ఇంజనీరింగ్, డిప్లొమా చదివే విద్యార్థినులకు ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్ ప్రకటన వచ్చేసింది. ప్రతిభావంతులైన విద్యార్థినులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రతి ఏటా ఈ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
గతంలో ఇలా
ఏఐసీటీఈ గతంలో 4వేల మందికి స్కాలర్‌షిప్స్‌ను అందించేది. ఇందులో బీటెక్ అభ్యసించేవారికి 2000, డిప్లొమా వారికి 2000 చొప్పున కేటాయించింది. ప్రస్తుతం 2021 ఏడాది సంబంధించి ఈ స్కాలర్‌షిప్స్ సంఖ్యను భారీగా పెంచింది. 4 వేల నుంచి 10వేలకు(బీటెక్–5000, డిప్లొమా–5000)పెంచింది.
ఆర్థిక ప్రోత్సాహం
ప్రగతి స్కాలర్‌షిప్ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.50వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాలేజీ ఫీజు, కంప్యూటర్ కొనుగోలు, స్టేషనరీ, బుక్స్, ఎక్విప్‌మెంట్ తదితర అవసరాలన్నింటికీ కలిపి ఈ మొత్తాన్ని డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) విధానంలో అందజేస్తారు.
అర్హత
ఏఐసీటీఈ గుర్తింపు పొంది టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫస్ట్ ఇయర్ బీటెక్/డిప్లొమా కోర్సుల్లో చేరి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకుండా ఉండాలి. కుటుంబంలో అర్హులైన విద్యార్థినులు ఇద్దరూ ఉంటే ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంబంధిత కాలేజీలో బీటెక్/పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ధ్రువపత్రాలు
పదోతరగతి/ఇంటర్ అకడమిక్ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ పొందిన సర్టిఫికేట్, ట్యూషన్ ఫీజు రిసిప్ట్, ఆధార్‌తో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఫోటోగ్రాఫ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021
► వెబ్‌సైట్: https://www.aicte-india.org/
Comments
Please login to add a commentAdd a comment