Teacher candidates
-
ప్రమాణాలు లేకపోతే మూతే!
సాక్షి, అమరావతి : విద్యాబోధనలో కనీస ప్రమాణాలు కూడా పాటించని బీఈడీ కాలేజీలను మూసివేయించాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) భావిస్తోంది. నిర్ణీత నిబంధనల మేరకు భవనాలు, బోధనా సిబ్బంది సహాఇతర కనీస ఏర్పాట్లు కూడా లేకుండా కేవలం కాగితాలకే పరిమితమైన వేలాది కాలేజీలకు ఇక మంగళం పాడనుంది. కుప్పలు తెప్పలుగా పెరిగిపోయిన ఈ కాలేజీల కారణంగా ఏటా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో టీచర్ అభ్యర్థులు బయటకు వస్తున్నారు. వీరిలో కనీస ప్రమాణాలు కూడా ఉండడంలేదని ఇటీవల ఎన్సీటీఈ నిర్వహించిన తనిఖీల్లో తేటతెల్లమైంది. బోధన చేయలేని ఇలాంటి టీచర్ల కారణంగా ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో ప్రమాణాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. సరైన ప్రమాణాలు లేకుండా కొనసాగుతున్న బీఈడీ కాలేజీలను మూసివేయించేందుకు ఎన్సీటీఈ నిర్దిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఇలాంటి కాలేజీలను ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలు గుర్తించాలని ఎన్సీటీఈ సభ్య కార్యదర్శి సంజయ్ అవస్థి అన్ని రాష్ట్రాలు, ప్రాంతీయ మండళ్లకు నోటీసులు జారీచేశారు. అలాగే, ఎన్సీటీఈ సదరన్ రీజనల్ కమిటీ రీజనల్ డైరక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్ శర్మ రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌కు కూడా లేఖ ద్వారా తెలిపారు. 19వేల కాలేజీల పనితీరు పరిశీలన కాగా, దేశవ్యాప్తంగా 19వేల బీఈడీ కాలేజీల్లోని ప్రమాణాలు, ఇతర పరిస్థితులపై ఎన్సీటీఈ ఇటీవల జరిపిన పరిశీలనలో నివ్వెరపోయే అంశాలు వారి దృష్టికి వచ్చాయి. అవి.. - బీఈడీ డిగ్రీ అనేది టీచర్‌గా కాకుండా పెళ్లి కోసమో, స్టేటస్ కోసమో.. కేవలం సర్టిఫికెట్ కోసమో ఈ కాలేజీల్లో పలువురు చేరుతున్నట్లు గుర్తించింది. - వాస్తవానికి జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూళ్లలో టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1 : 27గా నిర్దేశించారు. ఈ లెక్కన దేశవ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 26 కోట్లుగా ఉంది. విద్యార్థి నిష్పత్తి ప్రకారం 90 లక్షల మంది టీచర్లుండాలి. ప్రస్తుతం స్కూళ్లలో ఉన్న టీచర్ల సంఖ్య పోను అవసరమైన మిగతా టీచర్ల సంఖ్య కేవలం 3 లక్షలు మాత్రమే. కానీ, ఏటా 19 లక్షల మంది బయటకు వస్తున్నారు. ఈ లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా 10వేలకు పైగా కాలేజీలను మూసేసినా ఇంకా మూడు రెట్లు ఎక్కువగా ఏటా టీచర్ అభ్యర్థులు బయటకు రానున్నారు. అన్ని బీఈడీ కాలేజీల్లో బయోమెట్రిక్ ఇదిలా ఉంటే.. కాలేజీల్లో విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంటుండడంతో ఎన్సీటీఈ అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని విద్యార్థులకే కాక బోధనా సిబ్బందికీ తప్పనిసరి చేసింది. అలాగే, కాలేజీకి సంబంధించిన అన్ని వివరాలను వెబ్సైట్లో ప్రదర్శించాలని.. అధికారులు వాటిని వారం వారం పరిశీలిస్తారని.. ప్రమాణాలు లేని కాలేజీలు, నిబంధనలు పాటించని వాటి గుర్తింపును వెంటనే రద్దుచేయనున్నట్లు హెచ్చరించింది. రాష్ట్రంలో కనీస ప్రమాణాలు కరువు ఇక రాష్ట్రంలోని మొత్తం 431 బీఈడీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించే సంస్థలు నామమాత్రంగా ఉన్నాయి. వీటిల్లో కనీస సదుపాయాలూ కల్పించడంలేదు. కొన్నయితే సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టజెబుతూ కేవలం కాగితాల్లోనే మాయచేస్తున్నాయి. ఒకే భవనంలో వేర్వేరు పేర్లతో కాలేజీలు నడిపిస్తున్న యాజమాన్యాలు కూడా ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యే సీట్ల సంఖ్య అరకొరగా ఉన్నా ఆ తరువాత స్పాట్ అడ్మిషన్ల కింద ఇతర రాష్ట్రాల నుంచి అభ్యర్థులను రప్పిస్తూ బీఈడీ కోర్సును ఒక దందాగా మార్చేశాయి. -
లక్ష మంది టెటౌట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హత కోల్పోయారు. ఇప్పటికిప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే వారు అనర్హులుగానే మిగిలిపోనున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరే ఆగిపోలేదు. ప్రైవేటు పాఠశాలల్లోనూ వీరు అధ్యాపకులుగా పని చేసేందుకు అర్హత కోల్పోనున్నారు. వీరితోపాటు 2017 జూలై తరువాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) పూర్తి చేసిన మరో 50 వేల మందిదీ ఇదే దుస్థితి. ఇందుకు కారణం లక్ష మంది అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీ ముగిసిపోవడమే. 2011 జూలై 1వ తేదీన, 2012 జనవరి 8వ తేదీన నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన వారిలో.. దాదాపు లక్ష మంది అర్హత ఈ ఏడాది జనవరి 8వ తేదీతో ముగిసిపోయింది. మరోవైపు కొత్తగా డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన ఆ 50 వేల మందికి టెట్ నిర్వహించకపోవడంతో వారంతా సమీప భవిష్యత్తులో ఉండే (ఒకవేళ ప్రభుత్వం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే) ఉపాధ్యాయ పోస్టులకు అనర్హులుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. 2011 నుంచే అమల్లోకి రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి టెట్‌లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2010లోనే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోనూ ఏటా రెండుసార్లు (నవంబర్/డిసెంబర్, జూన్/జూలై) టెట్ నిర్వహించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అర్హ్హత సాధించిన వారే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఉత్తర్వులు జారీ చేసింది. పైగా టెట్ స్కోర్ వ్యాలిడిటీ ఏడేళ్లేనని స్పష్టం చేసింది. ఏడేళ్ల తరువాత ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మళ్లీ టెట్‌లో అర్హత సాధించాల్సిందేనని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ నిబంధన ప్రకారం రాష్ట్రంలో మొదటి ఏడాది తప్ప.. ఏ ఒక్క ఏడాదీ రెండుసార్లు టెట్‌ను నిర్వహించలేదు. కొత్తరాష్ట్రంలో రెండేసార్లు.. 2011 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం ఆరుసార్లు టెట్‌ను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు, తెలంగాణ ఏర్పడ్డాక రెండుసార్లు టెట్ పరీక్ష జరిగింది. ఇందులో 2011 జూలై 1వ తేదీన నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ 2018 జూలై 1వ తేదీతో ముగిసిపోయింది. 2012 జనవరి 8వ తేదీన నిర్వహించిన రెండో టెట్ వ్యాలిడిటీ ఈనెల 8వ తేదీతో ముగిసిపోయింది. దీంతో అప్పటి టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారిలో లక్ష మందికి పైగా అభ్యర్థులు తమ టెట్ స్కోర్‌ను, దాని వ్యాలిడిటీని కోల్పోవడంతో అర్హత పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉపాధ్యాయ పోస్టుల్లో చేరాలంటే టెట్ అర్హత తప్పనిసరి నిబంధన నేపథ్యంలో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ ఏడాది జూన్ 1వ తేదీ దాటితే 2012 జూన్ 1న నిర్వహించిన మూడో టెట్ స్కోర్ వ్యాలిడిటీ కూడా రద్దు కానుంది. దీని ద్వారా మరో 50 వేల మంది అనర్హులుగా మిగిలిపోనున్నారు. 4,36,998 మంది అర్హులు టెట్ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉంది. ప్రభుత్వం ఏటా రెండుసార్లు నిర్వహించే టెట్లలో అర్హత సాధించిన అభ్యర్థులు మళ్లీ మళ్లీ టెట్‌కు హాజరై తమ స్కోర్‌ను పెంచుకోవచ్చు. దీంతో రాష్ట్రంలో నిర్వహించిన మొదటి రెండు టెట్‌లకు 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 4,36,998 మందికి అర్హత లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్ ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 2 లక్షల మంది వరకుఉన్నారు. మరో 2 లక్షల పైచిలుకు తెలంగాణ అభ్యర్థులున్నారు. వీరిలో లక్ష మంది.. 2012 జూన్, 2014 మార్చి, 2016 మే, 2017 జూలై నెలలో నిర్వహించిన టెట్ పరీక్ష రాసి.. మళ్లీ అర్హత సాధించారు. దీంతో వారికి ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. మిగతా లక్ష మంది మాత్రం అప్పట్లో తమకు ఎలాగూ అర్హత ఉంది కదా అన్న ఉద్దేశమో.. లేక ప్రభుత్వం ఏలాగూ ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తుందన్న భరోసాతో తర్వాత మళ్లీ రాయవచ్చులే అనే భావనతోనే గానీ.. టెట్‌ను మళ్లీ రాయలేదు. దీంతో వారి స్కోర్ వ్యాలిడిటీ ప్రస్తుతం ముగిసిపోయింది. గురుకుల నోటిఫికేషన్ వస్తే ఎలా? వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 119 కొత్త బీసీ గురుకులాలు ప్రారంభం కానున్నా యి. అందులో 1,071 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులున్నాయి. వాటికి టెట్‌లో అర్హ త సాధించి ఉన్న దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కానీ లక్షన్నర మందికి ఆ అర్హత లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నందున విద్యాశాఖ వెంటనే స్పందించి టెట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశా రు. అకస్మాత్తుగా ప్రభుత్వం ఆ పోస్టుల భర్తీకి చర్యలు చేపడితే టెట్ అర్హత లేని అభ్యర్థులు ఆ పోస్టులకు అనర్హులుగా మిగిలిపోవాల్సి వస్తుం దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 50 వేల మంది కొత్త వారికి.. రాష్ట్రంలో రెండేళ్లలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసిన 50 వేల మంది కొత్త విద్యార్థులకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 2017 జూలై 23వ తేదీ తరువాత విద్యాశాఖ మళ్లీ రాష్ట్రంలో టెట్ నిర్వహిం చింది. ఏడాదిన్నర కాలంలో టెట్‌ను పట్టిం చుకోలేదు. 2017లో, 2018లో బీఎడ్, డీఎడ్ పూర్తయిన వారు దాదాపు 50 వేల మంది టెట్ పరీక్షకు హాజరు కాలేదు. మరోవైపు వచ్చే మే నాటికి మరో బ్యాచ్ బీఎడ్, డీఎడ్‌ను పూర్తి చేసుకోనుంది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే వారికి టెట్‌లో అర్హత లేనందున, వారు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులవుతారు. అంతేకాదు టెట్‌లో అర్హత లేకపోవడంతో వారు కనీసం ప్రైవేటు పాఠ«శాలల్లో టీచర్లుగా చేరేందుకు కూడా అర్హతలేదు. -
డీఎస్సీలో పర్సంటేజీల పితలాటకం!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి బ్యూరో: డీఎస్సీ–2018లో ప్రభుత్వం పేర్కొన్న పర్సంటేజీ పితలాటకం లాంగ్వేజి టీచర్ అభ్యర్థులకు శాపంగా మారింది. బీఈడీలో ప్రవేశాలకు డిగ్రీ/పీజీల్లో ఓసీలు 50 శాతం, బీసీలు 40 శాతం మార్కులు సాధించాలి. డిగ్రీలో ఈ పర్సంటేజి లేనిపక్షంలో పోస్టు గ్రాడ్యుయేషన్లోనైనా ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లోనూ ఈ పర్సంటేజి ఉంటే చాలని పేర్కొన్నారు. అయితే, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీల)కు డిగ్రీలో 50 శాతం ఉండాలని తాజా డీఎస్సీలో నిబంధన విధించారు. కానీ, డిగ్రీలో 50 శాతం ఉత్తీర్ణత శాతం లేని వారిని పీజీలో 50 శాతం ఉన్నా ఆన్లైన్లో ‘రిజెక్టెడ్’ అని వస్తోంది. దీంతో అర్హత ఉన్నా అన్యాయానికి గురవుతున్నామని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, దరఖాస్తుల దాఖలుకు ఈనెల 16 వరకు మాత్రమే గడువుంది. 2018 డీఎస్సీ ద్వారా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీలు వెరసి 7,907 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ పర్సంటేజి 50 శాతం ఉండాలన్న నిబంధన వీరికి శరాఘాతంలా మారింది. ఈ నిబంధనతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు డీఎస్సీకి దూరమయ్యే ప్రమాదంలో పడ్డారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం నెల క్రితం డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. అందులో పీజీలో 50 శాతం ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులను డీఎస్సీకి అనుమతించారు. అదే మాదిరిగా రాష్ట్రంలోనూ పీజీలో 50 శాతం ఉన్న అభ్యర్థులను డీఎస్సీకి అనుమతించేలా మార్పులు చేయాలని వీరు కోరుతున్నారు. భారీ సిలబస్ కూడా భారమే.. ఇదిలా ఉంటే.. వచ్చే నెల 11న జరగనున్న డీఎస్సీ పరీక్షకు ఖరారు చేసిన సిలబస్ ఎంతో కఠినంగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. ఉదా.. పీజీటీలకు 50 పాఠాలు.. విద్యా ధృక్పథాలు, మనోవిజ్ఞాన శాస్త్రం, జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ మెథడాలజీ, ఇంగ్లీష్ గ్రామర్, కవులు, రచయితల గురించి రాయాల్సి ఉంటుంది. ఇంతటి భారీ సిలబస్‌ను అక్టోబరు 31న ప్రకటించారు. గతంలో తేలికగా ఉండే సిలబస్‌ను ప్రకటించిన తేదీకి, పరీక్షకు 60 రోజుల వ్యవధి ఉండేది. కానీ, ఇప్పుడు 40 రోజులే సమయం ఇచ్చి కఠిన సిలబస్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కాగా, దరఖాస్తు చేసుకున్న జిల్లాలో పోస్టులు ఖాళీ లేకపోతే పొరుగు జిల్లాల్లో రాసుకునే వెసులుబాటు కల్పించాలని డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు. పీఈటీ అభ్యర్థులకూ గందరగోళ పరిస్థితి మరోవైపు.. పీఈటీ అభ్యర్థుల పరీక్షల విధానంలోనూ ప్రభుత్వం మార్పుచేసింది. కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టి వారిని గందరగోళంలోకి నెట్టింది. కోర్టు తీర్పుల ద్వారా తొలగించిన శారీరక సామర్థ్య పరీక్షలను తెరపైకి తెచ్చింది. ఈ నిర్ణయం కొంతమందికి మేలు చేయాలన్న తలంపుతో తెచ్చిందంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అలాగే, రాత పరీక్షకు మార్కులు తగ్గించి ఫిజికల్ టెస్ట్‌కు అధిక మార్కులు కేటాయించడంవల్ల కూడా అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. టీడీపీ నేతల బేరసారాలు ఈ నేపథ్యంలో కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నాయకులు అప్పుడే బేరాలకు తెరతీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 30 మార్కులు ఫిజికల్ టెస్ట్‌లో సాధిస్తే ఉద్యోగం దాదాపు ఖాయమైనట్టేనన్న భావనతో కొందరు అభ్యర్థులు లక్షల్లో ముట్టచెప్పటానికి సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తనకు రూ.10 లక్షలు ఇస్తే 30కి 28–29 మార్కులు వేయించగలనంటూ హామీలు ఇస్తున్న విషయం ఇప్పుడు కృష్ణాజిల్లా అవనిగడ్డ కోచింగ్ సెంటర్లలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, వయో పరిమితిని జనరల్ కేటగిరి అభ్యర్థులకు 44 ఏళ్లు, ఇతరులకు 49 ఏళ్లుగా నిర్ణయించారు. ఆ వయసులో 800 మీటర్ల పురుగు పందెం, లాంగ్ జంప్, హైజంప్‌లను ఎలా పూర్తి చేయగలమంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఫిజికల్ టెస్ట్ రాత పరీక్షకు ముందు ఉంటుందా? తరువాత ఉంటుందా? అన్నదీ అంతుపట్టకుండా ఉంది. సిలబస్ మార్పుతో సమస్యలు ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుని టెట్ పాసైన తరువాత డీఎస్సీ రాత పరీక్షకు సిలబస్ మార్చడం ఇబ్బందికరంగా ఉంది. తక్కువ సమయం ఉందనగా ప్రకటించడం, అందుకు తగ్గ పుస్తకాలు లభించకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. – వాల్మీకి నరసింహ, పీఈటీ అభ్యర్థి, అనంతపురం మేం ఎలా పరిగెత్తగలం.. అన్ని ఫిజికల్ టెస్టులు పాసై బీపీఎడ్ పట్టా పొందాను. నేను ఇప్పుడు గర్భిణిని. ఈ సమయంలో నేను ఎలా పరిగెత్తగలను. మహిళలకు పెళ్లి తర్వాత ఫిట్‌గా ఉండలేం. వీరిని దృష్టిలో ఉంచుకొని కొన్ని మినహాయింపులు ఇవ్వాలి. – జీవన, పీఈటీ అభ్యర్థి, నెల్లూరు -
టీచర్ అభ్యర్థులకు ‘టెట్’ తిప్పలు!
* సంబంధం లేని సబ్జెక్టులతో తంటాలు.. * అధిక సిలబస్‌తో ఆందోళన * ఇంటర్, డిగ్రీల్లోనూ చదవని సబ్జెక్టుల ప్రశ్నలు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రామకృష్ణ 2009లో బీఎస్సీ పూర్తి చేశాడు. ఉపాధ్యాయుడిగా జీవితంలో స్థిరపడాలని భావించి ఎడ్‌సెట్ రాశాడు. కష్టపడి చదివి ర్యాంకు సాధించి.. ప్రభుత్వ కాలేజీలో బీఎడ్ పూర్తి చేశాడు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుండగానే... 2010 ఆగస్టులో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ‘టెట్’ పేరిట పిడుగువేసింది. ఇది మరో పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి కల్పించింది. 2011లో విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పరీక్షకు విస్తృతమైన సిలబస్‌ను ప్రకటించింది. దీంతో ఆందోళనలో పడడం రామకృష్ణ వంతయింది. తాను ఇంటర్, డిగ్రీలో చదువుకున్న సబ్జెక్టులకు సంబంధం లేని గణితం అదనంగా వచ్చి చేరింది. దానికితోడు అర్హతా మార్కుల శాతమూ ఎక్కువే. దీంతో 2011 నుంచి నిర్వహించిన మూడు టెట్‌లలోనూ రామకృష్ణ అర్హత సాధించలేదు. ఇక తాను టీచర్ ఉద్యోగం సాధించలేనేమోనని ఆయన ఆవేదనలో కూరుకుపోయాడు. రాష్ట్రంలో టెట్ కోసం సిద్ధమవుతున్న లక్షల మంది అభ్యర్థులందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. దేవరకొండకు చెందిన ప్రమీల కూడా ఇదే ఆందోళన, మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. లక్షల మంది అనర్హులే.. మొత్తంగా ఇప్పటివరకు నాలుగుసార్లు నిర్వహించిన టెట్లలో 55 శాతానికి మించి అభ్యర్థులు అర్హత సాధించకపోవడం గమనార్హం. 2011లో తొలిసారి నిర్వహించిన టెట్ పేపర్-2కు 3,61,206 మంది హాజరైతే... 1,71,437 మందే అర్హత సాధించారు. 2012లో నిర్వహించిన రెండో టెట్ 4,15,137 మంది రాస్తే.. 2,04,126 మంది, అదే ఏడాది నిర్వహించిన మూడో టెట్‌ను 4.14 లక్షల మందిరాస్తే.. 2,01,087 మంది, 2014 మార్చిలో నిర్వహించిన నాలుగో టెట్ పేపర్-2కు 3,40,561 మంది హాజరైతే... 1,10,099 మంది (32 శాతమే) అర్హత సాధించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పండిట్, డీఎడ్ అభ్యర్థులకూ తప్పని తంటా! సంబంధంలేని సిలబస్‌తో పరీక్ష రాయడమన్నది బీఎడ్ పూర్తిచేసినవారికే కాదు... పండిత శిక్షణ, డీఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకూ తప్పలేదు. వాస్తవానికి ఇంటర్‌తో డీఎడ్ చేసిన అభ్యర్థి 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు మాత్రమే అర్హులు. వారు టెట్ పేపర్-1లో భాగంగా 30 మార్కులు గణితం ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వస్తోంది. ఇక తెలుగు, ఉర్దూ, హిందీ పండితులైతే ఆయా భాషా సబ్జెక్టులను మాత్రమే బోధిస్తారు. కానీ వారికి ఇంగ్లిషు, సాంఘిక శాస్త్రం తంటాలు తప్పడం లేదు. వారు టెట్ పేపర్-2లో అర్హత సాధిస్తేనే పండిట్ పోస్టుల కోసం డీఎస్సీ రాసేందుకు అర్హులు. ఇక సాంఘికశాస్త్రం బీఎడ్ వారికి తెలుగు, ఇంగ్లిషు ‘పరీక్ష’ పెడుతున్నారు. 9, 10 తరగతులకు అవసరమే లేదు ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ పేపర్-1 పరీక్షను ఒకటి నుంచి ఐదు తరగతుల వారికే నిర్వహించాలి. పేపర్-2 పరీక్ష 6, 7, 8 తరగతులకు బోధించాలనుకునే వారికి నిర్వహించాలి. కానీ రాష్ట్రంలో 9, 10 తరగతులు బోధించే వారికి కూడా టెట్ నిర్వహిస్తున్నారు. అయితే తాము ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారమే తాము ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని టెట్ డెరైక్టర్ జగన్నాథరెడ్డి తెలిపారు. మరోవైపు ఉపాధ్యాయ అభ్యర్థి ప్రమీల ఆత్మహత్యపై విద్యాశాఖ ప్రభుత్వానికి మంగళవారం నివేదిక పంపింది. ఆమె టెట్ కోసం చేసిన దరఖాస్తు వివరాలను నివేదికలో పేర్కొంది. కనీస అవగాహన తప్పనిసరి ‘‘టీచర్‌గా బడిలోకి వెళ్లే వారికి అన్ని అంశాలపై కనీస అవగాహన తప్పనిసరిగా ఉండాలి. టెట్ సిలబస్ అంత కష్టతరంగా లేదు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి మౌలిక అంశాలే ఉన్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో ప్రమాణాలు ఉండటం లేదు. ఇలాంటి మౌలిక అంశాలపై కూడా అవగాహన లేకపోతే కష్టమవుతుంది..’’ - విద్యావేత్త చుక్కా రామయ్య స్కూల్ అసిస్టెంట్లకు టెట్ రద్దు చేయాలి ‘‘టెట్‌లో సంబంధంలేని సబ్జెక్టుల సిలబస్‌ను తొలగించాలి. స్కూల్ అసిస్టెంట్ అంటేనే సబ్జెక్టు టీచర్. తాను బోధించే సబ్జెక్టులోనే టెట్‌ను నిర్వహించాలి. 9, 10 తరగతులకు బోధించే వారికి టెట్‌ను రద్దు చేయాలి. భాషా పండితులకు వారు బోధించే భాషల్లోనే టెట్ నిర్వహించాలి. ఇంగ్లిషు, సోషల్ సిలబస్ తొలగించాలి..’’ - మధుసూదన్, శ్రీనివాసరెడ్డి, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవేదన చెందవద్దు ‘‘విద్యార్థులంతా జీవితం ఎంతో విలువైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తాము విజయం సాధించలేదనే ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒత్తిడిని నియంత్రించుకోవాలి. పాజిటివ్ థింకింగ్ ముఖ్యం..’’ - జవహర్‌లాల్‌నెహ్రూ, సైకాలజిస్టు -
ఫలించిన పోరాటం
ఏలూరు సిటీ : జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)-08 అభ్యర్థులు ఎనిమిదేళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. అలుపెరుగని పోరాటం చేసి తమకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలను ఉపాధ్యాయ అభ్యర్థులు సాధించుకున్నారు. డీఎస్సీ-08లో ఎంపిక జాబితాలో చోటు సాధించినా చివరికి ఉద్యోగాలు రాకుండా నష్టపోయిన భాషాపండితులకు ఊరట లభించింది. డీఈవో కార్యాలయం నుంచి హైదరాబాద్‌లోని పాఠశాల విద్య డెరైక్టరేట్, న్యాయస్థానాలు ఇలా ప్రతి చోటుకీ ఏళ్ల తరబడి వందలసార్లు తిరిగిన కష్టానికి ఉద్యోగాలు రావటంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భాషా పండిట్స్ 30 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లాలో ఖాళీల పరిస్థితిని పరిశీలించిన జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు భాషాపండిట్ తెలుగు పోస్టులు 14 క్లియర్ వెకెన్సీలుగా చూపించారు. మరో 16 పోస్టుల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. ఖాళీగా ఉన్న 14 పోస్టుల్లో డీఎస్సీ-08లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఐదుగురు అభ్యర్థులు స్వయంగా వచ్చి నియామక పత్రాలు అందుకోగా, మిగిలిన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉపాధ్యాయులు 15 రోజుల్లోగా ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుందని డీఈవో తెలిపారు. మిగిలిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.