ఖాళీగా ఉన్న వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.
హైదరాబాద్ : ఖాళీగా ఉన్న వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అయితే పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని, పెట్టుబడులు వస్తే పరిశ్రమలు ఏర్పాటవుతాయని, ఫలితంగా లక్షలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు శుక్రవారం శాసనసభలో ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు.
20 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే టీచర్లు, డాక్టర్లు లాంటి 25 వేల పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిధులు ఉండే పీడీ ఖాతాల్లో సొమ్ము కూడా వాడుకున్నమాట వాస్తవమేనని అంగీకరించారు.