మార్కెట్లోకి ‘అమ్మ’ ఉప్పు
సాక్షి, చెన్నై:రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో అమ్మ ఉప్పు బుధవారం మార్కెట్లోకి విడుదలైంది. మూడు రకాల ప్యాకెట్లలో వీటిని విక్రయించనున్నారు. కిలో ధర రూ.10, 14, 21గా నిర్ణయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడో సారి పగ్గాలు చేపట్టిన జయలలిత సుపరిపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజా హితాన్ని కాంక్షిస్తూ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు. ఓ వైపు ఉచిత పథకాలు, మరో వైపు అభివృద్ధి పనులు రాష్ట్రంలో వేగవంతం అయ్యాయి. పేదలను దృష్టిలో ఉంచుకుని అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్స్, కూరగాయల దుకాణాల ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ పరిస్థితుల్లో అమాంతంగా పెరుగుతూ వస్తున్న ఉప్పు ధరలకు క ళ్లెం వేస్తూ, ప్రైవేటు ధరల నియంత్రణ లక్ష్యంగా ఉప్పు విక్రయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోటో: 32: ఫోటో: 33: సీబీసీఐడీ కార్యాలయం ప్రారంభోత్సవం దృష్టి కేంద్రీకరించింది. రామనాధపురంలోని ప్రభుత్వ ఉప్పు ఉత్పత్తి కేంద్రం ద్వారా సీఎం జయలలిత ముఖ చిత్రంతో అమ్మ పేరిట ప్యాకెట్ల రూపంలో వీటిని మార్కెట్లోకి విడుదల చేశారు.
మార్కెట్లోకి విడుదల : సచివాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో మూడు రకాల ప్యాకెట్లను సీఎం జయలలిత మార్కెట్లోకి విడుదల చేశారు. తొలి ప్యాకెట్‌ను జయలలిత చేతుల మీదుగా మంత్రి తంగమణి అందుకున్నారు. తొలి విడతగా ఈ ప్యాకెట్లు అముదం, సహకార దుకాణాల్లో విక్రయించనున్నారు. డీలర్ల నియామకంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దుకాణాల్లోను వీటిని విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కిలో ఐరన్ - అయోడియం ఉప్పు ధర రూ.14గా, శుద్ధీకరించిన తక్కువ మోతాదు అయోడియం ఉప్పు ప్యాకెట్ ధర రూ.21గా, సోడియం ఉప్పు ధర రూ.10గా నిర్ణయించారు. ప్రజల ఆరోగ్య క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉప్పు ప్యాకెట్లను రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వృత్తి శిక్షణ: మార్కెట్లోకి ఉప్పు విడుదల అనంతరం సిప్ కాట్‌లలో శిక్షణ కేంద్రాలను సీఎం జయలలిత ప్రారంభించారు. తిరునల్వేలి, తిరువళ్లూరు, కాంచీపురం సిప్ కాట్‌లలో వృత్తి శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాంచీపురంలోని ఒరగడం సిప్ కాట్‌లో 2.52 ఎకరాల స్థలంలో రూ. కోటి 80 లక్షలతో శిక్షణా కేంద్రం పనులను ముగించారు.
ఈ కేంద్రాన్ని ప్రారంభించిన జయలలిత, సిప్ కాట్‌లకు స్థలాలను కేటాయించిన కుటుంబాల్లో ఉన్న యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 1200 మంది శిక్షణ పొందడంతోపాటుగా, వారికి కావాల్సిన అన్ని రకాల వసతులను ఈ కేంద్రంలో కల్పించి ఉన్నారు. సీబీసీఐడీ భవనం ప్రారంభం : ఎగ్మూర్‌లో సీబీసీఐడీ విభాగం కోసం రూ.పది కోట్ల వ్యయంతో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. స్వయంగా ఎగ్మూర్‌కు వెళ్లి ఈ భవనాన్ని సీఎం జయలలిత ప్రారంభించారు.
కన్యాకుమారి, సేలం, తిరునల్వేలి, దిండుగల్, తంజావూరు, కాంచీపురం, విల్లుపురం, విరుదునగర్, కడలూరు, తిరుచ్చిల్లో రూ.65,58,73,000తో పోలీసు కుటుంబాల కోసం నిర్మించిన 873 గృహాలను ప్రారంభించారు. సేలం, కోవిల్ పట్టి, తిరునల్వేలి, తెన్ కాశి, కన్యాకుమారి, తూత్తుకుడి, తేని, దిండుగల్, కోవిల్ పట్టి, మదురై, పెరుంగుడి తదితర ప్రాంతాల్లో రూ. 16 కోట్ల ఆరు లక్షల 37 వేలతో 34 పోలీసు స్టేషన్లకు నిర్మించిన పక్కా భవనాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పోలీసు విభాగానికి సంబంధించిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా ప్రారంభోత్సవాలతో పాటుగా శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్, డీజీపీ రామానుజం తదితరులు పాల్గొన్నారు.