ఆత్యహత్చ చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి సౌరభ్ (ఫైల్‌ఫోటో)
ముంబై : నిన్ననే మన దగ్గర ఆత్మలకు సంబంధించి ఓ వార్త బాగా ప్రాచుర్యం చెందింది. కొన్ని రోజుల క్రితం మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ ఆత్మ తమకు కనిపిస్తుందని.. విగ్రహం కట్టమని అడుగుతుందంటూ ఓ జంట ప్రణయ్ భార్య అమృతను కలిసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఓ కుర్రాడి ఆత్మ తనను పిలుస్తుందని చెప్పి పద్దేనిమిదేళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాలు.. నాగ్‌పూర్‌కు చెందిన సౌరభ్(18) ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఓ రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆ ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. ఆ రోజు నుంచి సౌరభ్ ఆ బాలుని ఆత్మను తనకు కనిపిస్తుందని.. అది తనను రమ్మని పిలుస్తుందని భావించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పాడు. కానీ సౌరభ్ చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మైనర్‌లు చనిపోయారు. దీనికి కూడా సదరు బాలుని ఆత్మనే కారణమని భావించాడు సౌరభ్. తనను తీసుకెళ్లడానికే ఆ బాలుని ఆత్మ ప్రయత్నిస్తుందని.. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు మైనర్‌లు చనిపోయారని భావించాడు. దాంతో తాను చనిపోకపోతే ఆ బాలుని ఆత్మ మరింత మందిని చంపుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్‌లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
‘రెండు నెలల క్రితం నా కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. అతని ఆత్మ నన్ను పిలుస్తోంది. నేను రాకపోవడంతో ఇద్దరు చనిపోయారు. నేను వెళ్లకపోతే మరింత మంది చనిపోతారు. అందుకే నేను చనిపోతున్నానం’టూ సౌరభ్ సూసైడ్ నోట్‌లో రాశాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారి ‘సౌరభ్ చాలా తెలివిగల విద్యార్థి. చదువులో ఎప్పుడు ముందుండేవాడని తెలిసింది. కానీ రోడ్డు ప్రమాదంలో తన కళ్ల ముందే ఓ వ్యక్తి చని పోవడం అతన్ని ఎంతో బాధించింది. ఈ విషయం గురించి ఇంట్లో వారికి కూడా చెప్పాడు. కానీ అతను చెప్పిన విషయాల గురించి కుటుంబ సభ్యులు సీరియస్‌గా తీసుకోలేదు. బాలుని ఆత్మ పిలుస్తుందనే భయం వల్లే సౌరభ్ ఆత్మహత్య చేసుకున్నాడ’ని పోలీస్ అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment