బాలుడిని నిర్బంధించిన విద్యార్థులు
బాలుడిని నిర్బంధించిన విద్యార్థులు
Published Sun, Nov 6 2016 11:44 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
గుంటూరు ఈస్ట్: నాలుగు రోజులుగా కన్నకొడుకుని కొందరు యువకులు గదిలో బంధించి కొడుతుంటే తల్లడిల్లిన నిరుపేదలైన తల్లిదండ్రులు ఎవరైనా రక్షిస్తారేమోనని గుంటూరు నగరానికి వచ్చారు. ప్రతిపోలీస్టేషన్‌కు వెళ్లి తమ కన్నబిడ్డను రక్షించండి.. అంటూ వేడుకున్నారు. ఎస్పీ కార్యాలయం ఎక్కడో తెలియక లాలాపేట పోలీస్టేషన్ ఎస్పీ కార్యాలయం అనుకుని కనపడ్డ ప్రతికానిస్టేబుల్‌ను తమ బిడ్డను కాపాడాలని కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుడు కొమ్ము యోహాను తెలిపిన వివరాల ప్రకారం.. సంగం జాగర్లమూడిలో కొమ్ము యోహాను, ప్రభావతికి ఇద్దరు పిల్లలు.. వేణుగోపాల్, వేణు. పిల్లలిద్దరినీ వడ్లమూడి మెయిన్‌రోడ్డులో ఉన్న ప్రయివేటు హాస్టళ్ల్సలో పాచిపని చేసేందుకు పెట్టారు. గురువారం తెల్లవారు జామున హాస్టల్లో ఉండే కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు తమ సెల్‌ఫోన్‌లు చోరీ చేసాడంటూ యోహాను చిన్న కుమారుడైన 14 ఏళ్ల వయసుగల వేణుని గదిలో బంధించారు. విషయం తెలుసుకున్న యోహాను, ప్రభావతి విద్యార్థుల వద్దకు వెళ్లి కాళ్లవేళ్లా పడి బతిమిలాడారు. వారు ఏమాత్రం కనికరించకపోగా ఇక్కడే ఉంటే మిమ్మల్ని కూడా గదిలో వేసి కొడతామని బెదిరించారు. అప్పట్నించి రోజూ హాస్టల్‌కు వెళ్లి తమ కుమారుడిని విడిచి పెట్టాలంటూ వేడుకుంటున్నారు. అయినా వారు కనికరించడంలేదు. తమ బిడ్డను ఏం చేస్తారోనన్న భయంతో గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి ఆదివారం బయలుదేరి వచ్చారు. అయితే ఎస్పీ కార్యాలయం అని చెప్పడం చేతకాక పోలీసులను కలవాలంటూ గుంటూరు నగరానికి చేరిన దగ్గరి నుంచి చెబుతుండటంతో చివరకు మధ్యాహ్నానికి లాలాసేట స్టేషన్‌కు చేరుకున్నారు. అధికారులు ఎవరూ లేకపోవడంతో సెంట్రీ కానిస్టేబుల్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అతను ఇచ్చిన సలహా మేరకు మేరకు తిరిగి చేబ్రోలు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు బయలు దేరారు. తమ బిడ్డకు ఏమవుతుందోనని వారు సాక్షితో ఆందోళన వ్యక్తంచేశారు.
Advertisement
Advertisement