లక్ష మంది టెటౌట్‌! | 2011 Tet Validity ended in July last year | Sakshi
Sakshi News home page

లక్ష మంది టెటౌట్‌!

Published Fri, Feb 1 2019 1:10 AM | Last Updated on Fri, Feb 1 2019 1:10 AM

2011 Tet Validity ended in July last year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హత కోల్పోయారు. ఇప్పటికిప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వస్తే వారు అనర్హులుగానే మిగిలిపోనున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరే ఆగిపోలేదు. ప్రైవేటు పాఠశాలల్లోనూ వీరు అధ్యాపకులుగా పని చేసేందుకు అర్హత కోల్పోనున్నారు. వీరితోపాటు 2017 జూలై తరువాత డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) పూర్తి చేసిన మరో 50 వేల మందిదీ ఇదే దుస్థితి. ఇందుకు కారణం లక్ష మంది అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వ్యాలిడిటీ ముగిసిపోవడమే. 2011 జూలై 1వ తేదీన, 2012 జనవరి 8వ తేదీన నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన వారిలో.. దాదాపు లక్ష మంది అర్హత ఈ ఏడాది జనవరి 8వ తేదీతో ముగిసిపోయింది. మరోవైపు కొత్తగా డీఎడ్, బీఎడ్‌ పూర్తి చేసిన ఆ 50 వేల మందికి టెట్‌ నిర్వహించకపోవడంతో వారంతా సమీప భవిష్యత్తులో ఉండే (ఒకవేళ ప్రభుత్వం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తే) ఉపాధ్యాయ పోస్టులకు అనర్హులుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది.

2011 నుంచే అమల్లోకి
రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి టెట్‌లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) 2010లోనే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోనూ ఏటా రెండుసార్లు (నవంబర్‌/డిసెంబర్, జూన్‌/జూలై) టెట్‌ నిర్వహించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అర్హ్హత సాధించిన వారే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఉత్తర్వులు జారీ చేసింది. పైగా టెట్‌ స్కోర్‌ వ్యాలిడిటీ ఏడేళ్లేనని స్పష్టం చేసింది. ఏడేళ్ల తరువాత ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మళ్లీ టెట్‌లో అర్హత సాధించాల్సిందేనని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ నిబంధన ప్రకారం రాష్ట్రంలో మొదటి ఏడాది తప్ప.. ఏ ఒక్క ఏడాదీ రెండుసార్లు టెట్‌ను నిర్వహించలేదు. 

కొత్తరాష్ట్రంలో రెండేసార్లు..
2011 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం ఆరుసార్లు టెట్‌ను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు, తెలంగాణ ఏర్పడ్డాక రెండుసార్లు టెట్‌ పరీక్ష జరిగింది. ఇందులో 2011 జూలై 1వ తేదీన నిర్వహించిన టెట్‌ వ్యాలిడిటీ 2018 జూలై 1వ తేదీతో ముగిసిపోయింది. 2012 జనవరి 8వ తేదీన నిర్వహించిన రెండో టెట్‌ వ్యాలిడిటీ ఈనెల 8వ తేదీతో ముగిసిపోయింది. దీంతో అప్పటి టెట్‌ పరీక్షలో అర్హత సాధించిన వారిలో లక్ష మందికి పైగా అభ్యర్థులు తమ టెట్‌ స్కోర్‌ను, దాని వ్యాలిడిటీని కోల్పోవడంతో అర్హత పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉపాధ్యాయ పోస్టుల్లో చేరాలంటే టెట్‌ అర్హత తప్పనిసరి నిబంధన నేపథ్యంలో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ దాటితే 2012 జూన్‌ 1న నిర్వహించిన మూడో టెట్‌ స్కోర్‌ వ్యాలిడిటీ కూడా రద్దు కానుంది. దీని ద్వారా మరో 50 వేల మంది అనర్హులుగా మిగిలిపోనున్నారు.

4,36,998 మంది అర్హులు
టెట్‌ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్‌ స్కోర్‌కు వెయిటేజీ ఉంది. ప్రభుత్వం ఏటా రెండుసార్లు నిర్వహించే టెట్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులు మళ్లీ మళ్లీ టెట్‌కు హాజరై తమ స్కోర్‌ను పెంచుకోవచ్చు. దీంతో రాష్ట్రంలో నిర్వహించిన మొదటి రెండు టెట్‌లకు 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 4,36,998 మందికి అర్హత లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌ ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 2 లక్షల మంది వరకుఉన్నారు. మరో 2 లక్షల పైచిలుకు తెలంగాణ అభ్యర్థులున్నారు. వీరిలో లక్ష మంది.. 2012 జూన్, 2014 మార్చి, 2016 మే, 2017 జూలై నెలలో నిర్వహించిన టెట్‌ పరీక్ష రాసి.. మళ్లీ అర్హత సాధించారు. దీంతో వారికి ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. మిగతా లక్ష మంది మాత్రం అప్పట్లో తమకు ఎలాగూ అర్హత ఉంది కదా అన్న ఉద్దేశమో.. లేక ప్రభుత్వం ఏలాగూ ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తుందన్న భరోసాతో తర్వాత మళ్లీ రాయవచ్చులే అనే భావనతోనే గానీ.. టెట్‌ను మళ్లీ రాయలేదు. దీంతో వారి స్కోర్‌ వ్యాలిడిటీ ప్రస్తుతం ముగిసిపోయింది.

గురుకుల నోటిఫికేషన్‌ వస్తే ఎలా?
వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 119 కొత్త బీసీ గురుకులాలు ప్రారంభం కానున్నా యి. అందులో 1,071 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులున్నాయి. వాటికి టెట్‌లో అర్హ త సాధించి ఉన్న దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కానీ లక్షన్నర మందికి ఆ అర్హత లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉన్నందున విద్యాశాఖ వెంటనే స్పందించి టెట్‌ నిర్వహణకు చర్యలు చేపట్టాలని డీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశా రు. అకస్మాత్తుగా ప్రభుత్వం ఆ పోస్టుల భర్తీకి చర్యలు చేపడితే టెట్‌ అర్హత లేని అభ్యర్థులు ఆ పోస్టులకు అనర్హులుగా మిగిలిపోవాల్సి వస్తుం దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

50 వేల మంది కొత్త వారికి..
రాష్ట్రంలో రెండేళ్లలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసిన 50 వేల మంది కొత్త విద్యార్థులకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 2017 జూలై 23వ తేదీ తరువాత విద్యాశాఖ మళ్లీ రాష్ట్రంలో టెట్‌ నిర్వహిం చింది. ఏడాదిన్నర కాలంలో టెట్‌ను పట్టిం చుకోలేదు. 2017లో, 2018లో బీఎడ్, డీఎడ్‌ పూర్తయిన వారు దాదాపు 50 వేల మంది టెట్‌ పరీక్షకు హాజరు కాలేదు. మరోవైపు వచ్చే మే నాటికి మరో బ్యాచ్‌ బీఎడ్, డీఎడ్‌ను పూర్తి చేసుకోనుంది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ వస్తే వారికి టెట్‌లో అర్హత లేనందున, వారు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులవుతారు. అంతేకాదు టెట్‌లో అర్హత లేకపోవడంతో వారు కనీసం ప్రైవేటు పాఠ«శాలల్లో టీచర్లుగా చేరేందుకు కూడా అర్హతలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement