
సీఎంపై మాజీ స్పీకర్ ధ్వజం
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారణంగా తెలుగువారికి తీరని అన్యాయం జరుగుతోందంటూ మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం తనకు కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు కన్సల్టెన్సీ అనే ఒక పదాన్ని వాడుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే పరిశ్రమల విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుకు రాజేంద్ర అనే వ్యక్తి బయోడేటా ఇచ్చిన వెంటనే సీఎం ఆదేశాల మేరకు ఆగమేఘాలపై నియామక ఉత్తర్వులు ఇచ్చారన్నారు.
కష్టపడి చదువుకున్న సమర్థులైన తెలుగు విద్యార్థులను కాదని, ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల విద్యార్థులను యంగ్ ప్రొఫెషనల్స్ పేరిట ఇప్పటి వరకు 35 మందిని నియమిస్తే, ఆ నియామకాలకు సంబంధించి ఒకే రకమైన ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లు ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. 2014 ఎన్నికల్లో సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ, బాబు వస్తే జాబు వస్తుందని టీడీపీ యువతకు హామీ ఇచ్చినా... అధికారంలోకి వచ్చాక అమలులో అయిన వారికే ప్రభుత్వ కొలువులు, ఉపాధి కాంట్రాక్టులను కట్టబెడుతూ రాష్ట్రంలోని యువతను నయవంచనకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా గత ఐదేళ్లతో పోలిస్తే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.