళితుడు. ఆయన మాట్లాడితే ఆగ్రహం వ్యక్తం చేయాలా? అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌ను చేశాం. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది. అక్బరుద్దీన్‌ కేవలం ఎంఐఎం నేత మాత్రమే. ఆయన్ను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదు.

చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఆయనకు ఓటు వేశారు. మాకు ఓల్డ్‌ సిటీ, న్యూ సిటీ అనే తేడాలేదు. బీఆర్‌ఎస్‌ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా? గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతుంటే వినేందుకు మేం సిద్ధంగా లేము. తెలంగాణ ప్రజలు మీ మిత్రపక్షం బీఆర్‌ఎస్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. బీఆర్‌ఎస్‌ తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోంది? మైనారిటీల విషయంలో కాంగ్రెస్‌ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు‘అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 

మా ముస్లిం నేతలను ఓడించారు.. 
‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, మజ్లిస్‌ కలసి పనిచేశాయి. నిజామాబాద్‌ అర్బన్‌లో షబ్బీర్‌ అలీని, జూబ్లీహిల్స్‌లో అజాహరుద్దీన్‌ను ఓడించేందుకు కేసీఆర్‌తో కలసి మజ్లిస్‌ పనిచేసింది. అదే మజ్లిస్‌ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాలలో ఎందుకు పోటీ చేయలేదు? కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా చేసింది.

మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. అక్బరుద్దీన్‌.. కేసీఆర్‌కు మిత్రుడు కావొచ్చు. మోదీకి మద్దతివ్వవచ్చు.. అది వాళ్లిష్టం. మజ్లిస్, బీఆర్‌ఎస్‌ మిత్రపక్షాలు అని కేసీఆర్‌ పలుమార్లు చెప్పారు. మజ్లిస్‌ పార్టీ కేసీఆర్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. అక్బరుద్దీన్‌ ముస్లింలందరికీ నాయకుడు కాదు. మజ్లిస్‌ పార్టీకి మాత్రమే నాయకుడు’అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. 

విద్యుత్‌ బకాయిలు రాబడతారా? 
‘విద్యుత్‌ మొండి బకాయిల్లో సిద్దిపేట 61.37 శాతం, గజ్వేల్‌ 50.29 శాతం, హైదరాబాద్‌ సౌత్‌ 43 శాతంతో టాప్‌లో ఉన్నాయి. కేసీఆర్, హరీశ్‌రావు, అక్బరుద్దీన్‌ బాధ్యత తీసుకొని విద్యుత్‌ బకాయిలను క్లియర్‌ చేస్తారా?’అని రేవంత్‌ ప్రశ్నించారు. ఈ బిల్లులు వసూలు చేస్తే బకాయిల నుంచి బయటపడతామన్నారు. పాతబస్తీలో విద్యుత్‌ బకాయిల చెల్లింపులు జరిపే బాధ్యత తనదని అక్బరుద్దీన్‌ చెప్పడం లేదని రేవంత్‌ విమర్శలు గుప్పించారు. రేవంత్‌ మాట్లాడుతుండగా మజ్లిస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. 

వైఎస్సాఆర్‌ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు... 
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అక్బరుద్దీన్‌ తీవ్రంగా స్పందించారు. ‘మేము ఎవరికీ భయపడం. కిరణ్‌కుమార్‌రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు. కాంగ్రెస్‌ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్, ఎంఐఎం కలసి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాయి. వైఎస్సార్‌ నిజమైన జెంటిల్మాన్‌... గొప్ప నాయకుడు. కాంగ్రెస్‌కు చెందిన అప్పటి ఢిల్లీ నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మా నాన్నను కలిశారు. ఆ తర్వాతే కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చారు. కాంగ్రెస్, ఎంఐఎం కలసే అప్పడు ఎన్నికలను ఎదుర్కొన్నాయి’అని పేర్కొన్నారు. 

సీఎంకు చాలెంజ్‌.. 
షబ్బీర్‌ అలీని ఓడించేందుకు ప్రయత్నించామని రేవంత్‌ ఆరోపించారు. మేము నిజామాబాద్‌ అర్బన్‌లో పోటీ చేయలేదు. షబ్బీర్‌ అలీ ఓటమితో మాకేం సంబంధం? జూబ్లీహిల్స్‌లో మాకు కార్పొరేటర్‌ ఉన్నారు. బలమైన అభ్యర్థిని నిలిపాం. అంబేడ్కర్‌ వంటి మహానేతను కూడా ఓడించిన ఘనత కాంగ్రెస్‌దే. మమ్మల్ని బీజేపీ బీ–టీం అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలసి పనిచేయం. సీఎం రేవంత్‌కు చాలెంజ్‌’అంటూ కామెంట్స్‌ చేశారు. ఏబీవీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఉన్నారని... అన్నిచోట్లా సీఎంకు అనుభవం ఉందని వ్యాఖ్యానించారు.

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్‌ సభానాయకుడిని కించపర్చేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. స్పీకర్‌ కూడా జోక్యం చేసుకొని సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మధ్యలో మాట్లాడవద్దన్నారు. ఈ దశలో మరోసారి జోక్యం చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ‘నాదెండ్ల భాస్కర్‌రావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌ హయాం వరకు ఎంఐఎం ఎవరెవరితో దోస్తీ చేసిందో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం’అని పేర్కొన్నారు. దీనికి అక్బరుద్దీన్‌ బదులిస్తూ ‘మేము ఎవరితో కలసి పనిచేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపక్వతగా మాట్లాడటం లేదు’అని అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement