Jat leaders
-
రాజస్తాన్‌లో కొత్త పరిణామం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు గుబులు
రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన కీలక పరిణామం అధికార కాంగ్రెస్‌ను, అంతకంటే ఎక్కువగా విపక్ష బీజేపీని కలవరపెడుతోంది. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న జాట్లు, దళితుల పేరిట రెండు పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. కనీసం 40 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల ఈ రెండు సామాజికవర్గాలను అవి ఆకట్టుకుంటే ప్రధాన పార్టీలకు తీవ్ర నష్టం తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది... రాజస్తాన్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతున్నట్టు ప్రముఖ జాట్ నేత, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) నేత హనుమాన్ బెనీవాల్ ప్రకటించారు. అంతేగాక 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను కూడా శనివారమే ప్రటించారాయన. మిగతా అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ ఆదరణ ఉన్న దళిత నేత, భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) పేరుతో రాష్ట్రంలో తొలిసారి బరిలో దిగుతున్నారు. ఈ రెండు పార్టీలూ ఎన్నికల పొత్తు కుదుర్చుకుని రాజస్తాన్ బ్యాలెట్ పోరును మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. రాజస్తాన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు బలమైన ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం చాలా ఉందని ఈ సందర్భంగా బెనీవాల్, ఆజాద్ సంయుక్త విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇందుకోసం ‘కిసాన్, జవాన్, దళిత్’వర్గాలు కలిసి రావాలంటూ వారిచ్చిన పిలుపు వెనక లోతైన అర్థమే దాగుంది. ఈ నయా జాట్–దళిత బంధం కాంగ్రెస్, బీజేపీ అవకాశాలను బాగానే దెబ్బ తీసేలా కనిపిస్తోంది. చదవండి: లిక్కర్ స్కాంలో ఆప్ నేత మనీష్ సిసోడియాకు దక్కని ఊరట బీజేపీకే ఎక్కువ నష్టం...! ఆరెల్పీకి జాట్లలో ఎంతో పట్టుండటమే గాక దళితుల్లోనూ ఆదరణ ఉంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు దళితులే కావడం ఇందుకు నిదర్శనం. ఇక ప్రధానంగా దళిత పార్టీ అయిన ఏఎస్పీ రాజస్తాన్‌లో తొలిసారిగా బరిలో దిగుతోంది. అది కూడా దళితుల ఓట్లను గణనీయంగానే ఆకర్షించేలా కనిపిస్తోంది. వీటి జంట పోటీతో జాట్, దళిత ఓట్లు సంఘటితమైతే అది ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు చేటు చేయవచ్చంటున్నారు. ముఖ్యంగా బీజేపీకి ఎక్కువ నష్టం జరిగేలా కనిపిస్తోంది. ఎందుకంటే గత నాలుగేళ్లలో రాజస్తాన్‌లో పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమే ఎదురైంది. ఇందుకు ఆ పార్టీ ఓట్లను ఆరెల్పీ చీల్చడం కూడా గట్టి కారణమే. 2022ల సర్దార్ షహర్ స్థానంలో కాంగ్రెస్ తన ఓట్ల సంఖ్యను పెంచుకోగా, జాట్ల ఓట్లు మాత్రం బీజేపీ, ఆరెల్పీ మధ్య చీలాయి. దాంతో కాంగ్రెస్ 26 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గింది. అక్కడ ఆరెల్పీకి 46,628 ఓట్లు రావడం విశేషం. అంతకుముందు 2021లో వల్లభ్‌నగర్ ఉప ఎన్నికలోనైతే ఆరెల్పీ ఏకంగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థినే రంగంలోకి దింపింది. దాంతో ఆ పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది! సూజన్గఢ్ ఉప ఎన్నికలోనూ ఆరెల్పీ 32,210 ఓట్లు కొల్లగొట్టి సత్తా చాటింది. దాంతో ఇక్కడా కాంగ్రెసే నెగ్గింది! అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల్లో గెలుపోటములకు మధ్య ఆరెల్పీయే ప్రధాన కారణంగా నిలిచే ఆస్కారం కనిపిస్తోంది. అసంతృప్తితో జాట్లు... రాజస్తాన్‌లో జాట్ సామాజికవర్గంలో కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. తమ కులానికి సంబంధించిన నేతే సీఎంగా ఉండాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్స్, బీజేపీ చీఫ్‌లిద్దరూ జాట్లే ఉండేవారు. ఇటీవలే బీజేపీ సతీశ్ పునియా స్థానంలో సీపీ జోషిని రాష్ట్ర పార్టీ అధ్యక్షున్ని చేసింది. ప్రస్తుత అసెంబ్లీలో 39 మంది జాట్ ఎమ్మెల్యేలున్నారు. అందుకే రెండు ప్రధాన పార్టీలూ తమకు కనీసం 40 చొప్పున టికెట్లివ్వాలని జాట్ మహాసభ డిమాండ్ చేస్తోంది. ఎస్సీలు ప్రబల శక్తి రాజస్తాన్‌లో 34 ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 చోట్ల కాంగ్రెస్, 12 స్థానాల్లో బీజేపీ నెగ్గాయి. తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల వేళ ఆరెల్పీ కేంద్రంలో ఎన్డీఏ కూటమితో జట్టు కట్టింది. బెణీవాల్ ఎంపీగా నెగ్గారు కూడా. కానీ రైతు చట్టాలపై విభేదించి బీజేపీకి దూరమయ్యారు. దీనికి తోడు ఆజాద్ పార్టీ కూడా రాష్ట్రంలో బీఎస్పీకి ఉన్న దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్‌లో బీఎస్పీ 6 స్థానాల్లో నెగ్గింది. తర్వాత వారంతా కాంగ్రెస్‌లో విలీనమయ్యారు. కానీ ఆ తర్వాత దళితుల పట్ల కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆజాద్ ఆరోపిస్తున్నారు. బెనీవాల్.. రైతు నేత రాజస్తాన్‌లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్న హనుమాన్ బెనీవాల్ ప్రస్థానం ఆసక్తికరం. 1972లో నగౌర్‌లో ఓ జాట్ రైతు కుటుంబంలో పుట్టారు. రైతు నాయకునిగా ప్రసిద్ధుడైన బెనీవాల్ రాజకీయ జీవితం బీజేపీ కార్యకర్తగానే మొదలైంది! 2008లో ఆ పార్టీ తరఫున నగౌర్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ నాటి సీఎం వసుంధరరాజె సింధియా సహా రాష్ట్ర బీజేపీ నేతల అవినీతిని, కాంగ్రెస్ నేతలతో వారి సాన్నిహిత్యాన్ని బాహాటంగానే ప్రశ్నించి పార్టీకి దూరమయ్యారు. 2013లో స్వతంత్ర ఎమ్మెల్యేగా నెగ్గారు. రాజస్తాన్‌లో సరిగ్గా 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరెల్పీని స్థాపించారు. అప్పట్లో పరిమిత స్థానాల్లోనే పోటీ చేసినా ఈ ఐదేళ్లలో చెప్పుకోదగ్గ శక్తిగా ఎదిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు. నగౌర్ స్థానం నుంచి లోక్‌సభలో అడుగు పెట్టారు. కానీ ఎన్డీఏ సర్కారు తెచ్చిన రైతు చట్టాలను, అగ్నివీర్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆ కూటమికి దూరమయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశిస్తున్నారు. ఆజాద్... భీం ఆర్మీ నేత 1986లో ఉత్తరప్రదేశ్‌లోని చుట్మల్పూర్లో జన్మించిన చంద్రశేఖర్ ఆజాద్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాజిక కార్యకర్తగా వెలుగులోకి వచ్చారు. భీం ఆర్మీ సహ వ్యవస్థాపకుడు. ఈ సంస్థ దళితుల అభ్యున్నతికి కృషి చేస్తుంటుంది. వారి కోసం పశి్చమ యూపీలో స్కూళ్లు తదితరాలు నడుపుతోంది. సహరన్పూర్ అల్లర్లలో జాతీయ భద్రతా చట్టం కింద ఆజాద్ జైలుకు వెళ్లారు. అనంతరం ఆజాద్ సమాజ్ పార్టీ స్థాపించారు. 2021లో టైం మేగజీన్ 100 మంది వర్ధమాన నేతల జాబితాలో చోటుచేసుకున్నారు. -
యూపీలో ఆట మొదలుపెట్టిన బీజేపీ
మొదటి దశలో ఎన్నికలు జరుగనున్న పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ తనశైలి ఆటను మొదలుపెట్టింది. పార్టీ కింగ్‌పిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన మార్కును చాటేలా పశ్చిమ యూపీలో బలంగా ఉన్న జాట్లను తమవైపు తిప్పుకునే వ్యూహాలకు పదునుపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జాట్లలో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చి, వారిని మచ్చిక చేసుకునేలా బుధవారం 200 మంది జాట్ ప్రతినిధులతో జరిపి భేటీ పార్టీకి కలిసొస్తుందనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ–రాష్ట్రీయ్ లోక్ దళ్ కూటమిని విచ్ఛిన్నం చేసి జాట్ ఓట్లను చీల్చేలా ఇప్పటికే క్షేత్ర స్థాయి కార్యాచరణను షురూ చేసింది. కూటమి ఓట్లు చీల్చే ఎత్తుగడ.. పశ్చిమ యూపీలో ఫిబ్రవరి 10న 58 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా షామ్లీ, ముజఫర్‌నగర్, భాగ్‌పత్, మీరట్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధనగర్, బులంద్ షహర్ వంటి జిల్లాలోని కనీసంగా 30 నియోజకవర్గాల్లో జాట్లే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. 3.5 శాతంగా ఉన్న జాట్లకు స్థానిక రైతుల్లో మంచి సాన్నిహిత్యం ఉంది. నిజానికి ముస్లిం–జాట్‌లో పరస్పరం సోదరభావంతో మెలిగినప్పటికీ 2013 ముజఫర్‌గనర్ అల్లర్ల తర్వాత వారి చెలిమి చెడి ఎవరికి వారయ్యారు. ఈ కారణంగా 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్ఎల్డీ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. 2017 అసెంబ్లీలోనూ కేవలం ఒక్క సీటుకే పరిమితమయింది. ముజఫర్‌నగర్ అల్లర్లను ప్రచారంలో పెట్టి గడిచిన రెండు లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేలా వ్యూహాలు సిధ్ధం చేసినప్పటికీ వాటిని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చిత్తు చేశారు. ఇటీవలి రైతు ఉద్యమాలను అడ్డుగా పెట్టి ముస్లిం–జాట్ల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచారు. గత ఏడాదిలో పరివర్తన్ సందేశ్ ర్యాలీల ద్వారా సోదరభావాన్ని పునర్నిర్మించే యత్నాలు చేశారు. అనంతరం ముస్లిం–జాట్–యాదవ్ ఫార్మాలాను తెరపైకి తెచ్చి ఆర్ఎల్డీతో పొత్తుపెట్టుకున్నారు. ఆ పార్టీకి ఏకంగా 33 స్థానాలను కేటాయించారు. ఈ వ్యూహంతోనే తొలి దశలో కనీసంగా 40–50 స్థానాలు కొల్లగొట్టే యత్నాల్లో ఉన్నారు. ఎస్పీ వ్యూహాలను తిప్పకొట్టేలా బీజేపీ సైతం అనేక ఎత్తుగడలు వేస్తోంది. రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం ద్వారా జాట్లు, రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర మంత్రి మండలిలలో ముగ్గురు జాట్ నేతలు భూపేంద్రసింగ్, లక్ష్మీనారాయణ్సింగ్, బుల్దేవ్ సింగ్‌లకు అవకాశం కల్పించింది. దీనికి తోడు ముజఫర్‌నగర్‌లో ఆర్ఎల్డీ మాజీ నేత అజిత్‌సింగ్‌ను ఓడించిన జాట్ నేత సంజీవ్ బలియాన్‌ను కేంద్రమంత్రిని చేసింది. జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్ పేరుతో ఓ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసింది. ఇవన్నీ కేవలం జాట్లను సంతోషపరిచేందుకే అని వేరుగా చెప్పనక్కర్లేదు. షా రంగంలోకి.. జాట్లలో చీలిక! 2017 ఎన్నికల్లో బీజేపీ జాట్లకు 12 స్థానాలను కేటాయించగా... ఈసారి అదే స్థాయి సీట్లను కేటాయించింది. అయితే ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమితో తమకు నష్టం జరుగకుండా ఉండేందుకు జాట్లను చీల్చే ప్రయత్నాలకు దిగింది. దీనిలో భాగంగా అఖిలే‹Ô హయాంలో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లను పదేపదే ప్రస్తావిస్తూ కూటమిది అపవిత్ర బంధం అంటూ ప్రచారం చేస్తోంది. ఆర్ఎల్డీ పొత్తుతో జాట్లే తీవ్రంగా నష్టపోయారని, ముస్లిం అభ్యర్థులు లబ్ధిపొందుతున్నారని ఆరోపణలు చేస్తోంది. ఇది కొంతమేర ప్రభావం చూపించి, ఎస్పీ అభ్యర్థులు ఉన్న చోట జాట్ల ఓట్లు గంపగుత్తగా వారికే వెళ్లకుండా చేస్తోంది. దీనికి మరింత పదునుపెట్టి జాట్లను పూర్తిగా తనవైపు తిప్పుకునేలా బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో పశ్చిమ యూపీకి చెందిన 200ల మంది జాట్ ప్రతినిధులతో ‘సామాజిక సోదరుల భేటీ’ని నిర్వహించారు. తమ ప్రభుత్వం ముగ్గురు జాట్లను గవర్నర్లుగా నియమిస్తే, మరో 9 మందిని లోక్‌సభకు పంపిందనే విషయాన్ని అమిత్ షా భేటీలో గుర్తుచేశారు. జాట్ల సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చిన అమిత్ షా, ఏదైనా ప్రత్యేకంగా మాట్లాడటానికి నేరుగా తన ఇంటికే రావాలని, తన ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ‘యూపీ రైతులకు రూ.36వేల కోట్ల రుణాలను రద్దు చేసింది. 1.30లక్షల కోట్లను రైతుల ఖాతాలో జమచేసింది. 1.48లక్షల కోట్లను చెరకు రైతులకు చెల్లించింది. రైతులకు చేయాల్సిందంతా చేస్తోంది’ అని గుర్తుచేశారు. రైతులకు, జాట్లకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న హామీ ద్వారా జాట్లు బీజేపీకి దూరమయ్యారన్న నిందను దూరం చేసే ప్రయత్నం చేశారు. ఈ భేటీలో పాల్గొన్న జాట్ నేతలు జై శ్రీరామ్, ప్రధాని నరేంద్ర మోదీ జిందాబాద్, అమిత్ షా జిందాబాద్ అని నినాదాలు చేయడం ద్వారా బీజేపీతో నడిచేందుకు వారికెలాంటి అభ్యంతరాలు లేవని చాటిచెప్పారని బీజేపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. జాట్లతో భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే అమిత్‌షా గురువారం పశ్చిమ యూపీలోని మధుర, గౌతమ్బుద్ధనగర్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇదే రోజున కేంద్ర రక్షణ మంత్రి రాజ్నా«థ్‌సింగ్ భాగ్‌పట్, çఘజియాబాద్‌లలో పార్టీ ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ చర్యలన్నీ జాట్ల ఓట్లను చీల్చడంతో పాటు 20–30 స్థానాల్లో గెలుపును నిర్ణయిస్తుందని స్థానిక నేతలు విశ్లేషిస్తున్నారు. – న్యూఢిల్లీ, సాక్షి -
రిజర్వేషన్‌పై సోనియాకు జాట్ల అభినందన
న్యూఢిల్లీ: జాట్ కులస్తులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చేందుకు సోనియా చేస్తున్న కృషిని ఆ కులస్తులు కొనియాడారు. ఈ మేరకు వేలాదిమంది జాట్లు ఆదివారం సోనియాను ఆమె నివాసంలో కలిసి అభినందించేందుకు తరలివచ్చారు. జాట్ కులాన్ని వెనుకబడిన కులాల జాబితాలో చేర్చేందుకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వం వెనుకబడిన కులాల కమిషన్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. దీని వెనుక సోనియా కృషి అభినందనీయమని పలువురు జాట్లు వ్యాఖ్యానించారు. హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా, అతడి కుమారుడు దీపేందర్ సింగ్ హుడా, మాజీ స్పీకర్ బలరాం జాకర్ నేతృత్వంలో వేలాదిమంది జాట్లు సోనియా నివాసానికి తరలివచ్చారు. లోక్‌సభ ఎన్నికల ముంచుకొస్తున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం జాట్ కులస్తులను బీసీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. ఈ సందర్భంగా దీపేందర్ సింగ్ మాట్లాడుతూ జాట్ కులాన్ని వెనుకబడిన కులా ల జాబితాలో చేర్చేందుకు 1999లో జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ తిరస్కరించిందన్నారు. కాగా కేంద్రస్థాయిలో జాట్లకు ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర కేబినెట్ గురువారం ఎన్‌సీబీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కలుగనుంది. కాగా, జాట్లకు కేంద్ర ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని గుజరాత్,హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.