2021లో ఉద్యోగ జాతర | Teacher Job Vacancies And Recruitment In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

2021లో ఉద్యోగ జాతర

Published Tue, Dec 29 2020 11:29 AM | Last Updated on Tue, Dec 29 2020 12:47 PM

Teacher Job Vacancies And Recruitment In Andhra Pradesh - Sakshi

సాక్షి, అనంతపురం విద్య: 2021లో నూతన సంవత్సరం పురస్కరించుకొని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ జాతర చేయనుంది. ముచ్చటగా స్పెషల్‌ డీఎస్సీ, లిమిటెడ్‌ డీఎస్సీ, రెగ్యులర్‌ డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఫిబ్రవరిలోపు లిమిటెడ్‌ డీఎస్సీ, స్పెషల్‌ డీఎస్సీ వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వనుంది. టెట్‌ (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ ) అనంతరం రెగ్యులర్‌ డీఎస్సీ జారీ చేయనుంది. స్పెషల్‌ డీఎస్సీ, లిమిటెడ్‌ డీఎస్సీల నోటిఫికేషన్లకు సంబంధించి ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింది. 

టెట్‌ సిలబస్‌ రూపకల్పన పూర్తి.. 
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థికి టెట్‌ (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌) అర్హత తప్పనిసరి. ఒక సారి టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్ష రాయడానికి అర్హత వస్తుంది. గతంలో 20 శాతం టెట్‌కు, 80 శాతం వెయిటెజీ డీఎస్సీకి ఇచ్చారు. తప్పనిసరిగా ఎన్‌సీటీఈ మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయాలను అనుసరిస్తోంది. ఈక్రమంలో ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం టెట్‌ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎస్సీఈఆర్టీ టెట్‌ సిలబస్‌ రూపకల్పన పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సిలబస్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. టెట్‌లో ఈ దఫా ఇంగ్లిష్‌కు అధికంగా వెయిటేజీ కల్పించనున్నారు. దీంతో నూతన సిలబస్‌ను రూపకల్పన చేశారు. 

ఫిబ్రవరిలోపు లిమిటెడ్‌ డీఎస్సీ.. 
గత డీఎస్సీలో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులభర్తీకి లిమిటెడ్‌ డీఎస్సీ పేరుతో ఫిబ్రవరిలోపు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నా రు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. కొన్ని కేటగిరీల్లో భర్తీకి నోచుకోని దివ్యాంగ, ఓసీ మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో పోస్టులను జిల్లాలో భర్తీ చేస్తున్నారు. లిమిటెడ్‌ డీఎస్సీకి సంబంధించి మోడల్‌ స్కూల్‌లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. మోడల్‌ స్కూల్‌లో జోన్‌ వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో నాలుగో జోన్‌లో టీజీటీలో 4, పీజీటీలో 68 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన రోస్టర్‌ పాయింట్లు రెండు రోజుల్లో నిర్ధారించనున్నారు. మోడల్‌ స్కూళ్లలో మొత్తం 72 పోస్టులు భర్తీ చేయనున్నారు.

స్పెషల్‌ డీఎస్సీ.. 
దివ్యాంగ విద్యార్థులు, ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు బోధించడానికి స్పెషల్‌ బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు స్పెషల్‌ డీఎస్సీ రాయడానికి అర్హులు. ఈ నేపథ్యంలో గతేడాది స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించారు. ఇందులో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులు స్పెషల్‌ డీఎస్సీలో భర్తీ చేస్తారు. గతేడాది నిర్వహించిన స్పెషల్‌ డీఎస్సీలో 10 పోస్టులు భర్తీ కాలేదు. ఈ 10 పోస్టులకు స్పెషల్‌ డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. స్పెషల్‌ బీఈడీ/స్పెషల్‌ డీఈడీ చేసిన వారు మాత్రమే స్పెషల్‌ డీఎస్సీ రాయడానికి అర్హులు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement