నిరుద్యోగులను నిండా ముంచేసిన రాష్ట్ర సర్కార్‌ | State Govt Cheated the Unemployed People | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులను నిండా ముంచేసిన రాష్ట్ర సర్కార్‌

Published Mon, Jan 21 2019 3:33 AM | Last Updated on Mon, Jan 21 2019 4:56 AM

State Govt Cheated the Unemployed People - Sakshi

సాక్షి, అమరావతి: గత ఎన్నికలకు ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఐదేళ్ల పదవీకాలంలో ఆ నినాదాలను పూర్తిగా తుంగలోతొక్కింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పదవీ విరమణ చేసిన వారి సంఖ్య కలుపుకొంటే మొత్తం ఖాళీలు 2.40 లక్షలకు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులు.. కేవలం రెండు వేలు మాత్రమే. ఏటా ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించి 2016 వరకు వాటి ఊసే ఎత్తలేదు. గ్రూప్‌–1, 2, 3తో పాటు కొన్ని సాంకేతిక పోస్టులు, ఇతర పోస్టులు కలిపి మొత్తం 4,275 ఖాళీల భర్తీకి మాత్రమే 2016లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటికి 15.99 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారు.

ఇన్ని లక్షల మంది నిరుద్యోగుల్లో కేవలం 2 వేల మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించడాన్ని బట్టి చూస్తే నిరుద్యోగులను చంద్రబాబు ఏవిధంగా వంచించారో అర్థమవుతుంది. మరోవైపు రాష్ట్రంలో 5.50 లక్షల మందికిపైగా డీఈడీ, బీఈడీ పూర్తిచేసినవారు ఉన్నారు. రాష్ట్రంలో ఏటా డీఎస్సీ అని చెప్పినా.. ఇప్పటివరకు ఒకే ఒక్క డీఎస్సీని మాత్రమే పూర్తయింది. గత కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన పోస్టులు పూర్తి చేశాక.. రాష్ట్రంలో ఇంకా 22 వేలకు పైగా టీచర్‌ ఖాళీలు భర్తీ చేస్తామని చంద్రబాబు సర్కార్‌ ప్రకటించింది. అయితే చివరకు ఆ పోస్టుల సంఖ్యను 7,902కు కుదించేసింది. అవిగో నియామకాలు, ఇవిగో వేలాది పోస్టుల భర్తీలు అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది కానీ, ఈ ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్‌ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం రెండు వేలు మాత్రమే. ఇది పూర్తిగా తమ ఆశలతో, ఆశయాలతో ఆడుకోవడం లాంటిదేనని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కుదింపు
ప్రభుత్వ శాఖల్లో మంజూరైన మొత్తం పోస్టులు, ఖాళీల సంఖ్యను ప్రభుత్వం కుదించి చూపిస్తూ నిరుద్యోగులకు పంగనామాలు పెడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల సంఖ్య 2.40 లక్షలుంటే ఖాళీల సంఖ్య కేవలం 77,737 మాత్రమేనని, వీటిలో పైస్థాయిలో ఉండే 20 వేల పోస్టులను రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేస్తామని తక్కినవాటిలో అవుట్‌ సోర్సింగ్‌లో తీసుకుంటామని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ప్రభుత్వ శాఖల్లోని పోస్టులే కాకుండా ఉపాధ్యాయుల పోస్టులనూ రాష్ట్ర ప్రభుత్వం కుదించేసింది. ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు ముందు 22 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. చివరకు 7,902కు ఆ సంఖ్యను తగ్గించేసింది. మళ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎత్తులు వేసింది. 18,450 పోస్టుల భర్తీ అంటూ ప్రచారం చేసింది. ఈ నోటిఫికేషన్లు ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమను మరోసారి వంచించడానికే ప్రభుత్వం నోటిఫికేషన్ల డ్రామాను తెరపైకి తెచ్చిందని నిరుద్యోగుల ధ్వజమెత్తుతున్నారు. 

రూల్‌–7 ఎత్తివేతతో అన్యాయం
గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లలోని పోస్టులకు ఎంపికైనవారు చేరకపోయినా, చేరి రాజీనామా చేసినా ఆ పోస్టులను కమిషన్‌ నిబంధనావళిలోని రూల్‌–7 ప్రకారం.. మెరిట్‌ జాబితాలోని తదుపరి అభ్యర్థికి కేటాయించేవారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ రూల్‌ ఎత్తేస్తూ జీవో ఇచ్చారు. రూల్‌–6ను మాత్రం కొనసాగించారు. రూల్‌–6.. ప్రకారం మిగిలిపోయిన పోస్టులను మెరిట్‌ అభ్యర్థులకు ఇవ్వకుండా తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లిస్తారు. ఫలితంగా నిరుద్యోగ అభ్యర్థులను తీరని అన్యాయం జరుగుతోంది. పోస్టులు మిగిలిపోయేలా ప్రభుత్వ నియామక ప్రక్రియ కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం హామీని నమ్మి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు, డీఎస్సీ వస్తాయన్న ఆశతో రాష్ట్రంలోని లక్షలాది మంది యువత గత నాలుగున్నరేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. వీరిలో అనేకమంది లక్షల రూపాయలు అప్పులు చేసి కోచింగ్‌లు కూడా తీసుకున్నారు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులు అరకొరగా ఉండడం, కొత్త నోటిఫికేషన్లు రాకపోవడంతో వీరంతా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.  

వయోపరిమితి దాటిపోయి.. అవకాశాలు కోల్పోయి..
నాలుగున్నరేళ్లుగా నియామకాలు లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటి పోయారు. ఇప్పుడు వారికి ఏ అవకాశం లేక ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నారు. వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలన్న అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని లేనిపక్షంలో ప్రతి నిరుద్యోగికి రూ.2 వేల చొప్పున ప్రతినెలా భృతి ఇస్తామన్న హామీని కూడా ప్రభుత్వ నెరవేర్చలేదు. ఎన్నికలకు ముందు  ’యువ నేస్తం’ పేరిట నిరుద్యోగ భృతి హామీలో వెయ్యి కుదించి ఇస్తోంది. అయితే భృతికి అర్హుల సంఖ్యను కుదించేశారు. ఇప్పటికే అనేక నిబంధనలు పెట్టడంతో 5 లక్షల మంది మాత్రమే యువనేస్తానికి దరఖాస్తు చేశారు.  

తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు
కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆదర్శ రైతులు, గోపాలమిత్ర, వైద్యమిత్ర, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, వయోజన విద్యాకేంద్రాల సమన్వయకర్తలు, మధ్యాహ్న భోజనం కుక్‌లు, సహాయకులు, ఇలా పలు కేటగిరీల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దాదాపు 1.5 లక్షల మందిని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించింది. కుక్‌లు, సహాయకులు 80 వేల మంది, వయోజనవిద్య సమన్వయకర్తలు 20 వేల మంది, ఫీల్డ్‌ అసిస్టెంట్లు 25 వేల మంది ఉన్నారు. వీరందరినీ చంద్రబాబు సర్కార్‌ తొలగించి రోడ్డున పడేసింది.

ఆటో తోలుకుంటున్నా
–కోయ శ్రీనివాస్, కొల్లిపర, గుంటూరు జిల్లా
నేను డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లవుతోంది. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో బాడుగకు ఆటో నడుపుకొంటున్నా. యజమానికి అద్దె పోనూ రోజూ రూ. 100 మాత్రమే మిగులుతున్నాయి. ఈ మొత్తంతో నలుగురు కుటుంబ సభ్యులను పోషించడం కష్టంగా ఉంది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఇవ్వలేదు. 

ఉల్లిపాయలు అమ్ముకుంటున్నా
–వి.రామారావు, విజయవాడ
నేను 2016లో ఎంబీఏ పూర్తిచేశా. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని అప్పు చేసి విజయవాడలో కోచింగ్‌ కూడా తీసుకున్నా. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసినా రాలేదు. ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాను. 

రిజర్వుడ్‌ అభ్యర్థులకు ‘ఓపెన్‌’ దెబ్బ!
రాష్ట్రంలోని ప్రభుత్వ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రత్యేక మినహాయింపులు పొందిన ఆయా కేటగిరీల అభ్యర్థులు వారి రిజర్వుడ్‌ పోస్టులకే తప్ప ఓపెన్‌ కేటగిరీ పోస్టులకు ఎంపికచేయకుండా అన్యాయం చేస్తోంది. దీనిపై ఆయా కేటగిరీలకు చెందిన లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తపరుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కానీ, ప్రభుత్వంలోని పెద్దలు కానీ పట్టించుకోవడంలేదు. స్క్రీనింగ్‌ టెస్టు నుంచి మెయిన్స్‌కు ఎంతమందిని ఎంపిక చేయాలి? రిజర్వేషన్లను ఎలా అమలుచేయాలన్నది ప్రభుత్వం నిర్దేశించాలి. కానీ, ఆ అధికారాన్ని ప్రభుత్వం ఇటీవల ఏపీపీఎస్సీకి అప్పగించింది. గతంలో స్క్రీనింగ్‌ టెస్టు నుంచి మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసేలా ప్రభుత్వం జీఓలు ఇచ్చి ఏపీపీఎస్సీ ద్వారా అమలుచేయించింది.

ఇప్పుడీ అధికారాన్ని కమిషన్‌కు అప్పగించడమే కాదు.. ఎంతమందిని ఏ నిష్పత్తిలో ఎంపిక చేయాలో కమిషన్‌ నిర్ణయానికే వదిలేసింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ముఖ్యులు ఈ కథను తెరవెనుక నుంచి నడిపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్‌ ఇస్తున్న నోటిఫికేషన్లలో ఎక్కడా ఎంపిక విధానం ఎలా ఉంటుందో స్పష్టంచేయకుండా గోప్యత పాటిస్తోంది. మరోవైపు.. నిర్ణీత నిష్పత్తిని ముందుగా ప్రకటించి కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులను పెట్టి అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్టు నుంచి ఎంపికచేయాలని ఆయా వర్గాలు డిమాండ్‌ చేస్తున్నా కమిషన్‌ పట్టించుకోవడంలేదు. స్క్రీనింగ్‌ టెస్టు ముగిశాక జనరల్‌ కటాఫ్‌ను నిర్ణయించి మెయిన్స్‌కు మొత్తం ఎంతమంది అభ్యర్థులు అవసరమో ఆ మేరకు ఎంపికచేస్తామని, వారిలో రిజర్వుడ్‌ అభ్యర్థులు నిష్పత్తిలో లేకపోతే కటాఫ్‌ తగ్గించి తక్కిన వారిని ఎంపికచేస్తామని చెబుతోంది. ఇలా చెబుతూనే.. ఎంపికైన వారు కేవలం వారి రిజర్వుడ్‌ పోస్టులకు మాత్రమే పరిమితమవుతారని షరతు విధించింది. దీంతో ఇప్పటికే పలు సంఘాలు సీఎం చంద్రబాబునాయుడిని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినా ఫలితంలేదు. 

కమిషన్‌ తీరుపై అనుమానాలు
కమిషన్‌ ఇలా చేయడం వెనుక తమకు కావలసిన అభ్యర్థులందరినీ స్క్రీనింగ్‌ టెస్టు నుంచి మెయిన్స్‌కు వచ్చేలా చేయడం, ఆ తరువాత వారికి ఇంటర్వ్యూల్లో అత్యధిక మార్కులు వేయడం ద్వారా గ్రూప్‌–1 సహా ఇతర ముఖ్యమైన పోస్టులను కట్టబెట్టాలన్న వ్యూహం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలే తమ వారి కోసం ఇలా చేయిస్తున్నారని, పూర్తి అధికారాలను కమిషన్‌కు అప్పగించి దాని ద్వారా తమ పనికానిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

వర్సిటీ పోస్టుల్లోనూ ఇదే తంతు
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లోని 1,385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీలోనూ రిజర్వుడ్‌ అభ్యర్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించారు. ఇందులో ఆయా కేటగిరీల వారీగా అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ఆయా వర్సిటీలకు సమర్పించింది. ఈ జాబితా ఆధారంగా ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వ పెద్దలు ఏపీపీఎస్సీ తరహాలోనే రిజర్వుడ్‌ అభ్యర్థులకు ఓపెన్‌ కేటగిరీకి అవకాశంలేకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి కేటగిరీల వారీగా నిర్ణయించిన అర్హత మార్కులను అనుసరించి ఎంపికైన వారందరినీ ఓపెన్‌ కేటగిరీ పోస్టుల ఇంటర్వ్యూలకు పిలవాల్సి ఉన్నా కేవలం తమ వారికి మాత్రమే ఆయా వర్సిటీల ద్వారా ఇంటర్వ్యూ లేఖలను పంపిస్తున్నారు. ఈ విషయం చాలా రహస్యంగా తెరవెనుక జరిగిపోతోందని, అనేక వేలమంది రిజర్వుడ్‌ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్‌
2016 నోటిఫికేషన్ల సమయంలోనే ఏపీపీఎస్సీ ఈ విధంగానే రిజర్వుడ్‌ అభ్యర్థులను వారి కేటగిరీకి పరిమితం చేస్తూ అన్యాయం చేసిందని అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు. కొత్తగా విడుదలయ్యే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వం వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు ఇంతకుముందు పెంచిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వారికి నిర్దేశించిన పరిమితికి అదనంగా ఈ పెంపు కూడా వర్తించింది. కొన్ని నోటిఫికేషన్ల సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ తదితర అభ్యర్థులు మెరిట్‌ సాధించి ఇతరులకన్నా అగ్రస్థానంలో ఓపెన్‌ కేటగిరీ పోస్టులకు అర్హత సాధించినా ఏపీపీఎస్సీ వారిని ఆ పోస్టులకు అనుమతించలేదు. దీనిపై కొందరు అభ్యర్థులు కమిషన్‌ ఎదుట తమ అభ్యంతరం చెప్పినా ఫలితం లేకుండాపోయింది. చివరకు వారు హైకోర్టును ఆశ్రయించారు. వారిని ఇతరులతో పాటే ఓపెన్‌ కేటగిరీ పోస్టులకు అనుమతించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా కమిషన్‌ ఆ తీర్పును ఖాతరు చేయకుండా ప్రభుత్వ పెద్దల సూచనలతో సుప్రీంకోర్టును ఆశ్రయించిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇటీవల సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి.. కమిషన్‌కు లేఖ రాసినా కమిషన్‌ చైర్మన్‌ దాన్ని బేఖాతరు చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. పైగా, హైకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరంలేదని ఏపీపీఎస్సీ పేర్కొంటుండడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement