=అమరుల కుటుంబీకుల ఆవేదన
=అటవీశాఖలో కారుణ్య నియామకాలు చేపట్టాలని వినతి
బహదూర్‌పురా,న్యూస్‌లైన్: అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో ఎంతో ధైర్యంతో విధులు నిర్వర్తించి ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదని అమరుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అటవీ అమరవీరుల సంస్మరణదినం సందర్భం గా అమర వీరుల కుటుంబ సభ్యులు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ ప్రధానముఖ్యకార్యదర్శి (పీసీసీఎఫ్) బి.ఎస్.ఎస్.రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
1984లో మృతి చెందిన అక్బర్ కుటుంబానికి పింఛన్ మాత్రమే చెల్లిస్తూ... నేటికి ఉద్యోగం కల్పించకపోవడంతో బాధితురాలు ఖైరున్నీసా తన కుమారుడికి ఉద్యోగం కల్పించాలంటూ అధికారులను ప్రాధేయపడుతూ విలేకర్లతో వాపోయారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఖైరున్నీసాకు పూర్తిస్థాయి వేతనాన్ని చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసినా ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదని ఆమె వాపోయింది.
అమరులైన 32 మంది కుటుంబాల్లో సగానికి పైగా ప్రభుత్వోద్యోగాలు రాలేవంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం,అటవీశాఖ తరఫున నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.