సాక్షి, ముంబై: సర్కారు కొలువుకు ఇంటర్వ్యూ.. ఫలానా తేదీన సదరు కార్యాలయానికి తగిన సర్టిఫికెట్లతో హాజరవ్వగలరు..అంటూ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీ నుంచి వచ్చిన కాల్ లెటర్ చూసి అతడు కంగారు పడ్డాడు.. ఇంట్లో వాళ్లు దిగ్భ్రాంతి చెందారు.. చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు.. ఇంతలా అందరూ ఆశ్చర్యపోయేలా చేసిన ఆ కాల్ లెటర్ వెనుక కథ తెలిస్తే మీరూ అవాక్కవుతారు.. ఇక చదవండి.. ఘన్సోలికి చెందిన సురేష్ మాత్రే ప్రభుత్వ ఉద్యోగం కోసం 19 ఏళ్ల వయసులో స్థానిక ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీ(ఈఈ)లో తన పేరు నమోదు చేసుకున్నాడు. సర్కారు ఉద్యోగం కోసం కొన్నేళ్లు కళ్లు కాయలు కాసేలా చూశాడు.
ఈఈ నుంచి ఏదైనా కాల్ లెటర్ వస్తుందేమోనని తపాలా కార్యాలయం చుట్టూ తిరుగుతుండేవాడు.. అయితే ఏళ్లు గడుస్తున్నా సర్కారు కొలువు అతీగతీ లేదు.. దాంతో క్రమంగా దాని గురించి ఆలోచించడం మానేసి ఓ ప్రైవేటు సంస్థలో పనిలో చేరాడు. 40 ఏళ్లు గడిచాయి.. ప్రస్తుతం అతడి వయసు 59 ఏళ్లు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 10 ఏళ్ల కిందటే ఉద్యోగం మానుకుని ఇంట్లో కూర్చున్నాడు. అయితే, మనోడి గురించి సర్కారు మాత్రం మరిచిపోలేదు.. కాందివలి తపాలా కార్యాలయంలో ఖాళీగా ఉన్న పర్యవేక్షకుడి ఉద్యోగానికి ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకి హాజరుకావాలని స్పీడ్ పోస్ట్ ద్వారా అతడికి సర్కారు నుంచి లేఖ వచ్చింది. ఏ లేఖ కోసం కొన్నేళ్లు తపాలా కార్యాలయం చుట్టూ తిరిగాడో.. అదే శాఖలో ఖాళీ ఉందని 40 ఏళ్ల తర్వాత తనకు సర్కారు లేఖ రావడంపై అతడు అవాక్కయ్యాడు. ఏం చేయాలా అని తల గోక్కుంటున్నాడు. సర్కారా.. మజాకా.. అదీ సంగతి!
యే సర్కార్ కా జాదూ హై..
Published Thu, Dec 12 2013 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement