![AICTE Decided To Start Academic Year From September 15 - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/3/aicte.jpg.webp?itok=7HR4bV_z)
సాక్షి, హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్‌తో విద్యా సంవత్సరం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల విద్యా సంవత్సరం సెప్టెంబర్ 15న షురూ కానుంది. ఈ మేరకు గురువారం అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్‌ను జారీ చేసింది. ఇంతకుముందు ప్రథమ సంవత్సరంలో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటి, ఇతర విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను సవరించింది. కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తరగతుల(విద్యా సంవత్స రం)ను ప్రారంభించాలని పేర్కొంది.
మిగతా విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులను మొదలుపెట్టాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును గతంలో జూన్ 30 వరకు ఇవ్వాలని పేర్కొనగా, ఇప్పుడు దానిని సవరించి జూలై 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని, మిగిలిన సీట్లను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని పేర్కొంది. పీజీసీఎం/పీజీడీఎం కోర్సుల్లో చేరిన వారికి ఆగస్టు 1వ తేదీకల్లా తరగతులు ప్రారంభించాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment