employment exchange
-
డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లు.. పేరు నమోదు చేసుకుంటే చాలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ అవకాశాలు ఇకపై మీ వద్దకే రాబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రాభవం కోల్పోయిన ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లకు రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు నింపుతోంది. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లను మోడల్ కెరీర్ సెంటర్లుగా మారుస్తోంది. అన్ని కేంద్రాలను అనుసంధానం చేస్తూ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వీటికి గ్రామ, వార్డు సచివాలయాలను అనుసంధానం చేస్తోంది. తద్వారా సచివాలయాల్లోనే పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఈ విషయాన్ని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ బి.లావణ్య వేణి ‘సాక్షి’కి తెలిపారు. నిరుద్యోగులు వారి గ్రామాల నుంచే.. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు, జాబ్ మేళాలు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యే విధంగా డిజిటల్ ఎక్స్చేంజ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్న వివరాలు ఆయా జిల్లాలకే పరిమితమయ్యేవని పేర్కొన్నారు. ఇప్పుడు అన్ని జిల్లాల డేటాను.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెరీర్ సర్వీస్ పోర్టల్‌తో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. రెండు దశల్లో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని లావణ్య వేణి తెలిపారు. మెసేజ్‌లతో ఎప్పటికప్పుడు సమాచారం.. తొలి దశ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ను ఆగస్టు15 కల్లా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లావణ్య వేణి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 23 ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కేంద్రాల్లో ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న అరుంధతి సాఫ్ట్వేర్ స్థానంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి చేసిన నూతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి.. అన్ని కేంద్రాలను అనుసంధానిస్తామని చెప్పారు. వచ్చే 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర సమాచారాన్ని కేంద్రానికి చెందిన కెరీర్ సర్వీస్ పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియ కూడా జరుగుతోందన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పేరు నమోదు చేసుకున్న వారికి.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగ అవకాశాలు సమాచారం మెసేజ్‌ల రూపంలో ఎప్పటికప్పుడు వస్తుందన్నారు. జాబ్ మేళాలు, జాబ్ ఫెయిర్స్, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రాథమిక సమాచారాలు కూడా తెలియజేస్తామని చెప్పారు. సర్టిఫికేట్స్ అప్‌గ్రేడ్ తదితరాలను సచివాలయాల నుంచే చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెండో దశలో పరిశ్రమలు, కంపెనీలతో.. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు లావణ్య తెలిపారు. రాష్ట్రంలోని పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖలతో పాటు విద్యా సంస్థలు, ఇతర శిక్షణ సంస్థలతో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ను అనుసంధానం చేయనున్నామని వివరించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తెలిపే ‘ఓవర్సీస్ మ్యాన్‌పవర్’ పోర్టల్‌తో కూడా దీనిని అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కంపెనీలు ఏటా రిక్రూట్మెంట్ కేలండర్‌తో పాటు ఏటా చేపట్టిన నియామకాల వివరాలను ఆన్లైన్ ద్వారా తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏ రంగంలో అధికంగా ఉన్నాయన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. రెండో దశ పనులు నెల రోజుల్లో పూర్తి చేయనున్నట్లు లావణ్య తెలిపారు. -
‘వివరాలు ఇవ్వలేదు.. 87 కోట్లు చెల్లించండి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ కార్యాలయం విఫలమైనందును నష్టపరిహారంగా రూ.87 కోట్లు చెల్లించాలని ఓ నిరుద్యోగి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 26 ప్రకారం.. వస్తు, సేవల్లో లోపం కారణంగా తనకు జరిగిన నష్టాన్ని బాధితుడు ప్రతిదారు నుంచి పొందొచ్చు. కానీ, ఈ కేసులో ఫిర్యాదుదారు నిరాధార ఆరోపణలు చేశాడని కమిషన్ అభిప్రాయపడింది. వివరాలు.. ఆర్టీఐ కింద తాను కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ విఫలమైందని పంచకులకు చెందిన విజయ్‌కుమార్ ఆరోపించారు. సరైన సమాచారం లభించనందున తాను తీవ్రంగా నష్టపోయినట్టు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ని ఆశ్రయించాడు. నష్టపరిహారంగా 87 కోట్ల రూపాయలు చెల్లించేలా ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్‌ను ఆదేశించాలని దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్.. ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరాడు అనేందుకు విజయ్ వద్ద ఎలాంటి ఫ్రూఫ్ లేదని పేర్కొంది. తప్పుదు ఆధారాలతో కమిషన్‌ను విజయ్ తప్పుదోవ పట్టించాడని మండిపడింది. ఎంతోమందికి సేవలందించాల్సిన కమిషన్ కాలాన్ని వృధా చేశాడని ఆక్షేపించింది. జరిమానాగా విజయ్ రూ.100 చెల్లించాలని కమిషన్ తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా జరిమానా మొత్తం చెల్లించి రశీదు అందించాలని తెలిపింది. ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. -
నిరుద్యోగులకు.. ఉద్యోగాల వేదిక
నిడమర్రు : కాలం మారింది.. అంతా కంప్యూటర్ యుగం నడుస్తుంది. నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నా అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు ఆన్లైన్ దరఖాస్తు విధానంతో తప్పాయి. గత కొంతకాలంగా నిరుద్యోగుల నుంచి ఏపీ ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ కూడా ఆన్ లైన్ విధానంలో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఆ వివరాలు తెలుసుకుందాం. గతంలో అర్హతలుంటేనే కాల్ లెటర్స్ గతంలో ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్‌లో పేర్లు నమోదు చేసుకునేవాళ్లు. అప్పుడు వాళ్ల అర్హతలకు తగిన అవకాశాలు ఉంటేనే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేది. ఇప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అనుగుణంగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్‌ను అధికారులు రూపొందించారు. ఇప్పటికే రకరకాల పోర్టళ్లలో రెజ్యూమ్ అప్లోడ్ చేసి నెలలు గడిచినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందినవారు అనేకమంది ఉంటారు. అలాంటి వారికోసం ఈ వెబ్సైట్ మంచి అవకాశాలు కల్పిస్తుంది. ఏపీలోని ఉద్యోగ సమాచార వేదికగా.. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్‌పోర్టల్‌లో ఒక్కసారి రిజిస్టర్ చేసుకుని, తమ రెజ్యూమ్‌ను అప్లోడ్ చేస్తే సరి పోతుంది. అభ్యర్థి అర్హతలను బట్టి ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఆయా జిల్లాలు, నియోజకవర్గం, మండలాల వారీగా ఉండే ఉద్యోగాల సమాచారం కూడా తెలుస్తుంది. ♦ ప్రైవేటు ఉద్యోగాల సమాచారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం, నోటిఫికేషన్ల సమాచారం అంతా ఈ వెట్సైట్లో అందుబాటులో ఉంటుంది. ♦ ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్ చెల్లించాల్సిన అవసరంలేదు. అన్ని సేవలు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ♦ ఉద్యోగాలు అవసరమైన కంపెనీ/సంస్థలు/రిక్రూటర్లు కూడా ఈ సైట్లో తమకు అవసరమైన ఖాళీలు గురించి వెబ్సైట్లో పొందుపరిచే అవకాశం కల్పించారు. దీంతో ఆయా అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు వాటికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. అభ్యర్థులు ముందుగా ఏపీ ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ అధికారిక వెబ్సైట్ నందు లాగిన్ అవ్వాల్సి ఉంది. www.apemploymentexchange.com లాగిన్ అయ్యాక కనిపించే వెబ్సైట్ ముఖచిత్రంలో ‘న్యూ జాబ్ రిజిస్ట్రేషన్ హియర్’ వద్ద క్లిక్ చేయాలి. జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు కనిపిస్తుంది. అక్కడ పేరు, ఈ– మెయిల్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. తర్వాత కాలం వద్ద పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని నమోదు చేయాలి. పక్క కాలంలో రీ టైప్ పాస్వర్డ్ వద్ద తిరిగి క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. జిల్లా, చిరునామా, పిన్‌కోడ్ నమోదు చేయాలి. తర్వాత మీ సర్టిఫికెట్స్ ఆప్‌లోడ్ చెయ్యాల్సిన కాలం కనిపిస్తుంది. అక్కడ స్కేన్ చేసిన సర్టిఫికెట్స్ (5 కేబీ లోపు) అక్కడ సూచించిన ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి. తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా నమోదు చేసిన ఈ–మెయిల్ ఐడీ, మీరు క్రియేట్ చేసుకున్న పాస్‌వర్డ్‌తో వెబ్సైట్లోకి లాగిన్ కావచ్చు. -
నిరుద్యోగులకు బంపర్ చాన్స్
ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టమో డిగ్రీలు పూర్తిచేసి రెండుమూడేళ్లు తిరిగినవాళ్లకు తెలుస్తుంది. రకరకాల పోర్టళ్లలో రెజ్యూమ్ అప్లోడ్ చేసి నెలలు గడిచినా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాక నిరాశ చెందేవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి మంచి అవకాశం కల్పిస్తోంది. గతంలో అంటే, సుమారు రెండు మూడు దశాబ్దాల క్రితం అయితే ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో పేర్లు నమోదుచేసుకునేవాళ్లు. అప్పుడు వాళ్ల అర్హతలకు తగిన అవకాశాలుంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేది. ఇప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కూడా తన రూపం మార్చుకుంది. తాజాగా ఏపీ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి డాట్ కామ్ అనే వెబ్సైట్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. ఇందులో ఒకసారి రిజిస్టర్ చేసుకుని, తమ రెజ్యూమ్‌ను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అభ్యర్థి అర్హతలను బట్టి ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. అలాగే ఆయా జిల్లాలు, మండలాల వారీగా ఉండే ఉద్యోగాల సమాచారం కూడా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం, నోటిఫికేషన్లు, ప్రభుత్వోద్యోగాల సమాచారం అంతా ఈ సైట్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో రిజిస్టర్ చేసుకోడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని సేవలు పూర్తి ఉచితం. అలాగే రిక్రూటర్లు కూడా.. ఈ సైట్లో తమ సంస్థలో ఉన్న ఖాళీల గురించి పోస్ట్ చేస్తే, దానికి తగిన అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు వాటికి దరఖాస్తు చేస్తారు. పూర్తి వివరాలకు www.apemploymentexchange.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. -
'కౌన్సెలింగ్ కేంద్రాలుగా ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్‌లు'
కోల్‌కతా: ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్‌లను త్వరలో కెరీర్ కౌన్పిలింగ్ సెంటర్లుగా మార్చనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్ విధానంలో సమూలమైన మార్పుల ద్వారా జాతీయ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లుగా మార్చనున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించడం, ఉద్యోగవకాశాలు కల్పించే సంస్థలకు నిరుద్యోగుల సమాచారాన్నిచేరవేయడం ద్వారా ఉద్యోగవకాశాలు కల్పించడంలో ఈ కౌన్సెలింగ్ సెంటర్లు కీలక పాత్ర పోషించేలా చూస్తామన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 978 ఎంప్లాయ్మెంట్ సెంటర్లు ఉన్నాయని వీటిని త్వరలోనే కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లుగా మార్చే ప్ర్రక్రియ ప్రారంభమౌతుందన్నారు. తొలుత 100 మోడల్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పటు చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెరీర్ సర్వీస్ అనే మరో కార్యక్రమాన్నిన్ని కూడా ప్రారంభిస్తుందనీ, ఈ రెండు పథకాలకు కలిపి 800 కోట్ల రూపాయలు కెటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నూతన కా పథకాల ద్వారా ఈ ఆర్థీక సంవత్పరం చివరి నాటికి కోటి ఉద్యోగాలను కల్పించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. 'మేక్ ఇన్ ఇండియా', 'స్కిల్ ఇండియా' కేంద్రం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశాలుగా దత్తాత్రేయ తెలిపారు. -
ఎంప్లాయ్మెంట్ ఎక్స్‘చేంజ్’
ఉపాధి కల్పన కార్యాలయాల (ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్)కు త్వరలో మహర్దశ పట్టనుంది. ఉనికిని కోల్పోయే పరిస్థితిలో ఉన్న ఆ కార్యాలయాల్లో సమూల మార్పులు చేసేందుకు కేంద్రం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి తరానికి తగ్గట్టుగా మార్చేందుకు ప్రణాళికలు రచించింది. రూ.100 కోట్లతో ఉపాధి కల్పన కార్యాలయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పిన నేపథ్యంలో అవి జాతీయ ఉపాధి సేవా కేంద్రాలుగా రూపాంతరం చెందనున్నాయి. వాటివైపు కన్నెత్తి కూడా చూడని నిరుద్యోగులను ఆ కార్యాలయాల వైపు పరుగులు పెట్టేలా అభివృద్ధి చేయనున్నారు. - సాక్షి, హైదరాబాద్ తెలంగాణలో ఉపాధి కల్పన కార్యాలయాలకు కొత్త హంగులు * మొదటి విడతలో దేశవ్యాప్తంగా 100 కేంద్రాలపై దృష్టి * నిరుద్యోగులకు సరైన శిక్షణ, కౌన్సెలింగ్ * కోరుకున్న ఉద్యోగం ఇచ్చేందుకు ప్రాధాన్యం * ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సలహాలు, సూచనలు * రాష్ట్రం నుంచి 5 కార్యాలయాలను ఎంచుకునే అవకాశం * రూ.100 కోట్లతో 100 కార్యాలయాలు దేశవ్యాప్తంగా ఉన్న 900కు పైగా ఉన్న ఉపాధి కల్పన కార్యాలయాలకు గానూ మొదటి విడతలో రూ.100 కోట్లతో 100 కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. తెలంగాణ నుంచి 5 కార్యాలయాలను జాతీయ ఉపాధి సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. హైదరాబాద్ నుంచి యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ గెడైన్స్ బ్యూరో, హైదరాబాద్ (మెకానికల్ అండ్ టెక్నికల్) ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ లేబర్ హైదరాబాద్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఫర్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి రంగారెడ్డి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈ జాబితాలో ఉంది. సైకాలజిస్టులతో కౌన్సెలింగ్.. ఉపాధి కల్పన కార్యాలయాలకు వచ్చే నిరుద్యోగుల అభిరుచులకు తగ్గట్టుగా, అనువైన ఉద్యోగాల వివరాలు అందిస్తారు. గ్రామం, పట్టణాల నుంచి వచ్చే వారి స్కిల్స్‌కు తగ్గట్టుగా సరైన శిక్షణ అందిస్తారు. గ్రూప్ డిస్కషన్స్ వంటివి ఏర్పాటు చేస్తారు. అవసరమైతే వారికి సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. అంతేకాకుండా మున్ముందు ఏం చేయాలో, ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో సలహాలు, సూచనలు ఇస్తారు. నిరుద్యోగుల వెసులుబాటుకు వెబ్సైట్... అన్ని రాష్ట్రాల్లోని ఉపాధి కార్యాలయాల వివరాలను, ఎక్కడెక్కడ ఏయే ఉద్యోగాలు ఉన్నాయనే సమాచారంతో ఓ వెబ్సైట్ రూపొందించారు. త్వరలోనే ఈ వెబ్సైట్ ((www.ncs.gov.in)) ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పరిశ్రమలు, నిరుద్యోగులు ఇందులో వారి పేరును నమోదు చేసుకోవాలి. ఏదైనా కంపెనీలో ఖాళీలు ఉంటే అభ్యర్థుల విద్యార్హతలు, వేతనాల స్కేలు వంటి వివరాలతో ఆ వెబ్సైట్లో పేర్కొనాలి. ఆ తర్వాత నిరుద్యోగులకు వారి అర్హతలను బట్టి ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా కంపెనీల వివరాలు పంపిస్తారు. సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
కాల్ లెటర్ మరీ లేటు
ఏజెన్సీని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య ఉపాధి చూపని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఏళ్ల తరబడి గిరిజన అభ్యర్థుల ఎదురుతెన్నులు కూలి పనులను ఆశ్రయిస్తున్న ఉన్నత విద్యావంతులు పాడేరు : విశాఖ ఏజెన్సీ 11 మండలాల పరిధిలో నిరుద్యోగ సమస్య అధికమైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చదువుకున్న గిరిజన అభ్యర్థులు పాడేరులోని ఉప ఉపాధి కల్పన కార్యాలయంలో నమోదు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఏ చిన్నపాటి ఉద్యోగానికీ పిలుపు రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా గ్రామాలకే పరిమితమవుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వీరు కూలి పనులకు వెళుతున్న దుస్థితి చదివించిన తల్లితండ్రులను బాధిస్తోంది. ప్రభుత్వం ప్రతి ఏటా ఉపాధ్యాయ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తుండగా ఎంప్లాయిమెంట్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో బి.ఎడ్, డి.ఎడ్, తెలుగు, హిందీ పండిట్ అభ్యర్థులు ఏళ్ల తరబడి నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఇటీవల భర్తీ చేసిన పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు కూడా సీనియార్టీని పరిగణనలోకి తీసుకోలేదు. పారామెడికల్, జనరల్ నర్సింగ్ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. డ్రైవరు పోస్టులకు అర్హత ఉన్నవారు వందల సంఖ్యలో ఉన్నా అవకాశాలు లేవు. ఏజెన్సీలో కనీసం బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. పాడేరు డివిజన్లోని 11 మండలాలకు సంబంధించి 42 వేల 393 మంది అభ్యర్థులు స్థానిక ఉప ఉపాధి కల్పనా కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. వీరిలో పురుష అభ్యర్థులు 27,837 మంది, మహిళా అభ్యర్థులు 14,556 మంది ఉన్నారు. టెక్నికల్ విభాగంలో 7వేల 322 మంది నమోదు చేసుకున్నారు. మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకుంటున్నా కాల్ లెటర్ రానివారు వేల సంఖ్యలో ఉన్నారు. నిరుద్యోగ సమస్య ఏజెన్సీని పట్టి పీడిస్తున్నా పాలకులు, అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు. ఒకప్పుడు పదోతరగతి చదివితే ప్రభుత్వ ఉద్యోగం పొందే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పట్టభద్రులకు కూడా అటెండరు ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. సాంకేతిక విద్యను అభ్యసించినవారు కూడా ఉపాధి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాల్ లెటర్లు వెళ్లేది బాగా తక్కువ కిందటేడాది హెచ్పీసీఎల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ఒక డిగ్రీ అభ్యర్థికి, కోరుకొండ సైనిక స్కూలులో టీచరు ఉద్యోగం నిమిత్తం ఒక బి.ఎడ్ అభ్యర్థికి కాల్ లెటర్లు పంపారు. అప్పటి నుంచి మళ్లీ ఉన్నత విద్యావంతులకు కాల్‌లెటర్లు పంపలేదు. గతనెలలో విశాఖ స్టీల్‌ప్లాంట్, నావల్ డాక్ యార్డులో కూలిపనుల నిమిత్తం 140 మందికి కాల్ లెటర్లు పంపారు. -
మరో అమ్మ పథకం
నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా అమ్మ పేరుతో రాష్ట్రంలో మరో పథకం వెలిసింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ‘అమ్మ ఉపాధి కల్పన-శిక్షణ’ పథకం కింద అవకాశాలు క ల్పించనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ, ఈ ఏడాది మార్చి 31 నాటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో 9.68లక్షల చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. పారిశ్రామిక విధానంలో దేశానికే మార్గదర్శకంగా నిలవాలనే ఆకాంక్షతో ఆయా పరిశ్రమలకు అవసరమైన వృత్తినిపుణులను సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అమ్మ... పథకం ద్వారా 18-25 ఏళ్ల నిరుద్యోగులను ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఎంపిక చేసి పరిశ్రమల్లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. శిక్షణా కాలంలో ఆయా పరిశ్రమలు నెలకు రూ.5 వేలు భత్యం చెల్లించేలా చూస్తామని తెలిపారు. ఈ పథకం కింద 25 వేల మందికి శిక్షణ నిస్తుండగా వీరిలో 30 శాతం మహిళలుంటారని చెప్పారు. ఈ పధకం అమలుకు రూ.32.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారు పరిశ్రమల్లో శాశ్వత ఉద్యోగాలు పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆరోగ్య సంరక్షణా చర్యల్లో భాగంగా రూ.130 కోట్లతో కాంచీపురం జిల్లా చెంగల్పట్టులో హెల్త్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 330 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ హెల్త్సిటీని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రామనాథపురం జిల్లా కడలాడిలోని 500 ఎకరాల ప్రభుత్వ భూమిలో సముద్రపునీటిని మంచినీటిగా శుద్ధిచేసే యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ యూనిట్ కోసం 50 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్‌ను అక్కడే నెలకొల్పుతామని పేర్కొన్నారు. తిరువళ్లూరు జిల్లాలో రెండురోజులుగా జరుగుతున్న ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు గ్రామాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 54,439 అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయండి: ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకు అవకాశం లేకుండా డీఎంకే సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ ఇతర ప్రతిపక్షాలు గురువారం స్పీకర్ ధనపాల్కు వినతి పత్రం సమర్పించాయి. డీఎండీకే, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం, వామపక్షాల సభ్యులు స్పీకర్‌ను ఆయన చాంబర్లో కలుసుకుని విన్నవించారు. -
యే సర్కార్ కా జాదూ హై..
సాక్షి, ముంబై: సర్కారు కొలువుకు ఇంటర్వ్యూ.. ఫలానా తేదీన సదరు కార్యాలయానికి తగిన సర్టిఫికెట్లతో హాజరవ్వగలరు..అంటూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీ నుంచి వచ్చిన కాల్ లెటర్ చూసి అతడు కంగారు పడ్డాడు.. ఇంట్లో వాళ్లు దిగ్భ్రాంతి చెందారు.. చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు.. ఇంతలా అందరూ ఆశ్చర్యపోయేలా చేసిన ఆ కాల్ లెటర్ వెనుక కథ తెలిస్తే మీరూ అవాక్కవుతారు.. ఇక చదవండి.. ఘన్సోలికి చెందిన సురేష్ మాత్రే ప్రభుత్వ ఉద్యోగం కోసం 19 ఏళ్ల వయసులో స్థానిక ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీ(ఈఈ)లో తన పేరు నమోదు చేసుకున్నాడు. సర్కారు ఉద్యోగం కోసం కొన్నేళ్లు కళ్లు కాయలు కాసేలా చూశాడు. ఈఈ నుంచి ఏదైనా కాల్ లెటర్ వస్తుందేమోనని తపాలా కార్యాలయం చుట్టూ తిరుగుతుండేవాడు.. అయితే ఏళ్లు గడుస్తున్నా సర్కారు కొలువు అతీగతీ లేదు.. దాంతో క్రమంగా దాని గురించి ఆలోచించడం మానేసి ఓ ప్రైవేటు సంస్థలో పనిలో చేరాడు. 40 ఏళ్లు గడిచాయి.. ప్రస్తుతం అతడి వయసు 59 ఏళ్లు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 10 ఏళ్ల కిందటే ఉద్యోగం మానుకుని ఇంట్లో కూర్చున్నాడు. అయితే, మనోడి గురించి సర్కారు మాత్రం మరిచిపోలేదు.. కాందివలి తపాలా కార్యాలయంలో ఖాళీగా ఉన్న పర్యవేక్షకుడి ఉద్యోగానికి ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకి హాజరుకావాలని స్పీడ్ పోస్ట్ ద్వారా అతడికి సర్కారు నుంచి లేఖ వచ్చింది. ఏ లేఖ కోసం కొన్నేళ్లు తపాలా కార్యాలయం చుట్టూ తిరిగాడో.. అదే శాఖలో ఖాళీ ఉందని 40 ఏళ్ల తర్వాత తనకు సర్కారు లేఖ రావడంపై అతడు అవాక్కయ్యాడు. ఏం చేయాలా అని తల గోక్కుంటున్నాడు. సర్కారా.. మజాకా.. అదీ సంగతి!