మరో అమ్మ పథకం
నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా అమ్మ పేరుతో రాష్ట్రంలో మరో పథకం వెలిసింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌లలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ‘అమ్మ ఉపాధి కల్పన-శిక్షణ’ పథకం కింద అవకాశాలు క ల్పించనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ, ఈ ఏడాది మార్చి 31 నాటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో 9.68లక్షల చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. పారిశ్రామిక విధానంలో దేశానికే మార్గదర్శకంగా నిలవాలనే ఆకాంక్షతో ఆయా పరిశ్రమలకు అవసరమైన వృత్తినిపుణులను సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అమ్మ... పథకం ద్వారా 18-25 ఏళ్ల నిరుద్యోగులను ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఎంపిక చేసి పరిశ్రమల్లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. శిక్షణా కాలంలో ఆయా పరిశ్రమలు నెలకు రూ.5 వేలు భత్యం చెల్లించేలా చూస్తామని తెలిపారు. ఈ పథకం కింద 25 వేల మందికి శిక్షణ నిస్తుండగా వీరిలో 30 శాతం మహిళలుంటారని చెప్పారు.
ఈ పధకం అమలుకు రూ.32.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారు పరిశ్రమల్లో శాశ్వత ఉద్యోగాలు పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆరోగ్య సంరక్షణా చర్యల్లో భాగంగా రూ.130 కోట్లతో కాంచీపురం జిల్లా చెంగల్పట్టులో హెల్త్‌సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 330 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ హెల్త్‌సిటీని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రామనాథపురం జిల్లా కడలాడిలోని 500 ఎకరాల ప్రభుత్వ భూమిలో సముద్రపునీటిని మంచినీటిగా శుద్ధిచేసే యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ యూనిట్ కోసం 50 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్‌ను అక్కడే నెలకొల్పుతామని పేర్కొన్నారు. తిరువళ్లూరు జిల్లాలో రెండురోజులుగా జరుగుతున్న ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు గ్రామాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 54,439 అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
సస్పెన్షన్ ఎత్తివేయండి: ప్రతిపక్షాలు
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకు అవకాశం లేకుండా డీఎంకే సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ ఇతర ప్రతిపక్షాలు గురువారం స్పీకర్ ధనపాల్‌కు వినతి పత్రం సమర్పించాయి. డీఎండీకే, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం, వామపక్షాల సభ్యులు స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలుసుకుని విన్నవించారు.