engneering student
-
24 నుంచే ఇంజనీరింగ్, ఫార్మసీ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ విద్యార్థుల తరగతుల నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఈనెల 24 నుంచి ఆన్లైన్ పద్ధతిలో సీనియర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను ఆదేశించింది. ఏఐసీటీఈ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సీనియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాల్సి ఉన్నా.. రాష్ట్రంలో ఒక వారం ముందే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇక దసరా, వేసవి సెలవులు, మిడ్ టర్మ్ పరీక్షలు, ప్రయోగ పరీక్షలతో పాటు మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షల తేదీలను జేఎన్టీయూహెచ్ ఖరారు చేసింది. ఈమేరకు 2020–21 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీ పోర్టల్‌లో ఆ క్యాలెండర్‌ను అందుబాటులో ఉంచింది. రోజుకు 3 గంటల పాటు.. ఇంజనీరింగ్, ఫార్మసీ టెక్నికల్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల (ఎంఫార్మసీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ) కు సంబంధించి సీనియర్ విద్యార్థులకు రోజుకు 2 నుంచి 3 గంటల పాటు ఆన్లైన్ పద్ధతిలో తరగతులు నిర్వహించాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఈ తరగతులు నిర్వహించాలి. అయితే తరగతుల నిర్వహణ వెసులుబాటును బట్టి క్లాసులను 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించుకోవచ్చని సూచించింది. ప్రతిరోజూ అటెండెన్స్... ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థుల నుంచి ప్రతిరోజూ అటెండెన్స్ తీసుకోవాలని జేఎన్టీయూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఆన్లైన్ క్లాసులకు తప్పకుండా హాజరు కావాల్సిందే. ఈ తరగతులను రికార్డ్ చేసి యూనివర్సిటీకి ప్రజెంటేషన్ ఇవ్వాలనే నిబంధన పెట్టింది. దీంతో తరగతులు నిర్వహించని కాలేజీలేంటో ఇట్టే తెలిసిపోతుంది. దీంతోపాటు రోజువారీ అటెండెన్స్‌ను కూడా యూనివర్సిటీకి అప్డేట్ చేయాలి. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన జడ అనూష(21) మండల కేంద్రంలోని గర్ట్స్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఏడాది క్రితం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన ఆది మల్లేష్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా హాస్టల్లో ఉంటూనే చదువు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అనారోగ్యంగా ఉందని కాలేజీకి వెళ్లకుండా గదిలోనే ఉంది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు అనూష రాకపోవడంతో పక్కగదిలో ఉంటున్న మరో విద్యార్థిని వెళ్లి చూడగా కనిపించలేదు. వెంటనే హాస్టల్ యజమానికి చెప్పడంతో కిటికీ పగలగొట్టి చూడగా బాత్రూంలో కాళ్లు కనిపించాయి. జారిపడి ఉంటుందని భావించారు. బాత్రూంకు గడియ పెట్టడంతో వెంటిలేటర్ నుంచి చూడగా ఉరేసుకుని ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, రూరల్ ఏసీపీ విజయసారధి, సీఐ మహేశ్‌గౌడ్, ఎల్ఎండీ ఎస్‌హెచ్‌వో నీతికపంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైదరాబాద్‌లో ఉన్న అనూష భర్తను కూడా రప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అత్తింటి వేధింపులే కారణం! అనూష మృతికి అత్తింటి వేధింపులే కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఏడాది క్రితం తమ కుమార్తెకు రూ.21 లక్షల కట్నం, బంగారం ఇచ్చి సాగనంపామని, సంవత్సరం గడవకముందే ఆడపడచు, అత్త వేధింపులు మొదలయ్యాయని, మరో రూ.పది లక్షలు అదనంగా వరకట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. అనూష మరిదికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. అతడికి రూ.25 నుంచి రూ.30 లక్షలు ఇస్తున్నారని, నీవు కూడా అంత కట్నం తీసుకురావాలని అనూషను ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు. ఏసీపీ, సిఐ, తహసీల్దార్ మృతురాలి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తండ్రి జడ మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్‌గౌడ్ తెలిపారు. మర్తనపేటలో విషాదం కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన జడ అనూష ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. భర్త హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం అనూష ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కరీంనగర్‌కు తరలివెళ్లారు. -
పట్టాలపై మందు పార్టీ
సాక్షి, చెన్నై: వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు.. పరీక్ష ముగిసిన ఆనందంలో వెన్నెల వెలుగులో మందు పార్టీ అంటూ రైలు పట్టాల మధ్య కూర్చుని పూటుగా మద్యం తాగారు. దురదృష్టవశాత్తూ అదే సమయంలో రైలు వచ్చింది. మద్యం మత్తులో జోగాడుతూ కదల్లేని పరిస్థితుల్లో నలుగురు విద్యార్థులు రైలు కింద పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రావత్తూరు రైల్వేవంతెన సమీపానికి రైలు వచ్చినప్పుడు ట్రాక్‌పై కొందరు కూర్చుని ఉండడాన్ని గమనించిన డ్రైవర్ హారన్ మోగించాడు. అయినా ఎవరూ కదల్లేదు. రైలును ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వంతెన దాటాక రైలాగింది. గార్డు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది వెనక్కి వచ్చి చూడగా.. నలుగురు యువకులు సంఘటన స్థలంలోనే విగతజీవులై కనిపించారు. గాయాలతో బయటపడిన మరో యువకుడ్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నట్టు తేలింది. మృతులను కొడైకెనాల్‌కు చెందిన సిద్ధిక్ రాజ (22), రాజశేఖర్ (22), రాజపాళయంకు చెందిన కరుప్పుస్వామి (22), గౌతమ్ (22)లుగా గుర్తించారు. తేనికి చెందిన విశ్వేషన్ (22) గాయపడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల మృతి
మునగాల(కోదాడ): అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. విహారయాత్ర.. విషాదాంతమైంది. మొత్తం 16 మంది విద్యార్థులు.. 2 కార్లలో ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. రాత్రి కావడంతో తిరుగుపయనమయ్యారు. అంతలో వీరు ప్రయాణిస్తున్న ఓ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడే మృతిచెందగా, మరొకరు సూర్యాపేట ఏరియా ఆస్పత్రి లో చనిపోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యా యి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో ఉన్న గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 16 మంది విద్యార్థులు ఆదివారం గుంటూరు జిల్లా బాపట్లకు 2 కార్లలో వెళ్లారు. తిరిగి సోమవారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఒక కారులో ఏడుగురు, మరో కారులో 9మంది ఉన్నారు. ఏడు గురు ఉన్న మరో కారు మునగాల మండలం ఇందిరానగర్ శివారులోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో హర్ష (24) అనే విద్యార్థి కారు నుంచి ఎగిరి రోడ్డుపై పడి చనిపోయాడు. డ్రైవింగ్ చేస్తున్న రేవంత్ (24) కారులోనే ఇరుక్కుపోయి మృతిచెందాడు. మరో విద్యార్థి శశాంక్ (26)ను సూర్యా పేట ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి మృతిచెందాడు. కారులో ప్రయా ణిస్తున్న ప్రణీత్, ఆసిఫ్, అజయ్, నిఖిల్ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యా యి. వీరికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలించారు. మృతుల్లో రేవంత్‌ది హైదరాబాద్‌లోని చంపాపేట్ కాగా, హర్ష బాలాపూర్, శశాంక్ సికింద్రాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
నాగోలు: అనుమానాస్పద స్థితిలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీని వాస్‌రావు కుమారుడు నాగసాయి రామ్ (21) మీర్‌పేట టీకేఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ సెకం డియర్ చదువుతున్నాడు. అతడు కళాశాల దగ్గరలోనే ఓ హాస్టల్లో ఉండేవాడు. గురువారం సాగర్రోడ్డులోని అలేఖ్య రెసిడెన్సీ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. శుక్రవారం సిబ్బం ది రూమ్ సర్వీస్ కోసం అతని గది తలుపు తట్టి పిలిచినా స్పందన రాలేదు. దీంతో కిటికీ నుంచి చూస్తే అతడు ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని గదిని తెరిచి పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన నంబర్ ద్వారా అతడి తండ్రికి సమాచారం ఇచ్చారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నాగసాయి ఓ సైకియాట్రిస్టును కలిసినట్లు పోలీసులు చెప్పారు. అతడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే హాస్ట్టల్ నుంచి బెడ్‌షీట్ తెచ్చుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. అతడి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమూ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
బీటెక్ పరీక్షలకు కొత్త రూపు...!
శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్ పరీక్షలంటే కొన్ని రోజుల నుంచే విద్యార్థుల్లో గుబులు మొదలై పరీక్షల జ్వరం వచ్చేసేది. టెన్షన్‌తో ప్రిపేర్ అవుతూ నానా తంటాలు పడుతూ పరీక్షలు రాసేవారు. మరికొందరు వన్ డే బ్యాటింగ్‌కి జై అంటూ ఒక రోజు ముందు పుస్తకాలు పట్టి పరీక్షలు రాసేవారు కూడా ఉంటారు. ఎగ్జామ్స్ అంటే పాఠ్యాంశాలు రోజుల తరబడి చదవడం, సమాధానాలు గుర్తుపెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాస్తూ ప్రాక్టీస్ చేయగా మరికొందరు చిన్న పిల్లల్లా బట్టి పట్టి గట్టెక్కెస్తుంటారు. ఇక నుంచి బీటెక్ విద్యార్థుల టెన్షన్‌కు తెరతీస్తూ ఓపెన్ బుక్ విధానంతో ఇంజినీరింగ్ పరీక్షలు ఉండబోతున్నాయి. అంటే పుస్తకాలు చూస్తూ ఏంచక్కా పరీక్షలు రాసుకోవచ్చు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడంతోపాటు విశ్లేషణాత్మక పరిజ్ఞానం పెంచాలని ఈ పద్ధతికి ఏఐసీటీఈ శ్రీకారం చుట్టింది. పరీక్ష„ý తీరుతోపాటు ప్రశ్నాపత్రం, సమయం వంటి అంశాల్లో కీలక మార్పులు జరగనున్నాయని అధికార వర్గాల ద్వారా సమాచారం. ఇదే అమలైతే విద్యార్థులు రోజుల తరబడి పడే టెన్షన్, ఒత్తిడితోపాటు కష్టాలు దూరం అయినట్లేనని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ప్రశ్నాపత్రాలు కూడా నైపుణ్యాలు వెలికితీసేలా ఉండబోతాయని సూచిస్తున్నారు. ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్.. పుస్తకాల ఆధారంగా (ఓపెన్‌బుక్) పరీక్షలు జరపాలనే సంస్కరణకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా ఆమోదించింది. నైపుణ్యాలను పరీక్షించాలన్నా.. మానసిక ఒత్తిడిని తగ్గించాలన్నా.. ఓపెన్‌బుక్ విధానమే సరైందని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్షల విధానం అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. సమస్యల పరిష్కారంతోపాటు, పరిజ్ఞానాన్ని పరీక్షించడంపై ప్రశ్నలివ్వాలని దేశవ్యాప్తంగా యూనివర్సిటీలకు ఏఐసీటీఈ మార్గనిర్దేశం చేసింది. కేవలం పాఠ్యాంశాలు గుర్తుపెట్టుకునేలా కాకుండా సృజనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించి రాసేలా ప్రశ్నలుండాలని సూచించింది. సాధారణ విధానం కంటే నూతనంగా అమలయ్యే ఈ విధానంలో ఎక్కువ సమయం కేటాయించాలని సూచించింది. కానీ.. ఓపెన్ బుక్ విధానంలో ఇప్పటికే కొన్ని పరీక్షలు జరుగుతున్నాయని నేరుగా ప్రశ్నలు రాకుండా పరోక్ష అంశాలు, విశ్లేషణాత్మకంగా కూడిన ప్రశ్నలతో ప్రశ్నాపత్రం కాస్త కఠినంగానే ఉండబోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అధ్యాపకులకు శిక్షణ.. బీటెక్ పరీక్షల్లో కొత్త పరీక్షా విధానంపై అవగాహన పెంచేందుకు అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. సిలబస్ బోధన, పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు, విశ్లేషణాత్మక ప్రశ్నలకు జవాబులు రాసే విధానం, నైపుణ్యాలకు పదును పెట్టి వెలికితీసే అంశాలు ఇలా వివిధ విషయాలపై అధ్యాపకులకు ముందుగా శిక్షణ ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అధ్యాపకులకు శిక్షణ ఇస్తే ఆది నుంచే పరీక్షల విధానాన్ని దృష్టిలో ఉంచుకొని బోధన జరుగుతుందని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన, ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబు చేసే సామర్థ్యాన్ని నింపుతారనే ఉద్దేశంతో శిక్షణ అవసరమని భావిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2019–20 విద్యాసంవత్సరంలోకి అడుగు పెట్టే విద్యార్థులు సరికొత్తగా పరీక్షల రాయనున్నారని తెలుస్తోంది. దీనిపై విద్యార్థులు కూడా సంతృప్తిగా ఉంటే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
‘అతని ఆత్మ నన్ను పిలుస్తుంది.. అందుకే’
ముంబై : నిన్ననే మన దగ్గర ఆత్మలకు సంబంధించి ఓ వార్త బాగా ప్రాచుర్యం చెందింది. కొన్ని రోజుల క్రితం మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ ఆత్మ తమకు కనిపిస్తుందని.. విగ్రహం కట్టమని అడుగుతుందంటూ ఓ జంట ప్రణయ్ భార్య అమృతను కలిసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఓ కుర్రాడి ఆత్మ తనను పిలుస్తుందని చెప్పి పద్దేనిమిదేళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. నాగ్‌పూర్‌కు చెందిన సౌరభ్(18) ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఓ రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆ ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. ఆ రోజు నుంచి సౌరభ్ ఆ బాలుని ఆత్మను తనకు కనిపిస్తుందని.. అది తనను రమ్మని పిలుస్తుందని భావించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పాడు. కానీ సౌరభ్ చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మైనర్లు చనిపోయారు. దీనికి కూడా సదరు బాలుని ఆత్మనే కారణమని భావించాడు సౌరభ్. తనను తీసుకెళ్లడానికే ఆ బాలుని ఆత్మ ప్రయత్నిస్తుందని.. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు మైనర్లు చనిపోయారని భావించాడు. దాంతో తాను చనిపోకపోతే ఆ బాలుని ఆత్మ మరింత మందిని చంపుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ‘రెండు నెలల క్రితం నా కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. అతని ఆత్మ నన్ను పిలుస్తోంది. నేను రాకపోవడంతో ఇద్దరు చనిపోయారు. నేను వెళ్లకపోతే మరింత మంది చనిపోతారు. అందుకే నేను చనిపోతున్నానం’టూ సౌరభ్ సూసైడ్ నోట్లో రాశాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారి ‘సౌరభ్ చాలా తెలివిగల విద్యార్థి. చదువులో ఎప్పుడు ముందుండేవాడని తెలిసింది. కానీ రోడ్డు ప్రమాదంలో తన కళ్ల ముందే ఓ వ్యక్తి చని పోవడం అతన్ని ఎంతో బాధించింది. ఈ విషయం గురించి ఇంట్లో వారికి కూడా చెప్పాడు. కానీ అతను చెప్పిన విషయాల గురించి కుటుంబ సభ్యులు సీరియస్‌గా తీసుకోలేదు. బాలుని ఆత్మ పిలుస్తుందనే భయం వల్లే సౌరభ్ ఆత్మహత్య చేసుకున్నాడ’ని పోలీస్ అధికారులు వివరించారు. -
మేక్ ఇన్ ఇండియా చాలా అవసరం
సాక్షి, హైదరాబాద్ : విద్యార్ధులకు గల అనంతమైన అవకాశాలను వివరించేందుకు, సోమవారం మహీంద్రా ఇకోల్ సెంట్రల్ కళశాలలో మొదటి సెంట్రల్ కనెక్ట్ కాన్క్లేవ్ను నిర్వహించారు. ‘అనంతమైన అవకాశాల దిశగా’ అనే ట్యాగ్‌లైన్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ డా. సతీష్ రెడ్డి పాల్గొన్నారు. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా ఆవశ్యకతను వివరించారు. గత 40 సంవత్సరాలుగా భారత్ అంతరిక్ష పరిశోధనల్లో సాధించిన విజయాలు, అభివృద్ధిని విద్యార్థులకు వివరించారు. కాలేజ్ డైరెక్టర్ యాజులు మేధూరి మాట్లాడుతూ.. గ్లోబలైజేషన్ ప్రభావం, విద్యార్థుల్లో సాహసవంతమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కల్పించడంపై చర్చించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. భారతదేశంలో గల ఉద్యోగ అవకాశాల గురించి వాటిని ఏ విధంగా విద్యార్థులు అందిపుచ్చుకోవాలి అనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాలుడిని నిర్బంధించిన విద్యార్థులు
గుంటూరు ఈస్ట్: నాలుగు రోజులుగా కన్నకొడుకుని కొందరు యువకులు గదిలో బంధించి కొడుతుంటే తల్లడిల్లిన నిరుపేదలైన తల్లిదండ్రులు ఎవరైనా రక్షిస్తారేమోనని గుంటూరు నగరానికి వచ్చారు. ప్రతిపోలీస్టేషన్‌కు వెళ్లి తమ కన్నబిడ్డను రక్షించండి.. అంటూ వేడుకున్నారు. ఎస్పీ కార్యాలయం ఎక్కడో తెలియక లాలాపేట పోలీస్టేషన్ ఎస్పీ కార్యాలయం అనుకుని కనపడ్డ ప్రతికానిస్టేబుల్ను తమ బిడ్డను కాపాడాలని కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుడు కొమ్ము యోహాను తెలిపిన వివరాల ప్రకారం.. సంగం జాగర్లమూడిలో కొమ్ము యోహాను, ప్రభావతికి ఇద్దరు పిల్లలు.. వేణుగోపాల్, వేణు. పిల్లలిద్దరినీ వడ్లమూడి మెయిన్‌రోడ్డులో ఉన్న ప్రయివేటు హాస్టళ్ల్సలో పాచిపని చేసేందుకు పెట్టారు. గురువారం తెల్లవారు జామున హాస్టల్లో ఉండే కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు తమ సెల్ఫోన్లు చోరీ చేసాడంటూ యోహాను చిన్న కుమారుడైన 14 ఏళ్ల వయసుగల వేణుని గదిలో బంధించారు. విషయం తెలుసుకున్న యోహాను, ప్రభావతి విద్యార్థుల వద్దకు వెళ్లి కాళ్లవేళ్లా పడి బతిమిలాడారు. వారు ఏమాత్రం కనికరించకపోగా ఇక్కడే ఉంటే మిమ్మల్ని కూడా గదిలో వేసి కొడతామని బెదిరించారు. అప్పట్నించి రోజూ హాస్టల్‌కు వెళ్లి తమ కుమారుడిని విడిచి పెట్టాలంటూ వేడుకుంటున్నారు. అయినా వారు కనికరించడంలేదు. తమ బిడ్డను ఏం చేస్తారోనన్న భయంతో గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి ఆదివారం బయలుదేరి వచ్చారు. అయితే ఎస్పీ కార్యాలయం అని చెప్పడం చేతకాక పోలీసులను కలవాలంటూ గుంటూరు నగరానికి చేరిన దగ్గరి నుంచి చెబుతుండటంతో చివరకు మధ్యాహ్నానికి లాలాసేట స్టేషన్‌కు చేరుకున్నారు. అధికారులు ఎవరూ లేకపోవడంతో సెంట్రీ కానిస్టేబుల్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అతను ఇచ్చిన సలహా మేరకు మేరకు తిరిగి చేబ్రోలు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బయలు దేరారు. తమ బిడ్డకు ఏమవుతుందోనని వారు సాక్షితో ఆందోళన వ్యక్తంచేశారు.