సర్కారీ కొలువులకు కోత | 10% quota's fine, but govt cutting jobs too | Sakshi
Sakshi News home page

సర్కారీ కొలువులకు కోత

Published Tue, Jan 22 2019 4:53 AM | Last Updated on Tue, Jan 22 2019 4:53 AM

10% quota's fine, but govt cutting jobs too - Sakshi

న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం.. ఏటా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మాత్రం పట్టించుకోవడం లేదు. 2014 నుంచి ఏటికేడు సర్కారీ కొలువులు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలా 78 వేలకు పైగా ఉద్యోగాల్లో కోత పడగా కొత్తగా ప్రవేశపెట్టిన 10శాతం రిజర్వేషన్‌ వల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్న యువజనుల మదిని తొలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను వెల్లడిస్తూ.. వచ్చే ఏడాది ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నదీ చెబుతుంది.

కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 55 మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులను కూడా కేంద్ర సిబ్బందిగానే పరిగణిస్తారు. అయితే, రక్షణ దళాల సిబ్బందిని వీరితో కలపరు. 2018–19 బడ్జెట్‌ ప్రకారం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 32 లక్షల 52వేలు. 2014 మార్చి 1వ తేదీ నాటికి వీరి సంఖ్య 33 లక్షల 30 వేలు. అంటే, ఈ నాలుగేళ్లలో సుమారు 78 వేల ఉద్యోగాలు తగ్గి పోయాయన్న మాట. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా వచ్చే ఏడాదికి ఉద్యోగాలను 35 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే, కేంద్రం ఈ హామీని ఏ ఒక్క ఏడాది కూడా నెరవేర్చలేదు.  

ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడమే సర్కారీ కొలువుల కోతకు కారణం. కేంద్రం గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకుంటోంది. ముఖ్యంగా ప్యూన్లు, డ్రైవర్లను ఈ పద్ధతిలో నియమిస్తోంది. మరోవైపు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానాలను చాలా ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. ఇదికూడా ఉద్యోగాల సంఖ్య తగ్గడానికి కారణమవుతోంది. రైల్వేలో 2010లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో 2018 నాటికి కూడా అంతమందే ఉన్నారు. 2016 నాటికి రైల్వేలో 13.31 లక్షల మంది ఉండగా, 2017లో 23వేల మందిని తొలగించారు. ఆ లోటు ఇప్పటికీ భర్తీ చేయలేదు. అయితే, పోలీసు శాఖలో ఉద్యోగుల సంఖ్య 10.24 లక్షల నుంచి 11.25 లక్షలకు పెరిగింది. అలాగే, ప్రత్యక్ష పన్నుల విభాగంలో ఉద్యోగులు 45 వేల నుంచి 80 వేలకు పెరిగారు. కస్టమ్స్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగాల్లో కూడా 54 వేల నుంచి 93 వేలకు పెరిగారు. కొన్ని విభాగాల్లో పెరిగినా మొత్తం మీద చూస్తే ఉద్యోగాల్లో తగ్గుదలే స్పష్టంగా కనబడుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement