సుప్రీం తీర్పు నేపథ్యంలో యూజీసీ కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: టెక్నికల్ కాలేజీలకు ఇకపై యూని వర్సిటీలే అనుమతులిస్తాయి. కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకునే అధికార మూ వాటికే ఉంటుంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తాజాగా ఈ నిబంధనలు రూపొందించింది. ఇప్పటివరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కే ఈ అధికారాలున్న సంగతి తెలిసిందే. అయితే ఏఐసీటీఈ కేవలం సలహా సంస్థ మాత్రమేనని, కాలేజీల పర్యవేక్షణ, అనుమతులిచ్చే అధికారాలు లేవన్న సుప్రీం తీర్పు నేపథ్యం లో యూజీసీ తాజా నిర్ణయం తీసుకుంది. సాంకేతిక విద్యా కళాశాలల్లో బోధన, పరీక్షలు, పరిశోధనలు, ప్రమాణాల పెంపు కోసం కొత్త నిబంధనలు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీం తీర్పును ఉటంకిస్తూ ఇన్నాళ్లు ఏఐసీటీఈ నిర్వహించిన బాధ్యతలు, అధికారాలను తమకు అప్పగించాల ని ఉన్నత విద్యా మండలి తరఫున ప్రభుత్వం యూజీసీకి ఇప్పటికే లేఖరాసింది. అయితే జాతీయస్థాయిలో నిర్ణయం తీసుకున్నందున ఈ వినతిని యూజీసీ పరిగణనలోకి తీసుకోలేదు.
తాజా నిబంధనల్లోని ప్రధానాంశాలు..
ఇంజనీరింగ్, ఎంసీఏ తదితర కోర్సులు నిర్వహించే సాంకేతిక విద్యా కాలేజీలు అనుమతుల రెన్యువల్ కోసం ఇకపై సంబంధిత విశ్వవిద్యాల యాల అనుమతి తీసుకోవాలి.
కొత్త కాలేజీలు గుర్తింపు పొందాలంటే నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్) అక్రెడిటేషన్ తప్పనిసరి.
గుర్తింపు కోసం కొత్త కాలేజీలు దరఖాస్తు చేసుకునేప్పుడు ఆరు నెలల్లో నాక్ అక్రెడిటేషన్ తెచ్చుకుంటామని అండర్‌టేకింగ్ ఇస్తేనే యూనివర్సిటీలు అనుమతినివ్వాలి.
ఆరేళ్లకన్నా ఎక్కువ కాలం నుంచి నడుస్తున్న కాలేజీలు ఇప్పటి నుంచి ఆరునెలల్లోగా నాక్ అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఇప్పటికే నాక్ అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలు, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్‌బీఏ) గుర్తింపు కలిగిన కోర్సుల విషయంలో ఇతర అన్ని నిబంధనలు పాటిస్తుంటే.. వాటికి శాశ్వత గుర్తింపునిచ్చే అం శాన్ని యూనివర్సిటీలు పరిశీలిస్తాయి.
యూనివర్సిటీలు తాము గుర్తింపు ఇచ్చిన కాలేజీల సమగ్ర సమాచారాన్ని, నిబంధనలు పాటిస్తున్న తీరును పేర్కొంటూ ఏటా యూజీసీకి నివేదిక అం దజేయాలి.
కాలేజీలకు గుర్తింపు మంజూరు చేసే విషయంలో యూనివర్సిటీలు నిబంధనలను అతిక్రమిస్తే వాటికి గ్రాంట్స్ నిలిపివేయడంతోపాటు యూజీసీ గుర్తింపు రద్దవుతుంది.