పట్టాలు ఉన్నా.. అందులో కొంత మందికే అదృష్టం | Tcs Survey On Aicte Engineering Undergraduate Students | Sakshi
Sakshi News home page

పట్టాలు ఉన్నా.. అందులో కొంత మందికే అదృష్టం వరిస్తోంది

Published Thu, Dec 30 2021 2:32 AM | Last Updated on Thu, Dec 30 2021 5:48 AM

Tcs Survey On Aicte Engineering Undergraduate Students - Sakshi

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) లెక్కల ప్రకారం 2019–20లో దేశంలో 6,09,632 మంది ఇంజనీరింగ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు పూర్తి చేస్తే.. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టీసీఎస్‌ సర్వే ప్రకారం, అందులో 2 శాతం మంది మాత్రమే ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో 4,19,455 మంది అరకొర వేతనాలతో ఉద్యోగాల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో 47,264 మంది గ్రాడ్యుయేషన్‌ (ఇంజనీరింగ్‌ సహా) పూర్తి చేస్తే... 38,423 మందికి ఉద్యోగాలొచ్చాయి. అయితే, ఉపాధి పొందిన వాళ్ళల్లో దేశంలో 6 వేల మంది, తెలంగాణలో సుమారు వెయ్యి మంది మాత్రమే మంచి వేతనం, బహుళజాతి సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పొందారు. మిగతా వాళ్లంతా కాల్‌సెంటర్స్‌.. ఇతర చిన్నా చితక ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా తర్వాత ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. బహుళజాతి సంస్థలు ఫ్రెషర్స్‌కు తలుపులు బార్లా తెరుస్తున్నాయి. కానీ మార్కెట్‌ అవసరాలకు తగ్గ మంచి సాంకేతిక నిపుణత మాత్రం వారిలో కన్పించడం లేదు. ఏటా ప్రముఖ కంపెనీల్లో మంచి వేతనాలతో ఉద్యోగాల్లో చేరుతున్నవారి సంఖ్యకు నాలుగు రెట్లకు మించి నిపుణులు ప్రస్తుతం అవసరమని కంపెనీలు చెబుతున్నాయి. కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డీప్‌ లెర్నింగ్‌ నిపుణులతో పాటు ఇతర మార్కెట్‌ అవసరాలకు తగ్గ నిపుణులు కావాలని పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా 14 లక్షల మంది గ్రాడ్యుయేట్స్‌ బయటకి వస్తుంటే, వీళ్లలో మంచి కంపెనీల్లో, వారి అర్హతకు తగిన ఉద్యోగాలు పొందుతున్నది మహా అయితే 4 శాతమే కావడం నిపుణత కొరతను స్పష్టం చేస్తోంది. 

పట్టు లేని పట్టాలే కారణం
‘దశాబ్దకాలంగా సంప్రదాయ డిగ్రీలు, ఇంజనీరింగ్‌ కోర్సులను విద్యార్థులు ఇష్టపడటం లేదు. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఆ కోర్సులు చేసిన విద్యార్థుల్లో చాలామంది ఈ తరం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు పనికి రావడం లేదు. ఉదాహరణకు కరోనా తర్వాత మారిన పరిస్థితుల్లో బహుళజాతి కంపెనీలకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని కంపెనీలు ఫ్రెషర్స్‌ స్కిల్స్‌ను పరిశీలించాయి. వాళ్ళు కేవలం కంప్యూటర్‌ బేసిక్‌ లాంగ్వేజ్, మహా అయితే డేటా బేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీబీఎంఎస్‌) గురించే చెబుతున్నారు. అయితే ఆర్టిఫీసియల్‌ ఇంటిలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డీప్‌ లెర్నింగ్, నో సీక్వెల్‌ (ఎస్‌క్యూఎల్‌)లో అడ్వాన్స్‌ టాపిక్‌ తెలిసి ఉన్నవాళ్లే కొత్తగా వచ్చే ప్రాజెక్టులు చేయగలరు.

అలాంటప్పుడు కేవలం బేసిక్‌ నాలెడ్జ్‌ ఉన్న వాళ్ళను రిక్రూట్‌ చేసుకుని ఏం చేయాలి?’అని టీసీఎస్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ నిపుణులు సతీష్‌ ప్రశ్నించారు. ‘కేవలం ఐఐటీల్లో చదివిన వారిలోనే మంచి నైపుణ్యం ఉంటోంది. కానీ వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికే ఇష్టపడుతున్నా రు. పోనీ కొత్తవాళ్ళను తీసుకుని ట్రైనింగ్‌ ఇద్దామన్నా... వాళ్లు అన్నీ తెలుసుకుని నేర్చుకునేలోగా ప్రాజెక్టు గడువు పూర్తవుతుంది. మళ్ళీ కొత్త ప్రాజెక్టు వస్తే అప్పుడు ఏ స్థాయి నైపుణ్యం అవసరం అవుతుందో తెలియదు. ఈ పరిస్థితుల్లోనే ఎంతో కొంత స్పీడ్‌ ఉన్న వాళ్ళను తీసుకుని ముందుకెళ్తున్నాం. వి దేశీ వర్శిటీల్లో మన ఐఐటీల స్థాయి నైపుణ్యం, మార్కెట్‌ అవసరాలను చేరుకునే విద్య అందిస్తున్నా రు. ఖర్చు ఎక్కువైనా వీళ్ళను ఉద్యోగాల్లోకి తీసుకోక తప్పడం లేదు..’అని ఆయన వివరించారు.

నైపుణ్యం పెంచాలని ఎప్పుడో చెప్పారు 
రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నియమించిన శ్యాంపిట్రోడా నివేదికే.. దేశంలో 2 శాతానికి మించి సాంకేతిక నైపుణ్యం గల మానవవనరులు లేవని చెప్పింది. అందువల్ల సాంకేతిక విద్యలోనూ సంస్కరణలు జరగాలి. బోధన ప్రణాళిక మార్చాలి. ప్రపంచవ్యాప్తంగా పనికొచ్చే సాంకేతిక నైపుణ్యం పెరిగేలా చదువు సాగాలి. మూస విధానం కాకుండా... ప్రపంచంతో పోటీ పడేలా విద్యా వ్యవస్థను మార్చాలి. సమస్య ఎక్కడంటే.. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మన దేశంలో తయారయ్యే ఐఐటీ నిపుణులను విదేశాలు ఎక్కువ జీతంతో తీసుకెళ్తుండటంతో సమస్యలు వస్తున్నాయి. 
– రవీందర్, వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ

ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌తో నైపుణ్యం
టీసీఎస్‌ టీం పూర్తిగా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ వల్లే విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందని చెబుతోంది. మాకు ఇచ్చే శిక్షణలోనూ దీనికే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దిశగా అనేక ఉదాహరణలు, కేస్‌ స్టడీలు ముందుకు తెస్తున్నారు. దీని ఆధారంగా డేటా సైన్స్‌లో మార్పులు చేస్తున్నాం. 
– డాక్టర్‌ భట్టాచార్య (ఉస్మానియా యూనివర్సిటీ డేటా సైన్స్‌ అధ్యాపకుడు)

శిక్షణలో తెలంగాణ ముందడుగు
మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారుచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముందుగా గుర్తించింది. ఈ క్రమంలోనే టీసీఎస్‌తో ఒప్పందం చేసుకున్నాం. వారి సహకారంతో ముందుగా బోధనా సిబ్బందిని తయారు చేస్తున్నాం. టీసీఎస్‌ ఐఐటీ ప్రొఫెషనల్స్‌ బృందం ఇప్పటికే ఫ్యాకల్టీకి ఆన్‌లైన్‌ శిక్షణ మొదలెట్టింది. డిగ్రీలో డేటా సైన్స్‌లో కంప్యూటర్‌ కోర్సును 10 భాగాలుగా విభజించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అత్యాధునిక సాంకేతికతను అవగతం చేస్తున్నారు. తర్వాత ప్రతి విద్యార్థికి అవరమైన సలహాలు సూచనలు ఇస్తారు. ఇవన్నీ అంతర్జాతీయ సాంకేతిక మార్పులతో అనుసంధానమై ఉంటాయి. వీళ్ళకు టీసీఎస్‌ ఇతర కంపెనీలతో కలిసి పరీక్ష పెట్టి, సర్టిఫికెట్‌ ఇస్తుంది. 
– ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్‌)

కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఏరీ?
నిజం చెప్పాలంటే రాష్ట్రంలోని ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా బోధించే అధ్యాపకులు తగిన సంఖ్యలో లేరు. ఇప్పటికీ జావా, సీ... సీ ప్లస్‌.. ఇంకా బేసిక్‌ లాంగ్వేజ్‌తోనే బోధనాంశాలు ఉంటున్నాయి. అధ్యాపకులూ దీనికే అలవాటు పడ్డారు. ఐటీలో వస్తున్న సాంకేతిక మార్పులు కేవలం ఐఐటీల్లోనే అంది పుచ్చుకుంటున్నారు. నిజానికి డీప్‌ లెర్నింగ్‌ బోధించే స్థాయి ఉన్న అధ్యాపకుడికి బహుళ జాతి సంస్థలు నెలకు రూ. 5 లక్షల వరకు వేతనం ఇస్తాయి. అదే కాలేజీల్లో బోధిస్తే రూ. 50 వేలకు మించి ఇవ్వరు. అందుకే నాణ్యమైన, నేటి తరానికి అవసరమైన బోధించే స్కిల్స్‌ ఉన్న అధ్యాపకులు కాలేజీల్లో ఉండటం లేదు.
– దత్త ప్రసాద్, (గతంలో డేటా సైన్స్‌ ఫ్యాకల్టీ... ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement