నిరుద్యోగులకు బంపర్ చాన్స్
ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టమో డిగ్రీలు పూర్తిచేసి రెండుమూడేళ్లు తిరిగినవాళ్లకు తెలుస్తుంది. రకరకాల పోర్టళ్లలో రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి నెలలు గడిచినా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాక నిరాశ చెందేవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి మంచి అవకాశం కల్పిస్తోంది. గతంలో అంటే, సుమారు రెండు మూడు దశాబ్దాల క్రితం అయితే ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో పేర్లు నమోదుచేసుకునేవాళ్లు. అప్పుడు వాళ్ల అర్హతలకు తగిన అవకాశాలుంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేది. ఇప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కూడా తన రూపం మార్చుకుంది. తాజాగా ఏపీ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి డాట్ కామ్ అనే వెబ్‌సైట్ ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. ఇందులో ఒకసారి రిజిస్టర్ చేసుకుని, తమ రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. అభ్యర్థి అర్హతలను బట్టి ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. అలాగే ఆయా జిల్లాలు, మండలాల వారీగా ఉండే ఉద్యోగాల సమాచారం కూడా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం, నోటిఫికేషన్లు, ప్రభుత్వోద్యోగాల సమాచారం అంతా ఈ సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో రిజిస్టర్ చేసుకోడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని సేవలు పూర్తి ఉచితం. అలాగే రిక్రూటర్లు కూడా.. ఈ సైట్‌లో తమ సంస్థలో ఉన్న ఖాళీల గురించి పోస్ట్ చేస్తే, దానికి తగిన అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు వాటికి దరఖాస్తు చేస్తారు. పూర్తి వివరాలకు www.apemploymentexchange.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.