సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా పోలీసుశాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమపై నమోదైన కేసులు, అరెస్టులు, కోర్టులు విధించిన శిక్షలు, వాటి స్థితిగతులకు సంబంధించిన వివరాలను తెలియచేయాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను దాచిపెట్టినట్లు తేలినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలినా, ఆ కారణాలతో ఆ అభ్యర్థి లేదా అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించే అధికారం నియామక అధికారులకు ఉందని తేల్చి చెప్పింది. కేసులున్న విషయాన్ని దాచి పెట్టినట్లు ఉద్యోగంలో చేరిన తరువాత తేలితే, అప్పుడు సైతం ఉద్యోగం నుంచి తొలగించవచ్చునని పేర్కొంది. దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చిన కొందరు అభ్యర్థుల ప్రాథమిక ఎంపికను రద్దు చేస్తూ ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు పరస్పర విరుద్ధమైన తీర్పులిచ్చిన నేపథ్యంలో పలు తీర్పులను అధ్యయనం చేసిన తరువాత ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
తప్పుడు సమాచారమిచ్చిన అభ్యర్థులు...
కానిస్టేబుళ్లు, అగ్నిమాపక అధికారి పోస్టుల భర్తీ నిమిత్తం పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు 2011లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌కు స్పందించిన పలు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నా రు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుం టూరు, అనంతపురం జిల్లాలకు చెందిన వినయ్, సాజిద్, ప్రసాద్, ప్రసన్నకుమార్, మంజుల రాజు, లోగమయ్య కూడా దరఖాస్తులు చేశారు. ఆ దరఖాస్తుల్లోని 16వ కాలమ్‌లో దరఖాస్తు దారులందరూ తమపై నమోదైన కేసుల వివరాలు, ఆ కేసుల్లో జరిగిన అరెస్టులు, కోర్టులు విధించిన శిక్షలు, నిర్దోషిగా ప్రకటించి ఉంటే ఆ వివరాలు, రాజీ చేసుకుని ఉంటే ఆ వివరాలు ఇలా అన్ని వివరాలను అందులో పొందు పరచడం తప్పనిసరి. వినయ్ తదితరులు ఆ 16వ కాలమ్‌లో తమపై కేసులు లేవంటూ స్పష్టంగా రాశారు. పోలీసుల విచారణలో వీరం దరిపై కేసులు ఉన్నట్లు తేలింది. దీంతో రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు వారి ప్రాథమిక ఎంపికను రద్దు చేస్తూ ఉత్తర్వులి చ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ అభ్యర్థులందరూ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్... అభ్యర్థులపై నమోదైన కేసులు ఉద్యోగ నియామకం పొందేందుకు ఎంత మాత్రం అనర్హత కాదంటూ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వేర్వేరుగా హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలు చేసింది.
ట్రిబ్యునల్ తీర్పును తప్పుపట్టిన ధర్మాసనం...
ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తప్పుపట్టిం ది. ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రిబ్యునల్ సరైన దృష్టి కోణంలో చూడలేదని ధర్మాసనం తెలిపింది. దరఖాస్తులో వాస్తవాలను దాచిపెడితే తీసుకునే చర్యల గురించి ఏపీ పోలీస్ రూల్స్‌లో స్పష్టంగా ఉందని, ఈ విషయాన్ని కూడా ట్రిబ్యునల్ పట్టించుకోలేదంది. ‘పోలీసుశాఖ వంటి క్రమశిక్షణ కలిగిన శాఖకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి సరిపోతాడా లేదా అనే విషయాన్ని కేవలం అతని గతాన్ని బట్టే కాక, సర్వీసులో అతను ఎంత నిజాయితీగా ఉండగలడన్న అంశాన్ని బట్టి కూడా నిర్ణయించాల్సి ఉంటుంది. స్పష్టంగా అడిగినప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పిన వ్యక్తులు పోలీసు శాఖకు ఎంత మాత్రం సరిపోరు’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment