సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నిరుద్యోగుల్లో ధైర్యం నింపుతోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో మెజార్టీ మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత ఐదేళ్లలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 779 మందికి ఉద్యోగాలు దక్కడం గమనార్హం. ఐదేళ్లలో 6,818 మంది శిక్షణ పొందితే వీరిలో 12శాతం మందిని సర్కారు కొలువులు వరించాయి. ఇతర స్టడీ సర్కిళ్లతో పోలిస్తే ఈ సంఖ్య మెరుగ్గా ఉందని ఎస్సీ అభివృద్ధి శాఖ పేర్కొంటోంది. స్టడీ సర్కిళ్లలో శిక్షణల నిర్వహణ వ్యూహాత్మకంగా, పకడ్బందీగా నిర్వహిస్తుండటంతో సత్ఫలితాలు వస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
సివిల్ సర్వీసెస్‌కు ఐదుగురు..
ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 11 స్టడీ సర్కిళ్లున్నాయి. హైదరాబాద్‌లో మెయిన్ సెంటర్ ఉండగా, మిగతావి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. సివిల్స్ తదితర ప్రతిష్టాత్మక పరీక్షలకు సంబంధించిన శిక్షణలు మాత్రం హైదరాబాద్‌లో జరుగుతాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు వివిధ నియామక బోర్డులు నిర్వహించే పరీక్షలకు విద్యార్థుల సంఖ్య, సౌకర్యం తదితర అంశాలను ప్రాతిపదికన తీసుకుని జిల్లా కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 779 మందికి సర్కారు కొలువులు దక్కాయి. ఇందులో అత్యధికంగా 454 మంది పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు పొందారు. టీజీటీ/పీజీటీ/టీఆర్టీ కేటగిరీలో 46 మంది కొలువులు సాధించారు. మరో 46 మందికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 39 మంది సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలు సాధించారు. మొత్తంగా 45 రకాల విభాగాల్లో ఉద్యోగాలు సాధించినట్లు స్టడీ సర్కిల్ అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లలో హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో 1,278 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకోగా.. మిగతా 10 స్టడీ సర్కిళ్లలో 5,540 మంది శిక్షణ తీసుకున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
తాజా నిర్ణయంతో మరింత మేలు..
శిక్షణ తరగతుల నిర్వహణ, అభ్యర్థుల వసతి, స్టడీ మెటీరియల్, భోజన సౌకర్యం వాటికి ఐదేళ్లలో స్టడీ సర్కిళ్లకు చేసిన ఖర్చు రూ.37.71 కోట్లు. తాజాగా ఫౌండేషన్ కోర్సు నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికను మొదలుపెట్టింది. ఫలానా ఉద్యోగాల కోసం కాకుండా జనరల్ అంశాలతో రూపొందించిన శిక్షణ కోసం ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ఇందులో శిక్షణ పొందిన అభ్యర్థులు దాదాపు ప్రతి ఉద్యోగానికి 50 శాతం సిద్ధంగా ఉంటారని, నోటిఫికేషన్లు వెలువడిన తర్వాత సబ్జెక్టు పరంగా శిక్షణ తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
సివిల్స్ అభ్యర్థులకు అభినందన సభ
ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా 779 మందికి ఉద్యోగాలు రావడం గర్వంగా ఉంది. శాఖాధికారులు, ఉద్యోగులు, ఫ్యాకల్టీ కృషి, అభ్యర్థుల పట్టుదలతో ఈ ఉద్యోగాలు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఇప్పటివరకు ఎక్కువగా దృష్టి పెట్టాం. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను అనుసరిస్తాం. గత ఐదేళ్లలో ఐదుగురికి సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు దక్కాయి. వచ్చే నెలలో ఆయా అభ్యర్థులకు అభినందన సభ నిర్వహించాలని భావిస్తున్నాం.
–పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు
నిరుద్యోగుల ధైర్యం
Published Tue, Jul 30 2019 2:37 AM | Last Updated on Tue, Jul 30 2019 2:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment