రిజర్వేషన్‌పై సోనియాకు జాట్‌ల అభినందన
Published Mon, Dec 23 2013 12:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: జాట్ కులస్తులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చేందుకు సోనియా చేస్తున్న కృషిని ఆ కులస్తులు కొనియాడారు. ఈ మేరకు వేలాదిమంది జాట్‌లు ఆదివారం సోనియాను ఆమె నివాసంలో కలిసి అభినందించేందుకు తరలివచ్చారు. జాట్ కులాన్ని వెనుకబడిన కులాల జాబితాలో చేర్చేందుకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వం వెనుకబడిన కులాల కమిషన్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. దీని వెనుక సోనియా కృషి అభినందనీయమని పలువురు జాట్‌లు వ్యాఖ్యానించారు. హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా, అతడి కుమారుడు దీపేందర్ సింగ్ హుడా, మాజీ స్పీకర్ బలరాం జాకర్ నేతృత్వంలో వేలాదిమంది జాట్‌లు సోనియా నివాసానికి తరలివచ్చారు.
లోక్‌సభ ఎన్నికల ముంచుకొస్తున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం జాట్ కులస్తులను బీసీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. ఈ సందర్భంగా దీపేందర్ సింగ్ మాట్లాడుతూ జాట్ కులాన్ని వెనుకబడిన కులా ల జాబితాలో చేర్చేందుకు 1999లో జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ తిరస్కరించిందన్నారు. కాగా కేంద్రస్థాయిలో జాట్‌లకు ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర కేబినెట్ గురువారం ఎన్‌సీబీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కలుగనుంది. కాగా, జాట్‌లకు కేంద్ర ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని గుజరాత్,హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement