ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌‘చేంజ్’ | Employment X 'Change' new schems | Sakshi
Sakshi News home page

ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌‘చేంజ్’

Published Fri, Jul 17 2015 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌‘చేంజ్’

ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌‘చేంజ్’

ఉపాధి కల్పన కార్యాలయాల (ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్)కు త్వరలో మహర్దశ పట్టనుంది. ఉనికిని కోల్పోయే పరిస్థితిలో ఉన్న ఆ కార్యాలయాల్లో సమూల మార్పులు చేసేందుకు కేంద్రం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి తరానికి తగ్గట్టుగా మార్చేందుకు ప్రణాళికలు రచించింది. రూ.100 కోట్లతో ఉపాధి కల్పన కార్యాలయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పిన నేపథ్యంలో అవి జాతీయ ఉపాధి సేవా కేంద్రాలుగా రూపాంతరం చెందనున్నాయి.

వాటివైపు కన్నెత్తి కూడా చూడని నిరుద్యోగులను ఆ కార్యాలయాల వైపు పరుగులు పెట్టేలా అభివృద్ధి చేయనున్నారు.   
- సాక్షి, హైదరాబాద్
 
తెలంగాణలో ఉపాధి కల్పన కార్యాలయాలకు కొత్త హంగులు
* మొదటి విడతలో దేశవ్యాప్తంగా 100 కేంద్రాలపై దృష్టి
* నిరుద్యోగులకు సరైన శిక్షణ, కౌన్సెలింగ్
* కోరుకున్న ఉద్యోగం ఇచ్చేందుకు ప్రాధాన్యం
* ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సలహాలు, సూచనలు
* రాష్ట్రం నుంచి 5 కార్యాలయాలను ఎంచుకునే అవకాశం
* రూ.100 కోట్లతో 100 కార్యాలయాలు

దేశవ్యాప్తంగా ఉన్న 900కు పైగా ఉన్న ఉపాధి కల్పన కార్యాలయాలకు గానూ మొదటి విడతలో రూ.100 కోట్లతో 100 కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. తెలంగాణ నుంచి 5 కార్యాలయాలను జాతీయ ఉపాధి సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. హైదరాబాద్ నుంచి యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ గెడైన్స్ బ్యూరో, హైదరాబాద్ (మెకానికల్ అండ్ టెక్నికల్) ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ లేబర్ హైదరాబాద్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఫర్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి రంగారెడ్డి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఈ జాబితాలో ఉంది.
 
సైకాలజిస్టులతో కౌన్సెలింగ్..
ఉపాధి కల్పన కార్యాలయాలకు వచ్చే నిరుద్యోగుల అభిరుచులకు తగ్గట్టుగా, అనువైన ఉద్యోగాల వివరాలు అందిస్తారు. గ్రామం, పట్టణాల నుంచి వచ్చే వారి స్కిల్స్‌కు తగ్గట్టుగా సరైన శిక్షణ అందిస్తారు. గ్రూప్ డిస్కషన్స్ వంటివి ఏర్పాటు చేస్తారు. అవసరమైతే వారికి సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. అంతేకాకుండా మున్ముందు ఏం చేయాలో, ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో సలహాలు, సూచనలు ఇస్తారు.
 
నిరుద్యోగుల వెసులుబాటుకు వెబ్‌సైట్...
అన్ని రాష్ట్రాల్లోని ఉపాధి కార్యాలయాల వివరాలను, ఎక్కడెక్కడ ఏయే ఉద్యోగాలు ఉన్నాయనే సమాచారంతో ఓ వెబ్‌సైట్ రూపొందించారు. త్వరలోనే ఈ వెబ్‌సైట్ ((www.ncs.gov.in)) ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పరిశ్రమలు, నిరుద్యోగులు ఇందులో వారి పేరును నమోదు చేసుకోవాలి.

ఏదైనా కంపెనీలో ఖాళీలు ఉంటే అభ్యర్థుల విద్యార్హతలు, వేతనాల స్కేలు వంటి వివరాలతో ఆ వెబ్‌సైట్‌లో పేర్కొనాలి. ఆ తర్వాత నిరుద్యోగులకు వారి అర్హతలను బట్టి ఎస్‌ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా కంపెనీల వివరాలు పంపిస్తారు. సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement