ఫలించిన పోరాటం
ఏలూరు సిటీ : జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)-08 అభ్యర్థులు ఎనిమిదేళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. అలుపెరుగని పోరాటం చేసి తమకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలను ఉపాధ్యాయ అభ్యర్థులు సాధించుకున్నారు. డీఎస్సీ-08లో ఎంపిక జాబితాలో చోటు సాధించినా చివరికి ఉద్యోగాలు రాకుండా నష్టపోయిన భాషాపండితులకు ఊరట లభించింది. డీఈవో కార్యాలయం నుంచి హైదరాబాద్‌లోని పాఠశాల విద్య డెరైక్టరేట్, న్యాయస్థానాలు ఇలా ప్రతి చోటుకీ ఏళ్ల తరబడి వందలసార్లు తిరిగిన కష్టానికి ఉద్యోగాలు రావటంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భాషా పండిట్స్ 30 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే జిల్లాలో ఖాళీల పరిస్థితిని పరిశీలించిన జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు భాషాపండిట్ తెలుగు పోస్టులు 14 క్లియర్ వెకెన్సీలుగా చూపించారు. మరో 16 పోస్టుల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. ఖాళీగా ఉన్న 14 పోస్టుల్లో డీఎస్సీ-08లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ఐదుగురు అభ్యర్థులు స్వయంగా వచ్చి నియామక పత్రాలు అందుకోగా, మిగిలిన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉపాధ్యాయులు 15 రోజుల్లోగా ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుందని డీఈవో తెలిపారు. మిగిలిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.