ఖమ్మం స్పోర్ట్స్: చాన్నాళ్ల తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈక్రమంలో రెండు శాతం స్పోర్ట్స్ కోటా అమలుచేయడమే కాక, ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎప్పుడు సాధించిన సర్టిఫికెట్లనైనా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండడంతో జిల్లా క్రీడాకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా విద్యా, ఉద్యోగ రంగాల్లో స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని క్రీడా రంగ ప్రతినిధులు పోరాటాలు చేశారు. ఈనేపథ్యాన ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీఓను ఈసారి నోటిఫికేషన్లలో అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగాల పోటీ పరీక్షల్లో సత్తా చాటేందుకు నిరుద్యోగులు క్రీడాకారులు సిద్ధమవుతున్నారు.
చదవండి👉 తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. ప్రిన్సిపల్ సంతకం లేకున్నా..
తొలిసారిగా 2012లో...
క్రీడాకారులు, క్రీడాసంఘాల పోరాట ఫలితంగా తొలిసారిగా 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 84 జీఓ విడుదల చేశారు. ఈ జీఓ ఆధారంగా అన్ని ఉద్యోగ ఖాళీల భర్తీలో రెండు శాతం స్పోర్ట్స్ కోటా అమలుకు అవకాశం దక్కింది. ఇదే జీఓను ఇప్పుడు అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, అండర్ – 14, 17, 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఆడి సర్టిఫికెట్లు పొందిన క్రీడాకారుల ఈ కోటా ద్వారా అవకాశం దక్కనుండడంతో ఉద్యోగం సాధించాలనే తపనతో చదువులో నిమగ్నమయ్యారు.
నిబంధనలు లేకుండా...
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతుండగా, స్పోర్ట్స్ కోటా అమలుచేయనున్న ప్రభుత్వం ఈసారి మాత్రం మూడేళ్ల నిబంధన లేకుండా అన్ని సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఏదైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్ మూడేళ్ల వరకు అమల్లో ఉంటుందని గతంలో ప్రకటించారు. కానీ ఈసారి పలు ఉద్యోగాలకు వయస్సు నిబంధనలు సడలించినందున స్పోర్ట్స్ కోటా అమలులోనూ ఎప్పటి సర్టిఫికెట్లనైనా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో చాన్నాళ్ల క్రితం సర్టిఫికెట్లు సాధించి, ఇప్పటికీ ఉద్యోగాలు రాని అభ్యర్థులు మేలు చేకూరుతుందని చెబుతున్నారు. అయితే, అత్యధిక సర్టిఫికెట్లు కలిగిన వారికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది.
చదవండి👉🏻 దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా..
ఖేలో ఇండియా ఎలా?
నాలుగేళ్ల నుంచి దేశంలో ఖేలో ఇండియా పేరిట ఏటా జాతీయస్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్లు సాధించిన వారికి కూడా స్పోర్ట్స్ కోటా అమలవుతుందా, లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావడం లేదు. దీనికి తోడు ఐదారేళ్లలో కొత్తగా పుట్టుకొచ్చిన క్రీడల పరిస్థితి ఏమిటన్నది కూడా తెలియరావడం లేదు. కొన్ని క్రీడాంశాల్లో జిల్లా నుంచే నేరుగా అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశముండడంతో ఆయా క్రీడాకారులకు అవకాశం ఇచ్చేది, లేనిది ఇంకా వెల్లడించలేదు. ఈ అంశంపై ప్రత్యేక కమిటీ నియమించాలని క్రీడావర్గాలు కోరుతున్నాయి.
ఇది మంచి పరిణామం
ఎన్నో ఏళ్లనుంచి స్పోర్ట్స్ కోటాను అన్ని ఉద్యోగాల్లో అమలు చేయాలని పోరాడుతున్నాం. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా అమలుకు నిర్ణయించడం మంచి పరిణామం. ఇక నుంచి అన్ని నోటిఫికేషన్లలో అమలుచేస్తే బాగుంటుంది.
– పుట్టా శంకరయ్య, ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి
క్రీడాకారులకు ప్రోత్సాహం
క్రీడాకారులను ప్రోత్సహించేలా స్పోర్ట్స్ కోటాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేయడం బాగుంది. ఇప్పటి వరకు కొన్ని శాఖల్లో మాత్రమే నేరుగా స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాకాశాలు లభిస్తున్నాయి. ఈసారి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది.
– కె.ఆదర్శ్‌కుమార్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి
యువకులకే అవకాశం ఇవ్వాలి
రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ద్వారా యువ క్రీడాకారులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రాష్ట్రంలోని యువత క్రీడలపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మరింత మంది ఉత్తమ క్రీడాకారులు వెలుగులోకి వస్తారు.
– జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షలు, మందుల వెంకటేశ్వర్లు
ఉద్యోగం సాధిస్తాననే నమ్మకముంది
ఉద్యోగాల భర్తీలో రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని నిర్ణయించడంపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఇప్పటి వరకు జాతీయస్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్లు పనికి రాకుండా పోతాయమోనని ఆవేదన చెందాను. కానీ ప్రభుత్వం నిర్ణయంతో ఈసారి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం వచ్చింది.
– ఎం.జైనాద్ బేగ్
Comments
Please login to add a commentAdd a comment