అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ! | Mother and Son From Kerala Qualify Public Service Commission | Sakshi
Sakshi News home page

అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ!

Published Thu, Aug 11 2022 12:35 AM | Last Updated on Thu, Aug 11 2022 12:35 AM

Mother and Son From Kerala Qualify Public Service Commission - Sakshi

తల్లి బిందుతో వివేక్‌

కేరళలో తల్లి, కొడుకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చాయి. కొడుక్కి ఉద్యోగం వచ్చింది.
‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చింది’ అన్నాడు తల్లి దగ్గరకు వెళ్లి. ‘నాక్కూడా బాబూ’ అని జవాబు చెప్పిందా తల్లి.
ఇద్దరూ ఒకేసారి గవర్నమెంట్‌ ఉద్యోగులు అయ్యారు.
వారిని ఉత్సాహపరిచిన తండ్రి ఆనందంతో కళ్లు తుడుచుకున్నాడు.
ఇంత మంచి కుటుంబ కథా చిత్రం ఈ మధ్య చూళ్లేదు మనం.


కొబ్బరిచెట్లు సంతోషంతో తలలు ఊపాయి. వీధి అరుగులు చప్పట్లు కొట్టాయి. ఒక సామాన్యమైన ఇంటిలో హటాత్తుగా రెండు గవర్నమెంట్‌ ఉద్యోగాలు వచ్చేసరికి ఈ సంబరం మనదే అన్నట్టుగా ఊరు ఉంది.
దానికి కారణం మొన్న ఆగస్టు 3న కేరళలో ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మలప్పురంలో అరిక్కోడ్‌ అనే ఉళ్లోని తల్లీకొడుకులు న్యూస్‌మేకర్స్‌గా నిలిచారు. తల్లి బిందు ‘లాస్ట్‌ గ్రేడ్‌ సర్వెంట్స్‌’ (ఎల్‌.జి.ఎస్‌.) విభాగంలో 92వ ర్యాంక్‌ సాధిస్తే కొడుకు వివేక్‌ ‘లోయర్‌ డివిజినల్‌ క్లర్క్‌’ (ఎల్‌.డి.సి.) విభాగంలో 38వ ర్యాంకు సాధించాడు.

తల్లి వయసు 42. కొడుకు వయసు 24.
పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు 40 ఏళ్లు పరిమితిగా ఉన్నా కొన్ని వర్గాలకు 42 ఏళ్లు మరికొన్ని వర్గాలకు 46 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంది. తన సామాజికవర్గాన్ని బట్టి పరీక్ష రాయడానికి అర్హత ఉన్న బిందు 42 ఏళ్ల వయసులో ఈ ఉద్యోగం సాధించింది. ఈసారి కాకపోతే ఇంకేముంది... జాతీయస్థాయిలో ఇది విశేష వార్తగా మారింది.

లాస్ట్‌ చాన్స్‌
బిందు చాలా కాలంగా అంగన్‌వాడి టీచర్‌గా పని చేస్తూ ఉంది. ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగంతో ఆమెకు సంతృప్తి లేదు. ఎప్పటికైనా గవర్నమెంట్‌ ఉద్యోగం సాధించాలి అనుకునేది. కొడుకు వివేక్‌ పదో క్లాసుకు వచ్చినప్పటి నుంచి ఆమె పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్‌ అవుతూ ఉంది. అంతే కాదు కొడుకుతో కూడా నువ్వు గవర్మెంట్‌ ఉద్యోగం సాధించాలిరా అని తరచూ చెప్పేది. చిన్నప్పటి నుంచి అతని చేత పత్రికలు చదివించేది. కొడుకు డిగ్రీ అయ్యాక అతనూ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవడం మొదలెట్టాడు. బిందు పట్టుదల చూసి ఆమె భర్త పూర్తిగా మద్దతు పలికాడు. కోచింగ్‌ లో చేరండి అని చేర్పించాడు. ఇంతకు మునుపు చేసిన అటెంప్ట్స్‌ ఫలించలేదు. ఈసారి బిందుకు లాస్ట్‌ చాన్స్‌. ఈసారి మిస్సయితే ఇక ఎగ్జామ్‌ రాసే వయసు ఆమె వర్గానికి సంబంధించి దాటేస్తుంది. ఎలాగైనా సాధించాలి అనుకుందామె.

కోచింగ్‌ చేరి
బిందు, వివేక్‌ ఇద్దరూ ఒకే కోచింగ్‌ సెంటర్‌లో చేరారు. కలిసి వెళ్లి కోచింగ్‌ తీసుకుని వచ్చేవారు. ఆ తర్వాత ఎవరికి వారు ప్రిపేర్‌ అయ్యేవారు. ‘మేము మా గదుల్లోకి వెళ్లి చదువుకునేవాళ్లం. మధ్యలో మాత్రం డౌట్స్‌ వస్తే ఒకరినొకరం అడిగేవాళ్లం. నోట్సులు ఎక్స్ఛేంజ్‌ చేసుకునేవాళ్లం’ అన్నాడు వివేక్‌.
సంకల్పం వృధా కాలేదు. ‘ఉద్యోగం వచ్చిందమ్మా’ అని కొడుకు పరిగెత్తుకుని వెళితే ‘నాక్కూడారా’ అని నవ్విందామె.
భలే ఉంది కదా... ఈ కుటుంబ కథా చిత్రం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement