శరవేగంగా.. పారదర్శకంగా | Andhra Pradesh government Speedup In filling jobs | Sakshi
Sakshi News home page

శరవేగంగా.. పారదర్శకంగా

Published Tue, Feb 7 2023 3:07 AM | Last Updated on Tue, Feb 7 2023 7:33 AM

Andhra Pradesh government Speedup In filling jobs - Sakshi

సాక్షి, అమరావతి: అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు చాలు! ఉద్యోగాల భర్తీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిబద్ధత గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి లక్షల ఉద్యోగాల భర్తీతోనే రుజువైంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఒకేదఫాలో 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యో­గాలను సక్రమంగా భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగాల భర్తీ ఎంత ప్రధానమో పారద­ర్శకంగా చేపట్టి అర్హులకు న్యాయం చేయడం అంతకంటే ముఖ్యమన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.

ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో 48 వేలకుపైగా ఉద్యోగాలను శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను రెండు వారాల్లోనే వెల్లడించడం ప్రాధా­న్యం సంతరించుకుంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటేనే అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన అని పలు సందర్భాల్లో రుజువు కాగా కోర్టు కేసులు, ఏళ్ల తరబడి సుదీర్ఘ భర్తీ ప్రక్రియతో నిరుద్యోగుల్లో నైరాశ్యం ఆవహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందుకు భిన్నంగా సక్రమం.. సత్వరం.. పూర్తి పారదర్శక విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తోంది. 

రెండు వారాల్లోనే ప్రిలిమినరీ ఫలితాలు
పోలీసు ఉద్యోగార్థుల కలలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఏటా కనీసం 6 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది 6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై పోస్టులతో మొత్తం 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీని రాష్ట్ర పోలీసు నియామక మండలి చేపట్టింది. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షను 997 కేంద్రాల్లో నిర్వహించింది. 6,100 పోస్టులకు 5.03 లక్షల మంది దరఖాస్తు చేయగా ప్రిలిమినరీకి 4,59,182 మంది హాజర­య్యారు.

అంత భారీగా అభ్యర్థులు ఉన్నప్పటికీ రాత పరీక్ష ఫలితాలను కేవలం రెండు వారాల్లోనే ప్రకటించడం విశేషం. ప్రాథమిక ‘కీ’ కూడా ప్రకటించి అభ్యం­­తరాలను తెలిపేందుకు అవకాశం కల్పించారు. వాటిని పరీశీలించి మూడు ప్రశ్నలకు సమా­ధా­నాలను సరి చేసి తుది ‘కీ’ విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు. మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించేందుకు కటాఫ్‌ మార్కును కూడా పోలీసు నియామక మండలి హేతుబద్ధంగా నిర్ణయించింది. మొత్తం 200 మార్కుల పరీక్షలో జనరల్‌ అభ్యర్థులకు 40 శాతం అంటే 80 మార్కులను కటాఫ్‌గా ఖరారు చేసింది.

బీసీ అభ్యర్థులకు 35 శాతం అంటే 70 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికుల కేటగిరీ అభ్యర్థులకు 30 శాతం అంటే 60 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు. ఇక అభ్యర్థుల్లో ఎలాంటి అపోహలు తలెత్త­కుండా ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్‌ షీట్లను కూడా అందుబాటులోకి తేవడం గమనార్హం. అభ్యర్థులు తమ ఓఎంఆర్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని ‘కీ’తో సరిచూసుకునేందుకు మూడు రోజులపాటు అవకా­శం కల్పించారు.

పోలీస్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇంత పారదర్శకంగా, నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం సకాలంలో నిర్వహిస్తుండటం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెయిన్‌ పరీక్షకు, అనంతరం దేహదారుఢ్య పరీక్షలకు ఉత్సాహంగా సన్నద్ధమవు­తు­న్నామని చెబుతున్నారు. 411 ఎస్సై పోస్టుల భర్తీకి  ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వైద్య, ఆరోగ్యశాఖలో 48 వేల పోస్టుల భర్తీ
సీఎం జగన్‌ అత్యధిక ప్రాధాన్యమిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీని నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ మూడు­న్న­రేళ్లలో వైద్య శాఖలోని వివిధ విభాగాల్లో ఇప్పటి­వరకు ఏకంగా 48 వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. పత్రికల్లో నోటిఫికేషన్‌ జారీ చేసి షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నారు. ఏ ఒక్క పోస్టు భర్తీపైనా ఎలాంటి ఆరోపణలుగానీ ఫిర్యాదులుగానీ రాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.

నాడు అంతా అక్రమాలు.. కోర్టు కేసులే
టీడీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటేనే పెద్ద ప్రహసనం. రాత పరీక్ష ఎప్పుడు నిర్వహి­స్తారో... ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో అంతుబ­ట్టక అభ్యర్థులు అల్లాడేవారు. నిబంధనలు, అర్హ­తలు, రిజర్వేషన్ల అమలుకు రోస్టర్‌ పాయింట్ల ఖరారు... ఇలా అన్ని స్థాయిల్లోనూ అక్రమాలే చోటు చేసుకోవడంతో అభ్యర్థులు తరచూ న్యాయ పోరా­టాలకు దిగాల్సిన పరిస్థితులు ఉత్పన్నమ­య్యాయి. రాత పరీక్ష ‘కీ’పై అభ్యంతరాలను కనీసం పట్టించుకునేవారే కాదు.

ఓఎంఆర్‌ షీట్లను పరిశీలించేందుకు సులభంగా అనుమతించేవారు కూడా కాదు. రాత పరీక్ష నిర్వహణ, ఫలితాలపై అభ్యర్థుల  సందేహాలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానమే ఉండేది కాదు. అందుకు భిన్నంగా వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం పూర్తి పారదర్శకతతో ఉద్యోగాలను భర్తీ చేస్తుండటం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విధానానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్దిష్ట ప్రక్రియను సృష్టించిందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఒకేసారి1.35 లక్షల సచివాలయాల పోస్టుల భర్తీ
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి, పారదర్శకతకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిదర్శ­నం. పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకొస్తూ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయడం ద్వారా యువత పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నిబద్ధతను చాటుకు­న్నారు. అదీ అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే భర్తీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఒకేసారి ఇంత భారీస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగా­లను భర్తీ చేయడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. 1.35 లక్షల ఉద్యోగాలకు ఏకంగా 21 లక్షల మంది దరఖాస్తు చేయగా 2019 సెప్టెంబరు 1–9త తేదీల మధ్య నిర్వహించిన ఎంపిక పరీక్షకు 19.5 లక్షల మంది హాజరయ్యారు. అయినప్పటికీ పరీక్ష ఫలితాలను 11 రోజుల్లోనే వెల్లడించి ఆపై రెండు వారాల్లోనే ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరేలా చర్యలు తీసుకున్నారు.

రెండేళ్ల ప్రొబేషన్‌ పూర్తి అయిన తరువాత నిబంధనల మేరకు ఉద్యోగాలను క్రమబద్ధీకరించారు. అంత భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఎక్కడా ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేకుండా నిర్వహించడం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న మరో 14 వేల పోస్టులను కూడా అదే రీతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement