ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో గణితం సబ్జెక్టులో వెనుకబాటు ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా ఆయా కోర్సుల్లో వారు తగిన నైపుణ్యాలను అలవర్చుకోలేకపోతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరఖ్ సర్వే వెల్లడించింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో కీలకమైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఏఐసీటీఈ ‘పరఖ్’ పేరిట ఈ స్టూడెంట్ లెర్నింగ్ అసెస్‌మెంట్ (విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మూల్యాంకనం)ను ఇటీవల నిర్వహించింది.
చదవండి: పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్‌సీ కీలక ఆదేశాలు..
ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. సాంకేతిక విద్యలో అభ్యసన లోపాలను గుర్తించేందుకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఏఐసీటీఈ పరఖ్ పేరిట ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2,003 సాంకేతిక విద్యాసంస్థలకు సంబంధించిన 1.29 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అభ్యర్థులు తమ అభ్యసన సామర్థ్యాలను ఈ పరఖ్ సర్వే ద్వారా స్వయం మూల్యాంకనం చేసుకునేలా దీన్ని నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నమోదైన ఈ సర్వే గణాంకాలను ఏఐసీటీఈ విశ్లేషించి నివేదికలు విడుదల చేసింది.
గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఆప్టిట్యూడ్ టెస్ట్
ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులకు పరఖ్ ద్వారా ఏఐసీటీఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు అంశాలతోపాటు ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహించింది. సెకండియర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు ఆయా కోర్ సబ్జెక్టు అంశాలను ఆధారం చేసుకొని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంశాల్లో స్వయం సామర్థ్య పరీక్షలను పెట్టింది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు కోర్ సబ్జెక్టుల్లోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాలపైనా నిర్వహించింది.
మ్యాథ్స్‌లోనే సమస్యలు..
ఏఐసీటీఈ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. ఫస్టియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అన్ని మేజర్ ప్రోగ్రాముల్లోనూ మ్యాథమెటిక్స్‌లోనే సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఈ విద్యార్థులకు గణితం సబ్జెక్టులో ప్రాథమిక స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు సరిగా అలవడకపోవడమేనని పేర్కొంది. ప్రాథమిక, మాధ్యమిక, హయ్యర్ సెకండరీ స్థాయిల్లో గణితం సబ్జెక్టులో వీరికి తగిన సామర్థ్యాలు అలవడలేదని వివరించింది. అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠశాల స్థాయిలోని సామర్థ్యలోపాలు ఇప్పుడు సమస్యగా మారాయని పేర్కొంది. 22,725 మంది ఫస్టియర్ విద్యార్థులకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాల్లో నైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండగా.. గణితంలో మరింత అధ్వానంగా ఉన్నారని తేల్చింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి జనరల్ నాలెడ్జి, తదితర అంశాల్లోనూ చాలా వెనుకబడి ఉన్నారని స్పష్టం చేసింది.
సబ్జెక్టులవారీగా స్కోర్లు ఎంతంటే..
పరఖ్ ద్వారా నిర్వహించిన సర్వే పరీక్షలో విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను అనుసరించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్టుల్లో ఏయే విభాగాల విద్యార్థులు ఎంత స్కోర్ చేశారో పరిశీలిస్తే అన్ని విభాగాల్లోనూ సగం శాతమే స్కోర్ ఉంది.
గణితంలో..
♦గణితంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సాధించిన సగటు స్కోరు 37.48 శాతం మాత్రమే.
♦ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విద్యార్థుల సగటు స్కోరు 38.9 శాతం.
♦మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 39.48 శాతం
♦ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.02 శాతం
♦కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.12 శాతం
ఫిజిక్స్‌లో..
♦ఫిజిక్స్ అంశాల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. 52.5 శాతం సగటు స్కోర్‌తో మంచి ప్రతిభ చూపారు.
♦వీరి తర్వాత 51 శాతం స్కోర్‌తో కంప్యూటర్ సైన్స్, 50 శాతం స్కోర్‌తో మెకానికల్ విద్యార్థులు వరుస స్థానాల్లో ఉన్నారు.
కెమిస్ట్రీలో..
కెమిస్ట్రీ ప్రశ్నలకు సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 53.1% సగటు స్కోర్‌తో అగ్రభాగాన ఉన్నారు. సీఎస్‌ఈ విద్యార్థులు 53%, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 51.3 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచారు.
ఆప్టిట్యూడ్ టెస్టులో..
ఆప్టిట్యూడ్ టెస్టుకు సంబంధించి జనరల్ నాలెడ్జి తదితర అంశాల్లో విద్యార్థుల లోపాలు పరఖ్ సర్వేలో వెల్లడయ్యాయి. జనరల్ నాలెడ్జి, లాజికల్ రీజనింగ్ తదితర అంశాల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు.
సర్వేలో పాల్గొనని అనేక విద్యాసంస్థలు
పరఖ్ సర్వేలో ఐఐటీలు సహా అనేక సాంకేతిక విద్యాసంస్థలు పాల్గొనలేదు. తమిళనాడు నుంచి 24,499 మంది పాల్గొనగా.. అత్యల్పంగా గోవా నుంచి ముగ్గురు విద్యార్థులే పాల్గొన్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ల నుంచి 12,387 మంది విద్యార్థులు ఈ పరఖ్ సర్వేలో భాగస్వాములయ్యారు. ఏపీ నుంచి 5,628, తెలంగాణ నుంచి 4,234, కర్ణాటక నుంచి 8,739, కేరళ నుంచి 3,431, మహారాష్ట్ర నుంచి 11,334, యూపీ నుంచి 5,288 మంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment