టీచర్ అభ్యర్థులకు ‘టెట్’ తిప్పలు! | Teacher candidates to 'TET' problems! | Sakshi
Sakshi News home page

టీచర్ అభ్యర్థులకు ‘టెట్’ తిప్పలు!

Published Wed, May 11 2016 7:18 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

టీచర్ అభ్యర్థులకు ‘టెట్’ తిప్పలు!

టీచర్ అభ్యర్థులకు ‘టెట్’ తిప్పలు!

* సంబంధం లేని సబ్జెక్టులతో తంటాలు..
* అధిక సిలబస్‌తో ఆందోళన
* ఇంటర్, డిగ్రీల్లోనూ చదవని సబ్జెక్టుల ప్రశ్నలు

సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రామకృష్ణ 2009లో బీఎస్సీ పూర్తి చేశాడు. ఉపాధ్యాయుడిగా జీవితంలో స్థిరపడాలని భావించి ఎడ్‌సెట్ రాశాడు. కష్టపడి చదివి ర్యాంకు సాధించి.. ప్రభుత్వ కాలేజీలో బీఎడ్ పూర్తి చేశాడు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుండగానే... 2010 ఆగస్టులో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) ‘టెట్’ పేరిట పిడుగువేసింది.

ఇది మరో పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి కల్పించింది. 2011లో విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పరీక్షకు విస్తృతమైన సిలబస్‌ను ప్రకటించింది. దీంతో ఆందోళనలో పడడం రామకృష్ణ వంతయింది. తాను ఇంటర్, డిగ్రీలో చదువుకున్న సబ్జెక్టులకు సంబంధం లేని గణితం అదనంగా వచ్చి చేరింది. దానికితోడు అర్హతా మార్కుల శాతమూ ఎక్కువే. దీంతో 2011 నుంచి నిర్వహించిన మూడు టెట్‌లలోనూ రామకృష్ణ అర్హత సాధించలేదు. ఇక తాను టీచర్ ఉద్యోగం సాధించలేనేమోనని ఆయన ఆవేదనలో కూరుకుపోయాడు. రాష్ట్రంలో టెట్ కోసం సిద్ధమవుతున్న లక్షల మంది అభ్యర్థులందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. దేవరకొండకు చెందిన ప్రమీల కూడా ఇదే ఆందోళన, మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది.
 
లక్షల మంది అనర్హులే..

మొత్తంగా ఇప్పటివరకు నాలుగుసార్లు నిర్వహించిన టెట్‌లలో 55 శాతానికి మించి అభ్యర్థులు అర్హత సాధించకపోవడం గమనార్హం. 2011లో తొలిసారి నిర్వహించిన టెట్ పేపర్-2కు 3,61,206 మంది హాజరైతే... 1,71,437 మందే అర్హత సాధించారు. 2012లో నిర్వహించిన రెండో టెట్ 4,15,137 మంది రాస్తే.. 2,04,126 మంది, అదే ఏడాది నిర్వహించిన మూడో టెట్‌ను 4.14 లక్షల మందిరాస్తే.. 2,01,087 మంది, 2014 మార్చిలో నిర్వహించిన నాలుగో టెట్ పేపర్-2కు 3,40,561 మంది హాజరైతే... 1,10,099 మంది (32 శాతమే) అర్హత సాధించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
పండిట్, డీఎడ్ అభ్యర్థులకూ తప్పని తంటా!
సంబంధంలేని సిలబస్‌తో పరీక్ష రాయడమన్నది బీఎడ్ పూర్తిచేసినవారికే కాదు... పండిత శిక్షణ, డీఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకూ తప్పలేదు. వాస్తవానికి ఇంటర్‌తో డీఎడ్ చేసిన అభ్యర్థి 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు మాత్రమే అర్హులు. వారు టెట్ పేపర్-1లో భాగంగా 30 మార్కులు గణితం ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వస్తోంది. ఇక తెలుగు, ఉర్దూ, హిందీ పండితులైతే ఆయా భాషా సబ్జెక్టులను మాత్రమే బోధిస్తారు. కానీ వారికి ఇంగ్లిషు, సాంఘిక శాస్త్రం తంటాలు తప్పడం లేదు. వారు టెట్ పేపర్-2లో అర్హత సాధిస్తేనే పండిట్ పోస్టుల కోసం డీఎస్సీ రాసేందుకు అర్హులు. ఇక సాంఘికశాస్త్రం బీఎడ్ వారికి తెలుగు, ఇంగ్లిషు ‘పరీక్ష’ పెడుతున్నారు.
 
9, 10 తరగతులకు అవసరమే లేదు
ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ పేపర్-1 పరీక్షను ఒకటి నుంచి ఐదు తరగతుల వారికే నిర్వహించాలి. పేపర్-2 పరీక్ష 6, 7, 8 తరగతులకు బోధించాలనుకునే వారికి నిర్వహించాలి. కానీ రాష్ట్రంలో 9, 10 తరగతులు బోధించే వారికి కూడా టెట్ నిర్వహిస్తున్నారు. అయితే తాము ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారమే తాము ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని టెట్ డెరైక్టర్ జగన్నాథరెడ్డి తెలిపారు. మరోవైపు ఉపాధ్యాయ అభ్యర్థి ప్రమీల ఆత్మహత్యపై విద్యాశాఖ ప్రభుత్వానికి మంగళవారం నివేదిక పంపింది. ఆమె టెట్ కోసం చేసిన దరఖాస్తు వివరాలను నివేదికలో పేర్కొంది.
 
కనీస అవగాహన తప్పనిసరి
‘‘టీచర్‌గా బడిలోకి వెళ్లే వారికి అన్ని అంశాలపై కనీస అవగాహన తప్పనిసరిగా ఉండాలి. టెట్ సిలబస్ అంత కష్టతరంగా లేదు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి మౌలిక అంశాలే ఉన్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో ప్రమాణాలు ఉండటం లేదు. ఇలాంటి మౌలిక అంశాలపై కూడా అవగాహన లేకపోతే కష్టమవుతుంది..’’
- విద్యావేత్త చుక్కా రామయ్య
 
 
స్కూల్ అసిస్టెంట్లకు టెట్ రద్దు చేయాలి
‘‘టెట్‌లో సంబంధంలేని సబ్జెక్టుల సిలబస్‌ను తొలగించాలి. స్కూల్ అసిస్టెంట్ అంటేనే సబ్జెక్టు టీచర్. తాను బోధించే సబ్జెక్టులోనే టెట్‌ను నిర్వహించాలి. 9, 10 తరగతులకు బోధించే వారికి టెట్‌ను రద్దు చేయాలి. భాషా పండితులకు వారు బోధించే భాషల్లోనే టెట్ నిర్వహించాలి. ఇంగ్లిషు, సోషల్ సిలబస్ తొలగించాలి..’’
     - మధుసూదన్, శ్రీనివాసరెడ్డి, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
 
ఆవేదన చెందవద్దు
‘‘విద్యార్థులంతా జీవితం ఎంతో విలువైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తాము విజయం సాధించలేదనే ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒత్తిడిని నియంత్రించుకోవాలి. పాజిటివ్ థింకింగ్ ముఖ్యం..’’
- జవహర్‌లాల్‌నెహ్రూ, సైకాలజిస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement