లక్షల్లో లాక్కున్నాడు.. వేలల్లో విదిల్చాడు! | Fraud with the name of overnment jobs | Sakshi
Sakshi News home page

లక్షల్లో లాక్కున్నాడు.. వేలల్లో విదిల్చాడు!

Published Fri, Aug 3 2018 1:02 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM

Fraud with the name of overnment jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఆకర్షించి, వారి నుంచి అందినకాడికి దండుకుని జారుకునే ముఠాలను ఇప్పటివరకు చాలా చూశాం. కానీ ఈ అంతర్రాష్ట్ర ముఠా వారికంటే నాలుగాకులు ఎక్కువే చదివింది. నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన ఈ ముఠా నాయకుడు.. ఉద్యోగాలకు ఎంపికైనవారి పేర్లు బోగస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచడమే కాకుండా వారికి పొరుగు రాష్ట్రాల్లో శిక్షణ సైతం ఇప్పించాడు.

అనంతరం వారికి ఉద్యోగ బాధ్యతలు అప్పగించి, నెల జీతం కూడా ఇచ్చాడు. అనంతరం కనిపించకుండా పోయాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం ఈ ముఠాను పట్టుకున్నారు. ఎనిమిది మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.  

కోటాల పేరుతో బుట్టలోకి...
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఉద్యోగి వి.గంగాధర్‌ కొన్నేళ్ళుగా ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడు. 2015లో కంచన్‌బాగ్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై వచ్చిన తర్వాత పంథా మార్చా డు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పి.దస్తగిరి, ఎం.శివరెడ్డి, కె.రాజేష్, ఎ.స్వామి, ఎం.క్రాంతికుమార్, వై.వీరేశం, ఎం.శ్రీకాంత్‌లను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు.

వీరు నిరుద్యోగ యువతను ఆకర్షించి గంగాధర్‌ దగ్గరకు తీసుకెళ్లేవారు. తమకు ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని.. స్పెషల్‌ డిపార్ట్‌ మెంట్‌ కోటా, మినిస్టర్స్‌ కోటా, డిసీస్డ్‌ కోటా తదితర కేటగిరీల్లో ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గంగాధర్‌ వారిని బుట్టలో వేసుకునేవాడు. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రేట్లు చెప్పి, రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు అడ్వాన్స్‌ తీసుకుని ఏజెంట్లకు కొంత కమీషన్‌ ఇచ్చేవాడు.  

అనుమానం రాకుండా పక్కాగా...
నియమాక ప్రక్రియలో ఎలాంటి అనుమానం రాకుండా గంగాధర్‌ పక్కాగా వ్యవహరించేవాడు. రైల్వే ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని కాప్రా ప్రాంతానికి చెందిన శ్యామ్‌ ద్వారా వైద్య పరీక్షల పత్రాలు ఇప్పించేవాడు. అనంతరం విజయవాడలో శంకర్‌ అనే వ్యక్తితో ఇంటర్వ్యూలు చేయించేవాడు. ఎంపికైనవారి వివరాలు వెబ్‌సైట్లో ఉంటాయని చెప్పి వారికి ఆ సైట్‌ అడ్రస్‌ ఇచ్చేవాడు.

ఇందుకోసం ముందుగానే పి.పద్మారెడ్డి అనే వెబ్‌ డిజైనర్‌ ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయించాడు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ) ఇలా మారిందని చెప్పి, అందరి పేర్లనూ ఎంపికైనవారి జాబితాలో ప్రదర్శించేవాడు. వారికి నమ్మకం కుదిరిన తర్వాత మిగిలిన మొత్తం తీసుకునేవాడు. అనంతరం నకిలీ నియామక పత్రాలు ఇచ్చి శిక్షణ పేరుతో ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్, దుర్గాపూర్, ఒడిశాలోని ఖురధ్వలకు తీసుకెళ్లేవాడు.

ఆయా ప్రాంతాల్లో ఉన్న పాత కాలేజీ, ఐటీఐలకు చెందిన భవనాలను అప్పటికే లీజుకు తీసుకున్న గంగాధర్‌.. వాటిలో నకిలీ ఫ్యాకల్టీల ద్వారా 15 రోజులపాటు శిక్షణ ఇప్పించేవాడు. అనంతరం ఎక్కడ రిపోర్టు చేయాలో చెబుతానని చెప్పి స్వస్థలాలకు పంపించేవాడు. కొన్ని రోజుల తర్వాత ఫలానా సమయంలో, ఫలానా చోట రిపోర్ట్‌ చేయాలంటూ వారికి సంక్షిప్త సందేశాలు, ఈ–మెయిల్స్‌ పంపేవాడు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో టీసీలుగా..
ఇదే కోవలో ‘టికెట్‌ కలెక్టర్‌’ఉద్యోగాలకు ఎంపికైన కొందరు అభ్యర్థుల్ని గతేడాది సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉండే ఓ అధికారికి రిపోర్ట్‌ చేయమని గంగాధర్‌ చెప్పాడు. అప్పటికే తన ముఠాకు చెందిన వ్యక్తినే టీసీ మాదిరిగా మూడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై నిల్చోబెట్టాడు.

అతడు వారి నుంచి జాయినింగ్‌ రిపోర్టు తీసుకుని.. నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ప్యాడ్, పెన్ను, తెల్లకాగితాలు అందించి బాధ్యతలు అప్పగించాడు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్‌కు వచ్చే రైళ్ల పేర్లు, నంబర్లు, సమయాలు రాయించాడు. దాదాపు 25 రోజులు ఇలా పని చేసిన తర్వాత వీరికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు జీతాలు కూడా ఇచ్చి ఆపై మోసగాళ్లంతా దుకాణం సర్దేశారు.


రూ.3 కోట్లకు పైగా వసూళ్లు...
ఈ పంథాలో గంగాధర్‌ ముఠా గత రెండున్నరేళ్లుగా దాదాపు 150 మంది నుంచి రూ.3 కోట్లకు పైగా వసూలు చేశారు. వారందరికీ రైల్వేలో టీసీ, కమర్షియల్‌ క్లర్క్, పాయింట్‌ మెన్‌తో పాటు రెవెన్యూ, విద్యాశాఖ, సచివాలయం, హైకోర్టు, జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కోల్లో జూనియర్‌ అసిస్టెంట్, అటెండర్‌ ఉద్యోగాలు ఇచ్చేశాడు. ఈ ముఠా చేతిలో మోసపోయిన వారిలో నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు విశాఖపట్నానికి చెందిన వారు ఉన్నారు.

వీరి ఫిర్యాదుతో ఈ ముఠాపై 10 కేసులు నమోదయ్యాయి. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సెంట్రల్, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పద్మారెడ్డి, శ్యామ్, శంకర్‌ మినహా మిగిలిన ఎనిమిది మందినీ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు, నకిలీ పత్రాలు తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని ఎస్సార్‌నగర్, సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement