
మరో 30 వేల సీట్లు కోత!
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కూడా భారీగా సీట్లకు కోత పడనుంది.
- ఇంజనీరింగ్‌లో 15 వేల సీట్ల రద్దుకు కాలేజీల దరఖాస్తు
- లోపాలతో మరో 15 వేల సీట్లకు కోత పడే అవకాశం
- 80 కాలేజీల్లో బ్రాంచీల కోత.. సీట్ల రద్దు, కాలేజీల మూతకు దరఖాస్తులు
- పూర్తిగా ప్రవేశాలే వద్దని దరఖాస్తు చేసుకున్న 19 కాలేజీలు
- ఫార్మసీలోనూ ఇదే తరహా పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కూడా భారీగా సీట్లకు కోత పడనుంది. ఇప్పటికే 15 వేల సీట్లను రద్దు చేయాలంటూ కాలేజీల యాజమాన్యాలే దరఖాస్తు చేసుకోగా.. లోపాల కారణంగా మరో 15 వేల వరకు సీట్లకు కోత పడే పరిస్థితి కనిపిస్తోంది.
నాణ్యతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత వంటి కారణాలతో గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. కొన్ని కాలేజీలు ప్రవేశాలు లేక స్వచ్ఛందంగా సీట్ల రద్దుకు విజ్ఞప్తి చేస్తుండగా.. లోపాలున్న కారణంగా కొన్ని కాలేజీలకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు నిరాకరిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కూడా ఇంకొన్నిటికి అనుమతులను నిలిపివేస్తోంది. ఇంజనీరింగ్ లోనే కాదు ఫార్మసీలోనూ ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.
నాణ్యతపై దృష్టి
ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించే ఉద్దేశంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలు పాటించే కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. తగిన సంఖ్యలో అర్హులైన ఫ్యాకల్టీతోపాటు ల్యాబ్, ఎక్విప్‌మెంట్, కంప్యూటర్లు, ఇతర మౌలిక సదుపాయాలున్న కాలేజీలకే అనుమతులు ఇచ్చే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో 95 శాతం ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చే జేఎన్టీయూ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది ఏఐసీటీఈ గుర్తింపు నిరాకరణ, బ్రాంచీల రద్దుతో 10 వేల వరకు సీట్లు తగ్గిపోగా.. 58 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోకపోవడంతో మరో 10 వేల సీట్లు తగ్గాయి. ఇక 8 కాలేజీలకు జేఎన్టీయూ గుర్తింపు నిరాకరించింది. దాంతో మొత్తంగా గతేడాది 37 వేల సీట్లకు కోతపడింది. ఈసారి అదనంగా మరో 30 వేల సీట్లకు కోత పడే అవకాశం కనిపిస్తోంది.
15 వేల సీట్ల రద్దు కోసం..
రాష్ట్రంలోని 19 ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తంగా ప్రవేశాలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా.. 80కి పైగా కాలేజీలు పలు బ్రాంచీల రద్దు కోసం విజ్ఞప్తి చేసుకున్నాయి. ఇక వివిధ బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకునేందుకు 10కి పైగా కాలేజీలు దరఖాస్తు చేశాయి. మొత్తంగా 15 వేల వరకు సీట్లు తగ్గిపోనున్నాయి.
ఫార్మసీలోనూ 4 వేల సీట్ల కోత
గతేడాది ఫార్మసీలోనూ దాదాపు 4 వేల సీట్లకు కోత పడింది. రాష్ట్రంలోని 140 ఫార్మసీ కాలేజీల్లో 104 కాలేజీలు జేఎన్టీయూ పరిధిలో ఉన్నాయి. వాటిలో 70 కాలేజీలకు మాత్రమే అనుబంధ గుర్తింపు లభించింది. సరైన సంఖ్యలో అర్హులైన అధ్యాపకులు లేక వాటిలోని 2,500కు పైగా సీట్లకు కోత పడింది. కాకతీయ వర్సిటీ పరిధిలోని 5 కాలేజీల్లో 300కు పైగా సీట్ల అనుమతి రాలేదు. మరోవైపు 20 కాలేజీలు మూత పడటంతో 1,200 వరకు సీట్లు రద్దయ్యాయి. ఈసారి కూడా పెద్ద సంఖ్యలోనే సీట్లకు కోతపడే అవకాశం కనిపిస్తోంది.
ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు..
ఏడాది కాలేజీలు సీట్లు
2013–14 340 1,98,445
2014–15 326 2,09,530
2015–16 314 1,80,583
2016–17 285 1,41,513