Andhra Pradesh Govt To Create Digital Employment Job Opportunities - Sakshi
Sakshi News home page

ఏపీ: డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌లు.. పేరు నమోదు చేసుకుంటే చాలు

Published Sun, Aug 1 2021 2:39 AM | Last Updated on Sun, Aug 1 2021 2:48 PM

Job opportunities Andhra Pradesh Government Digital Employment - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగ అవకాశాలు ఇకపై మీ వద్దకే రాబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రాభవం కోల్పోయిన ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు నింపుతోంది. ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌లను మోడల్‌ కెరీర్‌ సెంటర్లుగా మారుస్తోంది. అన్ని కేంద్రాలను అనుసంధానం చేస్తూ డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వీటికి గ్రామ, వార్డు సచివాలయాలను అనుసంధానం చేస్తోంది. తద్వారా సచివాలయాల్లోనే పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.

ఈ విషయాన్ని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్‌ బి.లావణ్య వేణి ‘సాక్షి’కి తెలిపారు. నిరుద్యోగులు వారి గ్రామాల నుంచే.. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు, జాబ్‌ మేళాలు, కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యే విధంగా డిజిటల్‌ ఎక్స్చేంజ్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌లో నమోదు చేసుకున్న వివరాలు ఆయా జిల్లాలకే పరిమితమయ్యేవని పేర్కొన్నారు. ఇప్పుడు అన్ని జిల్లాల డేటాను.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెరీర్‌ సర్వీస్‌ పోర్టల్‌తో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. రెండు దశల్లో డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని లావణ్య వేణి తెలిపారు.

మెసేజ్‌లతో ఎప్పటికప్పుడు సమాచారం..
తొలి దశ డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ను ఆగస్టు15 కల్లా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లావణ్య వేణి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 23 ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ కేంద్రాల్లో ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న అరుంధతి సాఫ్ట్‌వేర్‌ స్థానంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ అభివృద్ధి చేసిన నూతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి.. అన్ని కేంద్రాలను అనుసంధానిస్తామని చెప్పారు. వచ్చే 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.

రాష్ట్ర సమాచారాన్ని కేంద్రానికి చెందిన కెరీర్‌ సర్వీస్‌ పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియ కూడా జరుగుతోందన్నారు. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పేరు నమోదు చేసుకున్న వారికి.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగ అవకాశాలు సమాచారం మెసేజ్‌ల రూపంలో ఎప్పటికప్పుడు వస్తుందన్నారు. జాబ్‌ మేళాలు, జాబ్‌ ఫెయిర్స్, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రాథమిక సమాచారాలు కూడా తెలియజేస్తామని చెప్పారు. సర్టిఫికేట్స్‌ అప్‌గ్రేడ్‌ తదితరాలను సచివాలయాల నుంచే చేసుకోవచ్చని పేర్కొన్నారు.

రెండో దశలో పరిశ్రమలు, కంపెనీలతో..
రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఇవ్వాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు లావణ్య తెలిపారు. రాష్ట్రంలోని పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖలతో పాటు విద్యా సంస్థలు, ఇతర శిక్షణ సంస్థలతో డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ను అనుసంధానం చేయనున్నామని వివరించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తెలిపే ‘ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌’ పోర్టల్‌తో కూడా దీనిని అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కంపెనీలు ఏటా రిక్రూట్‌మెంట్‌ కేలండర్‌తో పాటు ఏటా చేపట్టిన నియామకాల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏ రంగంలో అధికంగా ఉన్నాయన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. రెండో దశ పనులు నెల రోజుల్లో పూర్తి చేయనున్నట్లు లావణ్య తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement