సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ విద్యార్థుల తరగతుల నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఈనెల 24 నుంచి ఆన్‌లైన్ పద్ధతిలో సీనియర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను ఆదేశించింది. ఏఐసీటీఈ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సీనియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాల్సి ఉన్నా.. రాష్ట్రంలో ఒక వారం ముందే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇక దసరా, వేసవి సెలవులు, మిడ్ టర్మ్ పరీక్షలు, ప్రయోగ పరీక్షలతో పాటు మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షల తేదీలను జేఎన్‌టీయూహెచ్ ఖరారు చేసింది. ఈమేరకు 2020–21 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీ పోర్టల్‌లో ఆ క్యాలెండర్‌ను అందుబాటులో ఉంచింది.
రోజుకు 3 గంటల పాటు..
ఇంజనీరింగ్, ఫార్మసీ టెక్నికల్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల (ఎంఫార్మసీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ) కు సంబంధించి సీనియర్ విద్యార్థులకు రోజుకు 2 నుంచి 3 గంటల పాటు ఆన్‌లైన్ పద్ధతిలో తరగతులు నిర్వహించాలని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఈ తరగతులు నిర్వహించాలి. అయితే తరగతుల నిర్వహణ వెసులుబాటును బట్టి క్లాసులను 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించుకోవచ్చని సూచించింది.
ప్రతిరోజూ అటెండెన్స్...
ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థుల నుంచి ప్రతిరోజూ అటెండెన్స్ తీసుకోవాలని జేఎన్‌టీయూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఆన్‌లైన్ క్లాసులకు తప్పకుండా హాజరు కావాల్సిందే. ఈ తరగతులను రికార్డ్ చేసి యూనివర్సిటీకి ప్రజెంటేషన్ ఇవ్వాలనే నిబంధన పెట్టింది. దీంతో తరగతులు నిర్వహించని కాలేజీలేంటో ఇట్టే తెలిసిపోతుంది. దీంతోపాటు రోజువారీ అటెండెన్స్‌ను కూడా యూనివర్సిటీకి అప్‌డేట్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment