ఎట్టకేలకు ‘గ్రూప్స్‌’ నోటిఫికేషన్లు | 4 months after the issuing of GO announcement for replacement of Group-1 and Group-2 posts | Sakshi

ఎట్టకేలకు ‘గ్రూప్స్‌’ నోటిఫికేషన్లు

Jan 1 2019 5:12 AM | Updated on Jan 1 2019 5:30 AM

4 months after the issuing of GO announcement for replacement of Group-1 and Group-2 posts - Sakshi

సాక్షి, అమరావతి: ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న దశలో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2 కేటగిరీ పోస్టులు సహా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,386 పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సోమవారం ఏడు వేరువేరు నోటిఫికేషన్లు జారీచేసింది. ఇందులో గ్రూప్‌–1లో 169, గ్రూప్‌–2లో 446, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 308, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు 405, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు 43, అసిస్టెంట్‌ ఫిషరీస్‌ ఇన్‌స్పెక్టర్లు 10, డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్లు 5 పోస్టులకు ఈ నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్‌ పరీక్ష ఫీజు, ఆన్‌లైన్‌ దరఖాస్తుకు వేర్వేరు తేదీలను కమిషన్‌ ఆయా నోటిఫికేషన్లలో పొందుపరిచింది. స్క్రీనింగ్‌ టెస్టు, మెయిన్స్‌ తేదీలకు సంబంధించిన సమాచారాన్ని, నిబంధనలను కమిషన్‌ వెబ్‌సైట్లో ఉంచింది. ప్రభుత్వం అనుమతిం చిన కొత్త ఖాళీలతోపాటు గతంలో భర్తీకాకుండా మిగిలున్న పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లలో వేర్వేరుగా చూపించారు. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోలో పేర్కొన్న కొన్ని కేటగిరీల పోస్టులు నోటిఫికేషన్లలో పెరగ్గా మరికొన్ని పోస్టులు తగ్గాయి. కీలకమైన గ్రూప్‌–1 పోస్టులు జీవోలో 182 ఉండగా నోటిఫికేషన్లో 169 మాత్రమే చూపించారు. గ్రూప్‌–2లో జీవోలో 337 పోస్టులను చూపించగా గతంలో మిగిలిన వాటిని కలుపుకుని 446 పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 154, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 292 ఉన్నాయి. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్‌ ఇంజనీరింగ్‌ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా కేటగిరీల్లో దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య 25 వేలు దాటితే స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు తేదీల్ని కమిషన్‌ వెబ్‌సైట్లో పెట్టింది. అలాగే ఈ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆన్‌లైన్లో ఫీజు చెల్లించడానికి ఆయా దరఖాస్తుల చివరి గడువుకు ముందు తేదీల్లో అర్థరాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్ల విడుదలపై సర్కారు జాప్యం
రాష్ట్రంలోని దాదాపుగా 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తూతూమంత్రంగానే నోటిఫికేషన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఖాళీలన్నీ భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2016లో కానీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అది కూడా కేవలం 4,275 పోస్టులకు మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు నోటిఫికేషన్ల జాడలేదు. గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులు కోచింగ్‌లకోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. వేలాదిమంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోవడంతో నష్టపోయారు. వారంతా ఆందోళనలు చేసినా ఉపయోగం లేకపోయింది. తీరా సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో సర్కారు పోస్టుల భర్తీ అంటూ హడావుడి చేస్తోంది. వివిధ పోస్టుల భర్తీకోసం గత సెప్టెంబర్‌ 19న జీవో 153ని విడుదల చేసింది. ఒకవైపు ఖాళీలు లక్షల సంఖ్యలో ఉండగా.. ప్రభుత్వం మాత్రం టీచర్, పోలీసు సిబ్బంది సహా 18,450 పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించి నిరుద్యోగులను ఉస్సూరనిపించింది. ఆయా శాఖలు తమకు ఎన్ని పోస్టులు అవసరమో నివేదికలు పంపినా ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా మరో కమిటీని వేసి వాటిని సగానికి సగం కుదించేసింది. ఈ పోస్టుల నోటిఫికేషన్లూ వెంటనే వెలువరించలేదు. రిజర్వేషన్లు, రోస్టర్‌ తదితర సమాచారాన్ని ఏపీపీఎస్సీకి అందించడంలో విపరీత జాప్యం ఫలితంగా నాలుగు నెలల తరువాత కానీ తాజా నోటిఫికేషన్లు రాలేదు.

రూల్‌ 7 ఎత్తివేసి నిరుద్యోగులకు కుచ్చుటోపీ
ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన పోస్టులకన్నా కొన్ని కేటగిరీల్లో పోస్టులు పెరిగినట్లు చూపుతున్నా అది సర్కారు కనికట్టు మాత్రమే. గతంలో ఏ నోటిఫికేషన్లో అయినా పోస్టుల్లో చేరినవారు రాజీనామా చేసినా, ఇతర కారణాల వల్ల మిగిలిపోయినా ఏపీపీఎస్సీ నిబంధనల్లోని రూల్‌ 7 ప్రకారం ఆ నోటిఫికేషన్‌కు సంబంధించిన మెరిట్‌ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు కేటాయించడం జరిగేది. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ రూల్‌ 7ను ఎత్తివేయించారు. ఫలితంగా మిగిలిపోయిన పోస్టులు మెరిట్‌ అభ్యర్థులకు కాకుండా తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లించేలా నిరుద్యోగులకు చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారు. 2016 నోటిఫికేషన్లలో 4,275 పోస్టులు ప్రకటించినా అందులో సగం పోస్టులే భర్తీకాగా తక్కినవన్నీ మెరిట్‌ అభ్యర్థులకు దక్కకుండా తాజా నోటిఫికేషన్లలో చేరాయి. ఈసారి గ్రూప్‌–1 పోస్టులు తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న పోస్టుల్లో ఎండీవో పోస్టులు తాజాగా చూపించలేదని, అందువల్లనే ఆ పోస్టులు తగ్గిపోయాయని కమిషన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement