సాక్షి, బెంగళూరు: బెంగళూరులో చదువుకున్న పట్టభద్రులు కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందుతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘ఇండియా స్కిల్స్–2018’ పేరుతో ఏఐసీటీఈ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో గ్రాడ్యుయేషన్ చదువులో నాణ్యత, కంపెనీల నియామకాల్లో బెంగళూరు విద్యార్థులు ముందంజలో ఉన్నట్లు తేలింది. చెన్నై, ఇండోర్, లక్నో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2017లో పలు కంపెనీలు చేసిన నియామకాలతో పోలిస్తే ఈ ఏడాది 10 నుంచి 15 శాతం ఎక్కువగా బెంగళూరు నుంచి గ్రాడ్యుయేట్లను ఉద్యోగాలకు ఎంచుకున్నాయి. అత్యధిక ఉపాధి అవకాశాలు ఉన్న తొలి 10 రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగో స్థానంలో నిలిచింది.
కంప్యూటర్ సైన్స్, ఐటీకి డిమాండ్..
దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు, 120కి పైగా కార్పొరేట్ కంపెనీల నుంచి సమాచారం సేకరించి ఈ సర్వే నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులు చేసిన గ్రాడ్యుయేట్లలో ప్రతి ముగ్గురిలో ఒకరికి వెంటనే ఉద్యోగం వస్తోందని తేలింది. 52 శాతం మంది తాజా గ్రాడ్యుయేట్లు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందుతున్నట్లు సర్వే పేర్కొంది. ఎంబీఏ, కామర్స్, ఐటీఐ ఉత్తీర్ణులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని వివరించింది. సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుల వైపు చాలా తక్కువమంది ఆసక్తి చూపుతున్నారని తెలిపింది.
ఏఐసీటీఈ చర్యల వల్లే..
ఏఐసీటీఈ అమలు చేస్తోన్న చక్కటి బోధన, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు, పరిశ్రమలతో ఇంటరాక్షన్, రియల్ టైమ్ ప్రాజెక్టులు విద్యార్థుల నైపుణ్యాలను పెంచుతున్నాయని, అందుకే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటితోపాటు ఉన్నత్ భారత్ అభియాన్, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, స్టూడెంట్ స్టార్టప్ పాలసీ తదితర పథకాల ద్వారా మరెంతో మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు.
బెంగళూరులో చదువు.. వెంటనే కొలువు
Published Mon, Feb 19 2018 2:57 AM | Last Updated on Mon, Feb 19 2018 2:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment