భక్తళాపురం ప్రాథమిక పాఠశాల
సాక్షి, పెన్‌పహాడ్ (సూర్యాపేట) : అది ఒక మారుమూల పల్లె. వారి జీవనాధారం వ్యవసాయం. అందరూ వ్యవసాయం మీదే ఆధారపడుతూ తమ పిల్లలకు ఉన్నత విద్యాబోధన చేయించారు. వారు ఇప్పుడు వివిధ రకాల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మండల పరిధిలోని భక్తళాపురం ఆవాసం యర్రంశెట్టివారిగూడెంలో 500 మంది జనాభా. పురుషులు 264, స్త్రీలు 236 మంది ఉన్నారు. గ్రామానికి చెందిన యువకులు వ్యవసాయంపై ఆధారపడకుండా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారు. గ్రామంలో మొత్తం 68మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
గ్రామంలో ప్రధానంగా సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్, ఎంఈఓ, ఉపాధ్యాయులు 21, సబ్‌ఇన్‌స్పెక్టర్లు 2, కానిస్టేబుల్స్ 5, వ్యవసాయం అధికారి, వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు 2, వైద్యాధికారులు 2, స్టాఫ్‌నర్స్ 1, ఆర్టీసీ, ఎలక్ట్రికల్, సాఫ్ట్‌వేర్ 15 మంది ఇలా పలువురు పలు ఉద్యోగాల్లో ఉన్నారు. అంతేకాకుండా ఇంకొంత మంది విదేశాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. గ్రామంలో 1వ తరగతి నుంచి 2వతరగతి వరకు మాత్రమే ఉంది. 3వ తరగతి నుంచి 4వ తరగతి వరకు నేలమర్రి, ఆపై చదువులకు చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఐదు కిలో మీటర్ల దూరం నిత్యం నడుచుకుంటూ వెళ్లే వారు. గ్రామంలో సరైన సౌకర్యాలు లేనప్పటికీ జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలనే ఆకాంక్ష వారిని ఈ స్థాయికి చేర్చింది. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నతమైన స్థాయిలో నిలిచిన వారు కూడా ఉన్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే..
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఉన్నతమైన చదువు చదివి ఉద్యోగంలో స్థిరపడ్డాను. ఉపాధ్యాయుల నాణ్యమైన విద్యాబోధన ఫలితంగానే ఉన్నత చదువుల్లో రాణించి ఇంటలిజెన్స్ సీఐగా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నా.
– మధుసూదన్, సీఐ, హైదరాబాద్
మా నాన్న స్ఫూర్తితోనే నేను ఈ స్థాయిలో ఉన్నా..
ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలతో పాటు మా నాన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాడు. ఆయన స్ఫూర్తితోనే కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. గ్రామంలో పోటీతత్వం వల్ల కూడా ఉన్నతమైన స్థానం సాధించగలిగా. సొంత మండలంలోనే పశువైద్యాధికారిగా విధులు నిర్వహించా. ప్రస్తుతం వరంగల్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నా.
– యర్రంశెట్టి కిరణ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment