ఇంజనీరింగ్‌లో 14 వేల సీట్ల కోత! | 14,000 seats cut in engineering | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌లో 14 వేల సీట్ల కోత!

Published Tue, May 2 2017 2:16 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

ఇంజనీరింగ్‌లో 14 వేల సీట్ల కోత!

ఇంజనీరింగ్‌లో 14 వేల సీట్ల కోత!

- 2017–18లో 242 కాలేజీల్లోని 1.24 లక్షల సీట్లకే అనుమతి
- వృత్తి విద్యా కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈసారి 14 వేల సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కోత విధించింది. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరం 33 కాలేజీలకు అనుమతులు తగ్గగా, వాటిల్లోని 14 వేల సీట్లకు కోత ఏఐసీటీఈ పెట్టింది. 2017–18 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్య కాలేజీలకు ఏఐసీటీఈ తాజాగా అనుమతులు జారీ చేసింది. గతేడాదితో పోల్చితే బీ ఫార్మసీలో 2 వేలు, ఎంబీఏలో 5 వేలు, ఎంసీఏలో 1,500కు పైగా సీట్లకు కోత పడింది. ఎంటెక్‌లోనూ 7 వేల సీట్లకు అనుమతులి లభించలేదు. ఎంఫార్మసీలో వేయి, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 5 వేల సీట్లకు కోత పడింది.

అయితే త్వరలో మరిన్ని కాలేజీలు, సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం లభిస్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాగా, ఈసారి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సీట్ల సంఖ్య పెరిగింది. హుస్నాబాద్‌ కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీలో ప్రవేశాలకు అనుమతి లభించింది. గతేడాది రాష్ట్రంలో 56 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 11,980 సీట్లు ఉండగా, ఈసారి 57 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 12,100 సీట్లకు అనుమతి వచ్చింది. ఇంజనీరింగ్‌లో 242 కాలేజీల్లోని 4,613 బ్రాంచీలకు అనుమతి లభించింది.

మరింతగా తగ్గనున్న ఇంజనీరింగ్‌ సీట్లు..
రాష్ట్రంలో ఈసారి ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది రాష్ట్రంలోని 275 కాలేజీల్లో 1,38,168 సీట్లకు అనుమతినిచ్చిన ఏఐసీటీఈ.. ఈసారి 242 కాలేజీల్లోని 1,24,239 సీట్లకు మాత్రమే అనుమతిచ్చింది. మరోవైపు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో జవహార్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం తనిఖీలు పూర్తి చేసింది. ప్రస్తుతం తనిఖీ నివేదికల పరిశీలన జరుపుతోంది. వాటిలో లోపాలున్న కాలేజీలకు అనుమతులిచ్చే అవకాశం లేదు. దీనికితోడు సీట్లు, బ్రాంచీల తగ్గింపునకు 81 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మరో 11 కాలేజీలు పలు కోర్సులు, ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను నిలిపేసేందకు (క్లోజర్‌) దరఖాస్తు చేసుకున్నాయి. ఆ ప్రకారం మరో 20 వేల సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది.

ఎంటెక్‌లోనూ భారీ కోత..
ఎంటెక్‌లో అనుమతులు పొందిన కాలేజీల సంఖ్య తగ్గడంతో ఈసారి 7 వేల వరకు సీట్లకు కోత పడింది. గతేడాది 264 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 32,086 ఎంటెక్‌ సీట్లకు ఏఐసీటీఈ అనుమతివ్వగా ఈసారి 203 ఇంజనీరింగ్‌ కాలేజీలకు, వాటిల్లో 25,140 సీట్లకే అనుమతులు మంజూరు చేసింది. కాగా, కాలేజీల్లో లోపాల కారణంగా జేఎన్‌టీయూహెచ్‌ మరిన్ని సీట్లకు కోత పెట్టే అవకాశముంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement