సాక్షి, చెన్నై: వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు.. పరీక్ష ముగిసిన ఆనందంలో వెన్నెల వెలుగులో మందు పార్టీ అంటూ రైలు పట్టాల మధ్య కూర్చుని పూటుగా మద్యం తాగారు. దురదృష్టవశాత్తూ అదే సమయంలో రైలు వచ్చింది. మద్యం మత్తులో జోగాడుతూ కదల్లేని పరిస్థితుల్లో నలుగురు విద్యార్థులు రైలు కింద పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రావత్తూరు రైల్వేవంతెన సమీపానికి రైలు వచ్చినప్పుడు ట్రాక్‌పై కొందరు కూర్చుని ఉండడాన్ని గమనించిన డ్రైవర్ హారన్ మోగించాడు. అయినా ఎవరూ కదల్లేదు. రైలును ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వంతెన దాటాక రైలాగింది. గార్డు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది వెనక్కి వచ్చి చూడగా.. నలుగురు యువకులు సంఘటన స్థలంలోనే విగతజీవులై కనిపించారు. గాయాలతో బయటపడిన మరో యువకుడ్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నట్టు తేలింది. మృతులను కొడైకెనాల్‌కు చెందిన సిద్ధిక్ రాజ (22), రాజశేఖర్ (22), రాజపాళయంకు చెందిన కరుప్పుస్వామి (22), గౌతమ్ (22)లుగా గుర్తించారు. తేనికి చెందిన విశ్వేషన్ (22) గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment